బొత్స ప్లాన్‌తో బాబుకు చెమ‌ట‌లే

ప్ర‌స్తుతం తాను రాజ‌కీయాల్లో యాక్టివ్ లేక‌పోయినా తానేంటో మ‌రోసారి రుజువుచేశారు విజ‌య‌న‌గ‌రం జిల్లాకు చెందిన బొత్స స‌త్య‌నారాయ‌ణ! వైఎస్ హ‌యాంలో ఒక వెలుగు వెలిగి చ‌క్రం తిప్పిన ఆయ‌న ఇప్పుడు ప్ర‌తిప‌క్ష వైసీపీలో ఉన్నారు. ఇక బొత్స ప‌ని అంతే అనుకున్న స‌మ‌యంలో మ‌ళ్లీ తెర‌పైకి వ‌చ్చి త‌న‌మార్కు చూపిస్తున్నారు. ప్ర‌స్తుతం స్థానిక సంస్థ‌ల‌ ఎమ్మెల్సీ ఎన్నిక‌ల్లో శ్రీ‌కాకుళం త‌ర‌ఫున విజ‌య‌న‌గ‌రం జిల్లాకు చెందిన శ‌త్రుచ‌ర్ల‌కు ఇచ్చి సీఎం చంద్ర‌బాబు.. తన వ్యూహాన్ని అమ‌లుచేస్తే.. ఇప్పుడు బొత్స స‌త‌న్నారాయ‌ణ దానికి ప్ర‌తివ్యూహాన్ని ప‌న్ని బాబు ఆశ‌ల‌కు గండి కొట్టారు. కాపు సామాజిక‌వ ర్గానికి చెందిన మామిడి శ్రీకాంత్‌తో నామినేష‌న్ దాఖ‌లు చేయించారు.

ఇటీవలి రాజకీయాల్లో కాస్త హవా తగ్గినట్లుగా కనిపిస్తున్న బొత్స సత్యన్నారాయణ అదేమీ లేదని స్ప‌ష్టంచేశారు. తాను తలుచుకుంటే సీన్ రివ‌ర్స్ అయిపోతుంద‌ని చాటుకున్నారు. ఏకంగా ఏపీ సీఎం టీడీపీ అధ్య‌క్షుడు నారా చంద్రబాబు నాయుడుకు ఊహించని షాక్ ఇచ్చారు. అదే సమయంలో పొరుగు జిల్లాలో కూడా తనకు ఎంత పట్టు ఉందో చాటుకున్నారు. శ్రీ‌కాకుళం స్థానిక సంస్థ‌ల ఎన్నిక‌ల్లో మాజీ మంత్రి శత్రుచర్లను తమ అభ్యర్థిగా ప్రకటించి.. పార్టీ ఇన్‌చార్జి స‌హా.. జిల్లా ఇన్‌చార్జి స‌హా ప‌లువురి మంత్రుల స‌మక్షంలోనే ఆయ‌న ఎన్నిక‌ల‌ను ఏక‌గ్రీవం చేయాల‌ని చంద్ర‌బాబు భావించారు, కానీ వెంట‌నే బొత్స రంగంలోకి దిగి తెర‌వెనుక మంత్రాగం నడిపించారు.

జిల్లాకు చెందిన బొత్స ‘కాపు’కాసి అత్యవసరంగా శత్రుచర్లపై పోటీగా కాపు సామాజికవర్గానికి చెందిన తన బంధువు మామిడి శ్రీకాంత్ తో నామినేషన్ దాఖలు చేయించినట్టు సమాచారం. అంతకుముందు రెబల్ అభ్యర్థిగా కోల అప్ప‌ల‌నాయుడు రంగంలోకి దిగుతార‌ని భావించినా.. ఆ ప్ర‌క్రియ బాబు నేరుగా ఆయ‌న‌తో మాట్లాడ‌టంతో నిలిచిపోయింది. అయితే అంత‌కుముందు కాపుల‌కు అన్యాయం జ‌రిగింద‌ని అప్ప‌ల‌నాయుడిని ఉసిగొల్పినా అదీ ప‌ట్టించుకోలేదు. దీంతో మొత్తం మంగ‌ళ‌వారం సాయంత్రానికి మొత్తం మూడు నామినేషన్లు మాత్ర‌మే దాఖ‌ల‌య్యాయి.

కాగా.. నామినేషన్ ఘట్టానికి మంగళవారం సాయంత్రం నాలుగు గంటలతో సమయం పూర్తయ్యేసరికి మరో ఇద్దరు ఇండిపెండెంట్లుగా మామిడి శ్రీకాంత్ – కంచిలి పిఎసిఎస్ అధ్యక్షుడు తమరాల శోభనబాబు నామినేషన్లు దాఖలు చేశారు. దీంతో శత్రుచర్ల అనుచరులు ఆశించినట్టుగా ఏకగ్రీవం జరగలేదు. తద్వారా అధికారానికి దూరమై మూడేళ్లు అవుతున్నా అది కూడా పొరుగు జిల్లాలో ఉన్నప్పటికీ తన సత్తా ఏ మాత్రం తగ్గలేదని సత్తిబాబు నిరూపించుకున్నట్లు అయిందని చెప్తున్నారు.