రీ రిలీజ్ కు సిద్ధమైన పవన్ వకీల్ సాబ్.. ఎన్నికల మైలేజ్ పెంచేందుకేనా..?!

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కు టాలీవుడ్ లో ఉన్న క్రేజ్ గురించి.. ఫ్యాన్ ఫాలోయింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఈయన కంటూ ప్రత్యేకమైన ఫ్యాన్ బేస్‌ను ఏర్పరచుకున్న పవన్.. ప్రస్తుతం తాను నటించాల్సిన సినిమాలన్నింటినీ పక్కన పెట్టేసి మరి రాజకీయాల్లో బిజీ బిజీగా గడుపుతున్నారు. ప్రజాసేవ చేయాలనే ఉద్దేశంతో జనసేన పార్టీని స్థాపించాడు. ఈయన గత రెండు ఎన్నికలుగా ఓటమిని చూసిన.. ప్రజలకు సహాయం చేసే విషయంలో మాత్రం ముందుంటున్నారు. ఇక త్వరలోనే సార్వత్రిక ఎన్నికలు జరుగుతున్న నేపథ్యంలో సినిమాలను పక్కనపెట్టి మరీ.. జనసేన పార్టీ తరఫున పిఠాపురం నుంచి ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేస్తున్నాడు పవన్.

దీంతో భారీ ఎత్తున ప్రచార కార్యక్రమాల్లో పాల్గొంటున్నాడు. ఎలాగైనా ఈ ఎన్నికల్లో గెలుపు అందుకోవాలని ఉద్దేశంతో పవన్ రాజకీయాలపై పూర్తి దృష్టి సారించి అహర్నిశలు శ్రమిస్తున్నాడు. ఈ నేపథ్యంలో ఈయన నటించి బ్లాక్ బ‌స్టర్ సక్సెస్ అందుకున్న వకీల్ సాబ్ సినిమా ప్రేక్షకుల ముందుకు రీ రిలీజ్ కు సిద్ధమవుతుంది. 2021 లో రిలీజై ఎంతో అద్భుతమైన సక్సెస్ అందుకున్న ఈ సినిమాకు.. డైరెక్టర్ వేణు శ్రీరామ్ దర్శకత్వం వహించారు. దిల్ రాజు ప్రొడక్షన్ లో వచ్చిన ఈ సినిమా ప్రేక్షకులో మంచి ఆదరణతో పొందింది. ఇక ఈ సినిమాలో పవన్ కళ్యాణ్ లాయర్ పాత్రలో నటించిన సంగతి తెలిసిందే.

పొలిటిషన్ నాయకుడి కుమారుడు తప్పుడు కేసు కారణంగా ముగ్గురు అమ్మాయిల జీవితం బలైపోతుంటే.. ఆ కేసును వాదించి పవన్ కళ్యాణ్ వారి జీవితాలను ఎలా కాపాడాడని నేపథ్యంలో సినిమా ప్రేక్షకులు ముందుకు వచ్చింది. కాగా ఈ సినిమా ఈ ఏడాది మే 1న మరోసారి రిలీజ్ కానుంది. ఎన్నికలు కొద్ది రోజులు ముందుగా ఈ సినిమా విడుదలవుతున్న తరుణంలో.. రాజకీయపరంగా పవన్ కళ్యాణ్ మరింత మైలేజ్ పెంచేందుకు ఈ సినిమా రిలీజ్‌ చేస్తున్నారని పలువురు తమ అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం రీ రిలీజ్ సినిమాలకు ఆదరణ తగ్గుతున్న క్రమంలో.. అది కూడా ఎన్నికల నేపథ్యంలో ఇలాంటి సినిమా రిలీజ్ కానుంది. దీంతో వ‌కీల్ సాబ్‌కు ఎలాంటి సక్సెస్ వస్తుందో అని ఆసక్తి ప్రేక్షకుల్లో మొదలైంది.