సైబర్ నేరగాళ్ల ఉచ్చులో చిక్కుకున్న బిగ్ బాస్ బ్యూటీ కీర్తి భట్.. ఏకంగా ఎన్ని లక్షలు పోగొట్టుకుందంటే..?!

ఇటీవ‌ల కాలంలో సైబర్ నేరగల వల‌లో చిక్కుకొని లక్షల్లో నష్టపోతున్నారు. అంతా డిజిటల్ అయిపోవ‌టంతో సైబర్ నేరగాళ్లు కూడా కొత్త కొత్త ఐడియాలతో నేరాలకు పాల్పడుతున్నారు. సామాన్యులే కాదు సెలబ్రిటీలు కూడా ఈ సైబర్ నెరగాళ్ల వలలో చిక్కుకుని భారీగా నష్టపోతున్నారు. తాజాగా బిగ్ బాస్ కీర్తి భ‌ట్ సైబర్ నేరగాళ్ల చేతికి చిక్కింది. ఈ విషయాన్ని తన యూట్యూబ్ ఛానల్ ద్వారా స్వయంగా ఓ వీడియో రూపంలో వివరించింది. నాకు ముఖ్యమైన కొరియర్ రావాల్సి ఉంది.. వారం రోజులైనా అది రాకపోవడంతో మెయిన్ కొరియర్ సెంటర్ వాళ్ళకి కాల్ చేసి అడిగా. వాళ్ళు డెలివరీ చేసాం మెహదీపట్నంలో ఉందంటూ చెప్పుకోచ్చారు. ట్రాక్ చేసి చూస్తే నిజంగానే అది మెహదీపట్నం లో ఉన్నట్లు చూపించింది. కొంతసేపటికి నాకు ఓ కాల్ వచ్చింది.

మీకు ఒక కొరియర్ రావాల్సి ఉంది కదా అంటూ వాళ్ళు అడిగారు. అవునని చెప్పా.. మీ లొకేషన్, అడ్రస్ అప్డేట్ కాలేదు.. ఒకసారి వాట్స్అప్ ద్వారా మీ అడ్రస్ షేర్ చేయండి అంటూ నెంబర్ ఇచ్చారు. నేను కాల్ మాట్లాడుతూ ఆ నెంబర్ కి అడ్రస్ సెండ్ చేశా. తర్వాత మళ్ళీ కాల్ చేసి అప్డేట్ కావడం లేదు నార్మల్ మెసేజ్ చేస్తా దానిలో రిప్లై ఇవ్వండి అంటూ వివరించాడు. నేను ఆ నెంబర్ కి హాయ్ అని మెసేజ్ చేశా. ఆ తర్వాత నా మొబైల్ నెంబర్ కి ఓ లింక్ వచ్చింది. దాన్ని క్లిక్ చేయండి.. ఆ లింక్ ని కాపీ చేసి వాళ్ళు పంపిన వేరే నెంబర్ కి ఫార్వర్డ్ చేయమని అన్నారు. వాళ్లు చెప్పిన ప్రాసెస్ అంతా.. నేను ఏదో కాల్ బిజీలో ఉండి చేసేశా. అదంతా అంతగా పట్టించుకోలేదు. తర్వాత ముందు పంపిన వాట్సాప్ నెంబర్‌కి అదే లింక్‌ని ఫార్వర్డ్ చేసి దాన్ని ఓపెన్ చేయండి అంటూ వాళ్ళు చెప్పారు.

అయితే అడ్రస్ అప్డేట్ కి రెండు రూపాయలు ఎక్స్ట్రా పే చేయాల్సి వస్తుంది మేడం అంటూ వాళ్ళు వివరించారు. రెండు రూపాయలే కదా అని నేను ఆ లింక్స్ ని క్లిక్ చేశా. యూపీఐ మెన్షన్ చేయమని అడిగారు.. నాకు డైట్‌ వచ్చి చేయనని చెప్పేసా. దీంతో బ్యాంక్‌కు లింక్ అయినా రిజిస్టర్ నెంబర్ ఇదేనా అండి అని అడిగారు. అవునని చెప్పా. నాకు ప్రాసెసింగ్ అని మెసేజ్ రావడంతో మేడం మీకు కాసేపాగి కాల్ చేస్తాం అంటూ కట్ చేశారు. అప్డేట్ ఇస్తామని చెప్పారు కొంతసేపటికి రెండు రూపాయలు నా అకౌంట్ నుంచి కట్ అయినట్టు మెసేజ్ వచ్చింది. సరే రెండు రూపాయలు కట్టుతాయని వారు చెప్పారు కదా అని లైట్ తీసుకున్నా. తర్వాత షూటింగ్ కి వెళ్ళిపోయా. సరిగ్గా మిడ్నైట్ 12 కి రూ.99వేలు ట్రాన్స్ఫర్ అయ్యాయి.

వెంటనే మరో రూ.99వేలు ట్రాన్స్ఫర్ అయ్యాయి అంటూ మెసేజ్‌లు వచ్చాయి. బ్యాలెన్స్ చెక్ చేస్తే రెండు లక్షలు ట్రాన్స్ఫర్ అయినట్లు కనిపించింది. దీంతో నాకు ఏం చేయాలో అర్థం కాలేదు. కార్తీక్.. నేను కలిసి సైబర్ కంప్లైంట్ ఇచ్చాం. నా అకౌంట్ ని బ్లాక్ చేయించా. సైబర్ క్రైమ్ పోలీసులు యాక్షన్ తీసుకోవడం మొదలుపెట్టారు. ట్రాకింగ్ స్టార్ట్ అయింది కచ్చితంగా డబ్బులు తిరిగి వస్తాయని అధికారులు చెప్పారు. జరిగిన వెంటనే కంప్లైంట్ ఇచ్చాము కాబట్టి.. వారి అకౌంట్లోకి మనీ వెళ్లకుండా ఆ అకౌంట్లను కూడా బ్లాక్ చేశారు. కంప్లైంట్ ఇచ్చిన వెంటనే సైబర్ పోలీసులు యాక్షన్ తీసుకున్నారు. వారికి ధన్యవాదాలు అంటూ వివరించింది. ఇలాంటి సైబర్ నేరాలు జరిగినప్పుడు వెంటనే 1930 టోల్ ఫ్రీ నెంబర్ కి కాల్ చేయమంటూ కీర్తి వివరించింది.