ఒక్క ఎత్తుతో ప్ర‌జల‌ను మార్చేసిన కేసీఆర్‌…అవాక్క‌య్యే ప్లాన్‌

తెలంగాణ సీఎం కేసీఆర్‌కు తెలిసినంత‌గా రాజ‌కీయ ఎత్తులు, జిమ్మిక్క‌లు ఎవ‌రికీ పెద్ద‌గా తెలియ‌దంటే.. పెద్దగా ఆశ్చ‌ర్య పోవాల్సిన ప‌నిలేదు. తెలంగాణ ఉద్య‌మం స‌మ‌యంలో ఆయ‌న వ్య‌వ‌హ‌రించిన శైలే దీనికి నిద‌ర్శ‌నం. అప్ప‌ట్లో రాష్ట్ర సాధ‌నే ల‌క్ష్యంగా అనేక హామీలు గుప్పించారు. తెలంగాణ సాధిస్తే.. ఎస్పీల‌నే సీఎంని చేస్తాన‌ని, అవ‌స‌ర‌మైతే కాంగ్రెస్ తో చెలిమి చేస్తానని, పార్టీని కూడా విలీనం చేస్తాన‌ని చెప్పుకొచ్చారు. ఎలాగోలా ఏరు దాటేశారు. ఆ త‌ర్వాత ఏం జ‌రిగిందో చెప్పాల్సిన ప‌నిలేదు. సీన్ క‌ట్ చేస్తే.. కేసీఆర్ స‌ర్కారు ఏర్ప‌డి అప్పుడే రెండేళ్లు దాటి మూడే ఏడు కూడా మొద‌లైపోయింది.

ఈ నేప‌థ్యంలో ఉద్య‌మంలో ఆయ‌న‌తో క‌లిసి చెట్టాప‌ట్టాలేసుకుని తిరిగిన కోదండ రాం స‌హా కాంగ్రెస్ వామ‌ప‌క్షాలు పెద్ద ఎత్తున కేసీఆర్ ప్ర‌భుత్వంపై దుమ్మెత్తిపోస్తున్నాయి. ఉద్యోగులు ఇవ్వ‌లేద‌ని, రైతులు ఆత్మ‌హ‌త్య‌లు చేసుకుంటున్నార‌ని, సంక్షేమ ప‌థ‌కాల మాటేమో కానీ, కేసీఆర్ కుటుంబం మాత్రం అధికారాన్ని వెల‌గ‌బెడుతోంద‌ని, రాష్ట్రంలో కుటుంబ పెత్త‌నం ఎక్కువైంద‌ని పెద్ద ఎత్తున ప్ర‌చారం మొద‌లు పెట్టాయి. ఈ నేప‌థ్యంలో కేసీఆర్ ఏంచేయాలి? ఏం చేయాలో అదే చేస్తున్నారు. ప్ర‌జ‌ల్ని త‌న‌వైపు తిప్పుకొనేందుకు అన్ని విధాలా ఆయ‌న రెడీ అయిపోయారు.

విప‌క్షాలు మాట‌ల‌తో చేస్తున్న ప్ర‌చారానికి కేసీఆర్ త‌న చేత‌ల‌తో చెక్ పెడుతున్నారు. అంగ‌న్‌వాడీ టీచ‌ర్ల‌కూ స‌హాయ‌కుల‌కూ భారీగా జీతాలు పెంచేశారు. రెండు ల‌క్ష‌ల గొర్రెల యూనిట్లూ చేప‌ల యూనిట్లూ పెట్టేద్దాం అంటున్నారు. ప్ర‌భుత్వాసుప‌త్రుల్లో ప్ర‌స‌వాల‌ను ఎంకరేజ్ చేయ‌డం షురూ అంటున్నారు. న‌వ‌జాత శ‌శువుల‌కు కేసీఆర్ కానుక‌లు ఇచ్చేద్దాం అంటున్నారు. బ‌ల‌హీన వ‌ర్గాల బ్యాంకు అప్పులు ర‌ద్దు అంటున్నారు. ఇంకా చాలాచాలా చేయాలంటున్నారు. ఇవ‌న్నీ ఏప్రిల్ నుంచే అమ‌లు జ‌రిగిపోవాల‌ని ఆదేశిస్తున్నారు.

సో.. కేసీఆర్ ఇప్పుడిలా ప్లేట్ మార్చి ప్ర‌జ‌ల‌కు చేరువ అవుతుండ‌డంతో విప‌క్షాల‌కు ఏం చేయాలో తెలియడం లేద‌ని అంటున్నారు విమ‌ర్శ‌కులు. మ‌రి కేసీఆర్‌.. రాజ‌కీయ చ‌తురుతను అంత త‌క్కువ‌గా అంచ‌నా వేసిన విప‌క్షాలు ఇప్పుడు ఏం చేస్తాయో చూడాలి.