కేసీఆర్‌కు అసదుద్దీన్ ఎసరు..పోటీకి ఎం‌ఐ‌ఎం రెడీ.?

ఇంతకాలం కేసీఆర్‌కు అనుకూలంగా రాజకీయం చేస్తూ..పరోక్షంగా బి‌ఆర్‌ఎస్ పార్టీకి మద్ధతుగా నిలిచిన ఎం‌ఐ‌ఎం అధినేత అసదుద్దీన్ ఒవైసీ స్వరం మారుతుంది. ఈ సారి ఎన్నికల్లో బి‌ఆర్‌ఎస్ పార్టీకి మద్ధతు ఇవ్వడం కాదు..బరిలో దిగి బి‌ఆర్‌ఎస్‌కు నష్టం చేసేలా ఉన్నారు. గత రెండు ఎన్నికల్లో ఎం‌ఐ‌ఎం కేవలం తమకు పట్టున్న పాతబస్తీ సీట్లలోనే పోటీ చేసేది. అక్కడ ఛార్మినార్, చాంద్రాయణగుట్ట, బహదూరపురా, యాకుతపురా,  నాంపల్లి, కార్వాన్, మలక్‌పేట్ సీట్లని ఎం‌ఐ‌ఎం గెల్చుకునేది. ఈ సీట్లలో ఎం‌ఐ‌ఎం గెలుపుకు బి‌ఆర్‌ఎస్ పరోక్షంగా సహకరించేది.

పోటీ చేసిన నామ మాత్రంగానే రేసులో ఉండేది. ఇక రాష్ట్ర స్థాయిలో బి‌ఆర్‌ఎస్ పార్టీకి ఎం‌ఐ‌ఎం మద్ధతు ఇచ్చేది. ముస్లిం ప్రభావిత నియోజకవర్గాల్లో ఎం‌ఐ‌ఎం ఓట్లు..బి‌ఆర్‌ఎస్‌కు కలిసొచ్చేవి..దీంతో బి‌ఆర్‌ఎస్ కు మంచి విజయాలే అందాయి. కానీ ఈ సారి అసదుద్దీన్ రాష్ట్ర స్థాయిలో పోటీ చేస్తానని అంటున్నారు. ఖచ్చితంగా పోటీ చేసి 15 సీట్లు వరకు గెలుచుకోవాలని చూస్తున్నారు.

వాస్తవానికి ఎం‌ఐ‌ఎం పార్టీకి కొన్ని స్థానాల్లో బలం ఉంది. ఉమ్మడి ఆదిలాబాద్, నిజామాబాద్, కరీంనగర్ లాంటి జిల్లాల్లో ఎం‌ఐ‌ఎంకు కాస్త ఓటు బ్యాంకు ఉంది. గెలిచే బలం లేదు గాని..గెలుపోటములని తారుమారు చేయగలదు. దాదాపు 40 సీట్లలో ఎం‌ఐ‌ఎం ప్రభావం ఉంటుంది. ఇప్పటివరకు ఆ సీట్లలో బి‌ఆర్‌ఎస్ కు సహకరించింది. ఇప్పుడేమో పోటీకి సిద్ధమవుతుంది. అదే జరిగితే ఓట్లు చీలిపోయి బి‌ఆర్‌ఎస్ పార్టీకే నష్టం జరిగే ఛాన్స్ ఉంది.

దీంతో పరోక్షంగా బి‌జే‌పికి లాభం జరిగే అవకాశాలు ఉన్నాయి. అయితే చూడాలి అసదుద్దీన్ అన్నీ స్థానాల్లో పోటీ చేస్తారా? లేదా మళ్ళీ బి‌ఆర్‌ఎస్‌కు మద్ధతు ఇస్తారో.