రాఘవ లారెన్స్ పై ప్రశంసల వర్షం కురిపిస్తున్న జనం.. ఇంతకీ ఏం చేశాడంటే..?!

కోలీవుడ్ హీరో, కొరియోగ్రాఫర్, డైరెక్టర్ రాఘవ లారెన్స్‌కు తెలుగు ప్రేక్ష‌కుల‌లో ప్ర‌త్యేక ప‌రిచ‌యం అవ‌స‌రం లేదు. సహజ నటనతో తనకంటూ ఓ గుర్తింపు తెచ్చుకున్న ఆయ‌న‌ తెలుగులోనూ త‌న‌కంటూ ప్ర‌త్యేక‌మైన ఫ్యాన్ బేస్ ఏర్స‌రుచుకున్నాడు. రీల్ లైఫ్‌లోనే కాదు.. లారెన్స్ రియ‌ల్ లైఫ్‌లోను హీరోనే అన్న సంగతి తెలిసిందే. సామాజ‌ సేవలో ఎప్పుడూ ముందుండే లారెన్స్ ఇప్పటికే తన ఛారిటబుల్ ట్రస్ట్ ద్వారా ఎంతోమంది చిన్నారులకు తోడుగా నిలిచి వారిని చదివిస్తున్నాడు. తల్లిదండ్రులు కోల్పోయి అనాథలుగా మారిన చిన్నారులకు ఆపద్భాంధవుడయ్యాడు.

నిరుపేద వృద్దులకు తనవంతూ సాయం అందిస్తున్నాడు. లారెన్స్‏ను ఇన్స్పిరేష‌న్‌గా తీసుకుని కోలీవుడ్ కమెడియన్ కేపీవై బాల.. అనే యువకుడు కష్టాల్లో ఉన్నవారికి సాయం అందిస్తున్నాడు. తన సంపాదనలో చాలావరకు నిరుపేదలకు సాయం చేస్తున్నాడు. పిల్లలకు చదువులు, నిస్స‌హ‌య‌ వృద్ధులకు వికలాంగులకు అండ‌డ‌గా నిలుస్తున్నాడు. తగిన వైద్య సదుపాయాలు లేని ప్రదేశాలలో అంబులెన్స్‌లు కొనుగోలు చేసి ఇచ్చి వారికి స‌మ‌యానికి వైద్యం అందేలా చేశాడు. తుఫాను కారణంగా నష్టపోయిన 200 కుటుంబాలకు ఆర్థిక స‌హాయం అందించాడు. ఇటీవల ఓ పెట్రోల్ బంక్‌లో పనిచేస్తున్న ఓ యువకుడి ప‌రిస్థితి తెలుసుకుని ద్విచక్ర వాహనం కొనిచ్చాడు.

ఇప్పుడు భర్తను కోల్పోయి.. కష్టాల్లో ఉన్న ఓ నిరుపేద మహిళకు చేయూత నిచ్చాడు. భర్తను కోల్పోయి ముగ్గురు కూతుళ్లతో జీవనోపాధి పొందుతున్న మురుగమ్మాళ్ అనే మహిళ.. రైల్లో సమోసాలు అమ్ముతూ కుటుంబ జీవ‌నం సాగిస్తుంది. కాగా ఆమెకు ఆటో నడపడం వచ్చు. దీంతో సొంతంగా ఆటో కొని నడుపుతూ కుటుంబాన్ని పోషించాలని ఆమె కలలు కంటుంది. ఆ విషయం తెలుసుకున్న బాలా.. నటుడు రాఘవ లారెన్స్‌కు ఈమె ప‌రిస్థితి వివ‌రించాడు. లారెన్స్ ఇచ్చిన డబ్బుతో ఆటో కొని.. దానిని లారెన్స్ చేతులమీదుగానే ఆమెకు ఇప్పించాడు. దీంతో ఆ మహిళ చాలా ఎమోషనల్ అయ్యింది. ఈ వీడియో నెట్టింట వైరల్ కావ‌డంతో ఆ యంగ్ క‌మెడియ‌న్ బాలాని, రాఘ‌వా లారెన్స్‌ను ప్ర‌సంసిస్తున్నారు.