ఆ హీరోల ఫ్యాన్స్ పవన్‌కు సపోర్ట్ చేస్తారా?

వారాహి యాత్రతో దూసుకెళుతున్న జనసేన అధినేత పవన్..జగన్ ప్రభుత్వంపై తీవ్ర స్థాయిలో విమర్శలు చేస్తూనే..తనని తిట్టే వైసీపీ నేతలపై విరుచుకుపడుతున్నారు. ఇక మొన్నటివరకు పొత్తుల గురించి మాట్లాడిన పవన్..ఇప్పుడు పొత్తుల ప్రస్తావన తీసుకురావడం లేదు. తాను సి‌ఎం అవ్వడం, జనసేన ప్రభుత్వం ఏర్పాటు గురించి మాట్లాడుతున్నారు. జనసేనని బలోపేతం చేసే దిశగానే ఆయన ముందుకెళుతున్నారు.

ఇదే క్రమంలో ప్రజా మద్ధతు పొందేందుకు పవన్..ప్రజలకు పలు హామీలు ఇస్తున్నారు. అదే సమయంలో తనతో పాటు ఇండస్ట్రీలో ఉన్న పలువురు హీరోల అభిమానుల మద్ధతు సంపాదించేందుకు పవన్ ప్రయత్నిస్తున్నారు. ఇటీవల సభల్లో సినిమాలు వేరు, రాజకీయాలు వేరు అని. సినిమా ఇండస్ట్రీ తనపైనే ఆధారపడి లేదని, ఇంకా చాలామంది హీరోలు ఉన్నారని, రాష్ట్రంలో వారికి భారీగా అభిమానులు ఉన్నారని, తనకు మహేశ్ బాబు, జూనియర్ ఎన్టీఆర్, ప్రభాస్, రామ్ చరణ్, అల్లు అర్జున్, రవితేజ, చిరంజీవిలంటే ఇష్టమని, ఇతర పెద్ద హీరోలు ఇష్టమే అని, వారి అభిమానులు అంతా రాజకీయాల విషయానికొచ్చేసరికి తనకు మద్ధతు ఇవ్వాలని కోరుతున్నారు.

దీంతో ఆయా హీరోల అభిమానుల్లో చర్చ నడుస్తుంది. పవన్ వ్యాఖ్యలపై మాట్లాడుకుంటున్నారు. అయితే రాష్ట్రంలో మెగా అభిమానులు జనసేన వైపు ఎక్కువ ఉన్నారు. అటు నందమూరి అభిమానులు టి‌డి‌పి వైపు ఉన్నారు. అందులో కొందరు ఎన్టీఆర్ అభిమానులు వైసీపీ వైపు కూడా ఉన్నారు..మహేశ్, ప్రభాస్, అల్లు అర్జున్, కొందరు సీనియర్ హీరోల అభిమానులు టి‌డి‌పి, వైసీపీ వైపు కూడా ఉన్నారు. ఇప్పుడు హీరోల అభిమానులంతా తనకు మద్ధతు ఇవ్వాలని పవన్ అంటున్నారు. మరి వారు ఎంతవరకు పవన్‌కు మద్ధతు ఇస్తారో చూడాలి.