కెసిఆర్,బండి అయిపోయారు …ఇక రేవంత్ వంతు..

వరి ధాన్యం కొనుగోలు సమస్య పరిష్కరించాలని టీఆర్ఎస్, బీజేపీలు తమ ప్రయత్నాలు చేస్తుంటే కాంగ్రెస్ పార్టీ కూడా మేము సైతం రైతు వెంటే.. అంటూ ముందకు వచ్చింది. మంచిదే.. రైతుల సమస్య పరిష్కారానికి ఎవరు పోరాడినా అందరూ మద్దతు పలకాల్సిందే. కేసీఆర్ ఆధ్వర్యంలో టీఆర్ఎస్ పార్టీ ఇందిరా పార్కు వద్ద ధర్నా చేస్తే బీజేపీ నాయకులు రాష్ట్ర వ్యాప్తంగా నిరసన కార్యక్రమాలు చేపట్టారు. ఇపుడు రేవంత్ రెడ్డి నేత్రుత్వంలో కాంగ్రెస్ పార్టీ వరి దీక్షను ఈరోజు (శనివారం) ఇందిరాదీక్ష వద్ద ప్రారంభించింది. రెండు రోజుల పాటు అంటే ఆదివారం సాయంత్రం వరకు వరి దీక్షను టీ కాంగ్రెస్ నాయకులు చేపడుతున్నారు. దీక్షలో రేవంత్ తోపాటు ఉత్తమ్ కుమార్ రెడ్డి, కోమటిరెడ్డి, వీహెచ్ తదితర నాయకులు కూర్చున్నారు.

వరి సమస్యను పరిష్కరించాలి.. రైతుకు న్యాయం చేయాలంటూ నాయకులు ప్రసంగించారు. మధ్యలో కళాకారుల పాటలు కార్యకర్తలను హుషారు తెప్పించాయి. రైతుకుమద్దతుగా నాయకులు, వక్తలు మాట్లాడారు కానీ ..అసలు సమస్య పరిష్కారమవుతుందా, లేదా అనేది ప్రశ్నార్థకంగా మారింది. పార్టీలు దీక్షలు, ధర్నాలు చేసుకుంటూ పోతున్నాయే కానీ రైతుల ప్రాణాలు మాత్రం గాలిలో కలిసిపోతున్నాయి. వరి పండించి.. వేలకు వేల రూపాయలు పెట్టుబడి పెట్టి తీరా పంట చేతికి వచ్చిన తరువాత కొనేవారు లేకపోతే ఆ రైతు పరిస్థితి ఎంత దారుణంగా ఉంటుందో ఇపుడు ప్రత్యక్షంగా చూస్తున్నాం. ఇకనుంచైనా పార్టీలు, ప్రభుత్వాలు, నాయకులు తమ ఉనికి కోసం పోరాటాలు చేయడం కాదు.. జనం కోసం.. రైతుల కోసం మనస్ఫూర్తిగా పోరాటాలు చేస్తే సమస్యలు పరిష్కారమవుతాయి గానీ.. పేపర్లు,టీవీలలో కనిపించేందుకు ఆందోళనలు చేస్తే టైం పాస్ తప్ప ఉపయోగం లేదు.