ఏపీలో ఇదో టైప్ రాజ‌కీయం…బాధితుల వ‌ద్ద రాజ‌కీయాలు..!

మొన్న విశాఖ.. నేడు నందిగామ‌!! సంఘ‌ట‌న‌లు వేర్వేరు కావొచ్చు. కానీ జ‌రిగిన ర‌చ్చ మాత్రం ఒక్క‌టే! హోదా కోసం యువ‌త పోరాడుతుంటే.. అందుకు మ‌ద్ద‌తు తెలిపేందుకు వ‌చ్చిన ప్ర‌తిప‌క్ష నేత జ‌గ‌న్‌ను అధికారులు ఎయిర్‌పోర్టులోనే అడ్డుకున్నారు. చివ‌ర‌కు అక్క‌డి నుంచే వెనుతిరిగేలా చేశారు. ఇప్పుడు నందిగామ‌లోనూ ఇదే పరిస్థితి. బ‌స్సు ప్ర‌మాదంలో మృతులు, క్ష‌త‌గాత్రుల‌ను ప‌రామర్శించేందుకు వ‌చ్చిన జ‌గ‌న్‌ను అధికారులు అడ్డుకున్నారు. వైసీపీ నేత‌లు కూడా అందుకు త‌గ్గ‌ట్టుగానే ప్ర‌వ‌ర్తించారు. అధికార‌, విప‌క్షాల మ‌ధ్య గ‌ల రాజ‌కీయ విభేదాలు పరాకాష్ట‌కు చేరాయన‌డానికి ఇంత‌కంటే నిద‌ర్శ‌నాలు అవ‌స‌రంలేదనేది విశ్లేష‌కుల అభిప్రాయం!

మృతుల కుటుంబాల విషాదాన్ని పక్కన పెట్టి అటు అధికార, ఇటు ప్రతిపక్ష పార్టీల నేతలందరూ రాజకీయం చేయటంలోనే నిమగ్నం అయ్యారు. అధికార ప‌క్షం, విప‌క్షం మ‌ధ్య రాజ‌కీయాలు హోరాహోరీగా జ‌రుగుతున్నాయి. ఎక్క‌డా తగ్గేది లేద‌న్న‌ట్లుగా నాయ‌కులు ప్ర‌వ‌ర్తిస్తున్నారు. అధికార పక్షంపై విరుచుకుప‌డాల‌ని, టీడీపీని కార్న‌ర్ చేయాల‌ని ప్ర‌తిప‌క్షం ఆరాట‌ప‌డుతుంటే.. ప్ర‌తిప‌క్ష నేతకు ఎక్క‌డా మైలేజ్ ఇవ్వ‌కుండా టీడీపీ జాగ్ర‌త్త ప‌డుతోంది. ఓ వైపు మృతుల కుటుంబాలు తీవ్ర బాధలో మునిగి ఉండగా చావును కూడా రాజకీయం చేస్తుండ‌టం విచార‌కర అంశం! ఇందులో అధికార పార్టీకి ఎంత బాధ్యత ఉందో…ప్రతిపక్ష పార్టీ పాత్ర అంతే.

బాధిత కుటుంబాల పరామర్శకు జగన్ రావటమే తప్పు అన్నట్లు తెలుగుదేశం కార్యకర్తలు నినాదాలు చేయటం ఎంత తప్పో…ఓ ప్రభుత్వ డాక్టర్ నుంచి ప్రతిపక్ష నేత బలవంతంగా మెడికల్ రిపోర్టు ను లాక్కోవటం కూడా తప్పే.

బాధిత కుటుంబాలను పరామరర్శించేందుకు నందిగామ ప్రభుత్వాసుపత్రికి వచ్చిన ప్రతిపక్ష నాయకుడికి టీడీపీ శ్రేణులు అడ్డంకులు కల్పించాయి. దీన్ని వైసీపీ నాయకులు అడ్డుకున్నారు. దీంతో నందిగామ ఆస్పత్రిలో తీవ్ర ఉద్రక్త పరిస్థితులు ఏర్పడ్డాయి. ఈ సమయంలో కృష్ణా జిల్లా కలెక్టర్ బాబుపై కూడా జగన్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇలాగే చేస్తే జైలుకు వెళ్ళాల్సి ఉంటుందని హెచ్చరించారు.

తర్వాత జగన్ మీడియాతో మాట్లాడుతూ బస్సు ప్రమాదంలో మృతిచెందిన వారి కుటుంబాలకు రూ.20లక్షల నష్టపరిహారం చెల్లించాలని డిమాండ్‌ చేశారు. బస్సు యాజమాన్యాల నుంచే నష్టపరిహారం ఇప్పించాలని డిమాండ్‌ చేశారు. రాజకీయాలకు పోకుండా మానవతా దృక్పథంతో ఆలోచించి ప్రభుత్వం, పోలీసులు, మీడియా ప్రతి ఒక్కరూ బాధితులకు అండగా నిలవాలని విజ్ఞప్తి చేశారు. ఒక‌ప‌క్క మృతులు అల్లాడుతుంటే.. మ‌రోప‌క్క అధికార‌, విప‌క్షాల‌ రాజ‌కీయాలుచూస్తే చిరాకు తెప్పించ‌క మాన‌వు!!