ఆ కంచుకోటలని బద్దలు కొట్టడం కష్టమే!

ఏపీలో అధికార వైసీపీకి గాని, ప్రతిపక్ష టీడీపీకి గాని కంచుకోటల్లాంటి నియోజకవర్గాలు చాలానే ఉన్నాయి…రాష్ట్రంలో రాజకీయ పరిస్తితులు మారినా సరే..కంచుకోటలుగా ఉండే నియోజకవర్గాల్లో రాజకీయం మారదు. అక్కడ ఆయా పార్టీల పట్టు తగ్గదు. అలాంటి చోట్ల పార్టీలకు ఓటములు పెద్దగా రావు. ఆ కంచుకోటలని బద్దలు కొట్టడం సాధ్యం అవ్వని పని. రాష్ట్రంలో వైసీపీకి కంచుకోటలు చాలానే ఉన్నాయి. అయితే అవి కాంగ్రెస్ పార్టీకి కంచుకోటలుగా ఉండగా, ఇప్పుడు వైసీపీకి అడ్డాలుగా మారిపోయాయి.

వైసీపీకి కడప, కర్నూలు, నెల్లూరు, చిత్తూరు జిల్లాల్లో పలు కంచుకోటలు ఉన్నాయి. కడపలో…పులివెందుల, రాయచోటి, కడప, బద్వేలు, జమ్మలమడుగు లాంటి స్థానాలు. కర్నూలులో…పాణ్యం, శ్రీశైలం, డోన్ లాంటి స్థానాలు ఉన్నాయి. చిత్తూరులో..పుంగనూరు, చంద్రగిరి స్థానాలు, నెల్లూరులో…నెల్లూరు రూరల్, ఆత్మకూరు స్థానాలు ఉన్నాయి…ఇవే కాదు ఇంకా వైసీపీకి కంచుకోటలు చాలానే ఉన్నాయి..గుంటూరులో మాచర్ల, కృష్ణాలో గుడివాడ లాంటివి ఉన్నాయి. ఈ స్థానాల్లో వైసీపీని ఓడించడం అనేది చాలా కష్టమైన పని. నెక్స్ట్ ఎన్నికల్లో కూడా ఈ స్థానాల్లో టీడీపీ గెలవడం అనేది అసాధ్యమే.

అయితే వైసీపీకి ఉన్నట్లే టీడీపీకి కూడా మొదట నుంచి అనేక కంచుకోటలు ఉన్నాయి…1983 నుంచి టీడీపీ సత్తా చాటుతున్న నియోజకవర్గాలు చాలానే ఉన్నాయి. కాకపోతే గత ఎన్నికల్లో జగన్ వేవ్ లో కొన్ని కంచుకోటలు బద్దలయ్యాయి. కానీ జగన్ వేవ్ సైతం తట్టుకుని కొన్ని చోట్ల టీడీపీ గెలిచింది. మళ్ళీ ఆ స్థానాల్లో టీడీపీని ఓడించడం సాధ్యమయ్యే పని కాదు. కుప్పం,హిందూపురం, అద్దంకి, పర్చూరు, విజయవాడ తూర్పు, ఉండి, పాలకొల్లు, రాజమండ్రి సిటీ, రూరల్, విశాఖ తూర్పు, టెక్కలి, ఇచ్చాపురం స్థానాల్లో టీడీపీని ఓడించడం వైసీపీకి కష్టమే.

అలాగే గత ఎన్నికల్లో టీడీపీ కొన్ని కంచుకోటల్లో ఓడిపోయింది…అయితే ఈ సారి ఆ స్థానాల్లో టీడీపీ పుంజుకుంది. పొన్నూరు, మైలవరం, దెందులూరు, పెనమలూరు, జగ్గయ్యపేట లాంటి స్థానాల్లో కూడా వైసీపీ గెలుపు గగనమయ్యేలా ఉంది.