తెలుగు స్టార్ దర్శకులలో ఒకరుగా గోపీచంద్ మలినేని తన సినిమాలతో ఎదిగారు. క్రాక్, వీర సింహారెడ్డి సినిమాలతో బ్యాక్ టు బ్యాక్ వరుస విజయాలను సొంతం చేసుకున్న విషయం తెలిసిందే. బాలయ్య సినీ కెరియర్ లోనే ఇండస్ట్రీ హిట్ సినిమాలుగా నిలిచినన సమరసింహారెడ్డి, నరసింహనాయుడు సినిమాల వరుసలో ఇప్పుడు వచ్చిన వీర సింహారెడ్డి సినిమా కూడా నిలిచింది.
ఈ సంక్రాంతికి వచ్చిన ఈ సినిమా ఇప్పటికీ ఎంతో విజయవంతంగా కొనసాగుతూ ఎన్నో రికార్డు కలెక్షన్లను కొల్లగొడుతుంది. ఈ సినిమాను చూసిన అభిమానులే కాకుండా సినీ ప్రముఖులు కూడా ఈ మూవీ ని చూసి ప్రశంసిస్తున్నారు. ఇక రీసెంట్గా ఈ సినిమాను సూపర్ స్టార్ రజనీకాంత్ చూసి దర్శకుడు గోపీచంద్ మలినేని స్వయంగా ఫోన్ చేసి అభినందించారు. ఇక ఈ విషయాన్ని స్వయంగా గోపీచంద్ సోషల్ మీడియాలో షేర్ చేసి తన ఆనందాన్ని అభిమానులతో పంచుకున్నాడు.
గోపీచంద్ తన పోస్ట్ లో.. ‘ఇది నాకు నమ్మలేని ఒక అద్భుతం.. సూపర్ స్టార్ రజనీకాంత్ సార్ నుంచి కాల్ వచ్చింది. ఆయన వీర సింహారెడ్డి సినిమాను చూసి నాకు ఫోన్ చేసి.. సినిమా నువ్వు ఎంతో చాలా అద్భుతంగా తీశావని మెచ్చుకున్నారు.. ఇక ఆయన అనుభవించిన భావోద్వేగం నాకు ఈ ప్రపంచంలో అన్నింటికంటే ఎక్కువ. థ్యాంక్యూ రజనీ సార్ అని పేర్కొన్నాడు’. ఈ పోస్ట్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారుతోంది.