జ‌గ‌న్ ఇలాకాలో సైకిల్ ర‌న్ గ్యారెంటీనా?

దాదాపు 40 ఏళ్ల‌కు పైగా వైఎస్ వంశానికి కంచుకోట‌గా ఉన్న క‌డ‌పలో ఇప్పుడు టీడీపీ జెండా ఎగ‌ర‌బోతోందా? చ‌ంద్ర‌బాబు ముందుగానే గీసుకున్న స్కెచ్ ప్ర‌కారం జ‌గ‌న్ కంచుకోట‌ను టీడీపీ బ‌ద్ద‌లు కొట్ట‌బోతోందా? 2019కి ముందుగానే ఎమ్మెల్సీ రూపంలో జ‌గ‌న్ ఇలాకాలో టీడీపీ పాగా వేయ‌బోతోందా? ఎంతైనా క‌ష్ట‌ప‌డి క‌డ‌పలో కాలు మోప‌డం ద్వారా జ‌గ‌న్ కూసాలు క‌దిలించాల‌ని చంద్ర‌బాబు భావిస్తున్నారా? అంటే ఔన‌నే స‌మాధాన‌మే వ‌స్తోంది అంటున్నారు టీడీపీ నేత‌లు.. మంత్రులు.

ప్ర‌స్తుతం తెర‌లేచిన ఎమ్మెల్సీ ఎన్నిక‌ల‌కు సంబంధించి క‌డ‌పను చంద్ర‌బాబు ప్ర‌తిష్టాత్మ‌కంగా తీసుకున్నారు. వైఎస్ కుటుంబానికి వెన్నుద‌న్నుగా ఉంటున్న క‌డ‌ప‌ను త‌మ వైపున‌కు తిప్పుకోవ‌డం ద్వారా జ‌గ‌న్‌కి భారీ షాక్ ఇవ్వాల‌ని నిర్ణ‌యించుకున్నారు. ఈ నేప‌థ్యంలోనే క‌డ‌ప‌లో మంచి ప‌లుకుబ‌డి, డ‌బ్బు అన్ని అండ‌దండ‌లు ఉన్న బీటెక్ ర‌విని ఎమ్మెల్సీగా రంగంలోకి దించారు. ఈ నేప‌థ్యంలో ఈ ఎమ్మెల్సీ సీటుపై స‌ర్వ‌త్రా ఆస‌క్తి రేకెత్తుతోంది. నిజానికి ఈ స్థానంలో మొత్తం 824 ఓట్లు ఉన్నాయి. వీటిలో టీడీపీకి 420 ఉన్నాయి.

మిగిలిన‌వాటిలో 380 ఓట్లు జ‌గ‌న్ పార్టీకి ఉన్నాయి. ఈ నేప‌థ్యంలో కొంద‌రు క్రాస్ ఓటింగ్ చేసినా కూడా టీడీపీ అభ్య‌ర్థి గెలుపు సునాయాసం అవుతుంది. దీనిపైనే చంద్ర‌బాబు ధీమాగా ఉన్నారు. అయితే, ఇదే విష‌యంలో జ‌గ‌న్‌కి కంటిపై కునుకులేకుండా పోయింద‌ని అంటున్నారు. ఇన్నాళ్లుగా త‌మ‌కు ఎదురులేకుండా పోయిన క‌డ‌ప‌లో టీడీపీ సైకిల్ ర‌న్ చేస్తుండ‌డాన్ని ఆయ‌న జీర్ణించుకోలేక పోతున్నార‌ని టాక్‌. ఇక‌, త‌మ అభ్య‌ర్తి బీటెక్ ర‌వి గెలుపుపై మంత్రి గంటా శ్రీనివాస‌రావు కూడా ధీమాగా ఉన్నారు. వైఎస్‌ కుటుంబాన్ని తొలిసారి ఓడించబోతున్నామని మంత్రి సెల‌విచ్చారు.

ర‌వి త‌ర‌ఫున ప్రచారం చేయడానికి గంటా కడపకు వచ్చారు. ఈ సంధర్భంగా ఆయన మాట్లాడుతూ టీడీపీ ఎమ్మెల్సీ అభ్యర్థిగా బీటెక్‌ రవిని పోటీలో నిలబెట్టామని అతనే గెలుస్తాడని ధీమా వ్యక్తం చేశారు. ప్రజలకు తమ ప్రబుత్వం పూర్తి నమ్మకం ఉందని ఆయన అన్నారు. దీంతో ఈ ప‌రిణామం వైకాపా వ‌ర్గాల్లో కంటిపై కునుకులేకుండా చేస్తోంది. మ‌రి ఏం జ‌రుగుతుందో చూడాలి.