సీమ టూ కోస్తా..లోకేష్ సత్తా చాటుతారా?

నారా లోకేష్ యువగళం పాదయాత్ర రాయలసీమలో ముగించుకుని కోస్తాలో అడుగుపెట్టింది. సీమలో విజయవంతమైన పాదయాత్ర కోస్తాలో కూడా సక్సెస్ అవుతుందా? ఇక్కడ కూడా సత్తా చాటుతారా? అనే అంశాలని ఒక్కసారి చూస్తే..ముందు సీమలోని నాలుగు జిల్లాల్లో పాదయాత్ర విజయవంతంగా సాగింది. చిత్తూరు, అనంతపురం, కర్నూలు, కడప జిల్లాల్లో పాదయాత్ర సాగింది. మొదట చిత్తూరులో పాదయాత్ర అనుకున్న విధంగా సాగలేదు. మొదట్లో ప్రజా స్పందన తక్కువే. కానీ నిదానంగా ప్రజా స్పందన పెరిగింది.

అనంతపురంకు వెళ్ళే సరికి ఓ స్థాయిలోకి వెళ్లింది. అలా కర్నూలు, కడప జిల్లాల్లో సక్సెస్ ఫుల్ అయింది. కడపలో ఊహించని విధంగా ప్రజా మద్ధతు వచ్చింది. రాయలసీమ జిల్లాల్లో 125 రోజులపాటు సుదీర్ఘ పాదయాత్ర చేసి నెల్లూరు జిల్లాకు చేరుకున్న లోకేశ్‌.. తనకు ఎదురైన అనుభవాలను, అనుభూతులను లేఖ ద్వారా ప్రజలతో పంచుకున్నారు. రాష్ట్రంలో నాలుగేళ్ల అరాచక పాలనలో బాధితులుగా మారిన ప్రజలకు భరోసా కల్పించడమే లక్ష్యంగా చేపట్టిన యువగళం పాదయాత్ర తొలి మజిలీ ప్రజలందరి ఆశీస్సులతో విజయవంతంగా పూర్తి చేయడం ఆనందంగా ఉందని అన్నారు.

సీమలో మొత్తం 124 రోజులపాటు నిర్వహించిన పాదయాత్రలో 44 అసెంబ్లీ నియోజకవర్గాలు, 108 మండలాలు, 943 గ్రామాల మీదుగా 1587.7 కి.మీ. పాదయాత్ర పూర్తి చేశారు. ఇక లోకేష్ పాదయాత్ర వల్ల సీమలో టి‌డి‌పికి కాస్త మైలేజ్ పెరిగిందనే చెప్పాలి. అప్పటికే వైసీపీపై ఉన్న వ్యతిరేకత టి‌డి‌పికి కలిసొస్తుంది.ఈ సమయంలో లోకేష్ పాదయాత్ర మరింత అడ్వాంటేజ్ అయింది.

ఇక ఇప్పుడు నెల్లూరులో మొదలైన పాదయాత్ర వరుసగా కోస్తా జిల్లాలైన ప్రకాశం, గుంటూరు, కృష్ణా జిల్లాల్లో కొనసాగనుంది. తర్వాత గోదావరి జిల్లాలు, ఉత్తరాంధ్ర జిల్లాల్లో పాదయాత్ర ఉంటుంది. మరి కోస్తాలో కూడా విజయవంతంగా కొనసాగుతుందేమో చూడాలి.