ఈ ప్ర‌శ్న‌కు బాబు, ప‌వ‌న్‌, జ‌గ‌న్‌లు ఏమంటారో?

రాష్ట్ర విభ‌జ‌న‌తో ఏపీకి తీర‌ని అన్యాయం జ‌రిగింది. రాజ‌ధానిని కోల్పోయింది. ఆదాయం కోల్పోయింది. పెద్ద ఎత్తున వ‌న‌రుల‌ను కోల్పోయింది. ఇది అంద‌రికీ తెలిసిన విష‌యం. ఈ విష‌యంలో కేంద్రం మెడ‌లు వంచి విభ‌జ‌న స‌మ‌యంలో ఇచ్చిన హామీ మేర‌కు ప్ర‌త్యేక హోదా తెప్పించుకోవ‌డం, లోటు బ‌డ్జెట్ నిధులు విడుద‌ల‌య్యేలా చూడ‌డం, అప్ప‌లు, ఆస్తుల విష‌యంలో కేంద్రం జోక్యం చేసుకుని ఏపీ అభివృద్ధి చెందేలా చూడ‌డం వంటివి ఏపీలో అధికార‌, విప‌క్ష పార్టీల‌పై ఉన్నాయి. దీనికి తోడు ప్ర‌శ్నిద్దాం అంటూ ప్ర‌జ‌ల్లోకి వ‌చ్చిన ప‌వ‌న్ క‌ళ్యాణ్‌కి కూడా ఉంది.

అయితే, టీడీపీ అధినేత‌, సీఎం చంద్ర‌బాబు గానీ, వైసీపీ అధినేత‌, విప‌క్ష నేత జ‌గ‌న్ కానీ, జ‌న‌సేనాని ప‌వ‌న్ కానీ.. పైకి మాట‌లు చెబుతున్నంత స్పీడ్‌గా పోరాటాలు చేస్తున్నారా? అన్న‌ది ప్ర‌శ్న‌గానే మిగిలింది. ఇచ్చింది తీసుకుంటాం.. రావాల్సింది వ‌సూలు చేస్తాం.. అంటూ ప్ర‌త్యేక ప్యాకేజీ ఇచ్చిన సంద‌ర్భంగా టీడీపీ అధినేత చంద్ర‌బాబు వ‌ల్లెవేశారు. ఈ క్ర‌మంలో లోటు బ‌డ్జెట్ నిధులు కానీ, విశాఖ‌కు రైల్వే జోన్ కానీ, పోల‌వ‌రానికి పూర్తిస్థాయిలో నిధులు కానీ రాబ‌ట్ట‌లేక‌పోయారు.

కానీ,అవ‌కాశం దొరికి మైకందితే మాత్రం.. ఏపీకి అన్యాయం జ‌ర‌గ‌నివ్వ‌బోన‌ని, త‌న‌కు త‌న కొడుకు క‌న్నా రాష్ట్ర‌మే ఎక్కువ‌ని అంటారు. పోరాటాన్ని వీడేది లేదంటారు. అదేస‌మ‌యంలో కేంద్రంతో పోరాడితే ఫ‌లితం ఉండ‌ద‌ని, సానుకూలంగానే ప‌నులు చ‌క్క‌బెట్టుకోవాల‌ని ఉవాచిస్తారు. మ‌రి వీటిలో ఏది చేయాలో బాబు ఇప్ప‌టికైనా డిసైడ్ చేసుకుని ముందుకు వెళ్లాల‌ని అంద‌రూ కోరుతున్నారు. ఇక‌, విప‌క్షం వైసీపీ అధినేత జ‌గ‌న్‌.. కూడా మాట‌ల తూటాల‌ను లెక్క‌కు మిక్కిలి పేలుస్తూనే ఉంటారు.

హోదా విష‌యంలో బాబు అమ్ముడు పోయాడ‌ని, తాము పోరాటం చేస్తామ‌ని చెప్పిన జ‌గ‌న్‌. ఢిల్లీ ప‌ర్య‌ట‌న‌లో మోడీని క‌లిసిన్పుడు ఆ ఒక్క‌టీ త‌క్క‌! అని మోడీ అన్న‌ప్పుడు మౌనం ఎందుకు పాటించారో ఆయ‌నకు మాత్ర‌మే తెలియాలి. మైకు ముందుకు వ‌చ్చిన‌ప్పుడు, ప్ర‌జ‌ల‌ను చూసిన‌ప్పుడు గుర్తుకు వ‌చ్చే పోరాటాలు ఢిల్లీకి వెళ్ల‌గానే మాయ‌మైపోతున్నాయి. ఇక‌, మ‌రో నేత జ‌న‌సేనాని గ‌త కొన్నాళ్ల కింద‌ట రాష్ట్ర వ్యాప్తంగా ప్ర‌శ్నించేందుకే తాను పార్టీని పెడుతున్నాన‌ని, ఏపీ కోసం ఎవ‌రితోనైనా పోరాడ‌తాన‌ని సెల‌విచ్చాడు.

ఇప్పుడు పూర్తిగా కేంద్రం హామీల ప‌డ‌వ మునిగిపోయి.. 2019లో ఎన్నిక‌ల‌కు సిద్ధం అవుతున్న వేళ్ల‌. . ఇప్ప‌టికీ బీజేపీ అధిష్టానం ముందు పోరాటం చేసే స‌త్తావీరిలో ఏ ఒక్క‌రిలోనూ క‌నిపించ‌డం లేదు. నిజానికి తెలంగాణలో నేత‌లే న‌యాన్నో భ‌యాన్నో తాము అనుకున్న‌ది సాధించారు. మ‌రి ఏపీ నేత‌ల‌కు ఆ మాత్రం తెగువ లేదా? అన్న‌ది ప్ర‌శ్న‌. దీనికి బాబు, ప‌వ‌న్‌, జ‌గ‌న్‌లు ఏమంటారో?