బాబుతో బాబు..కొత్త పాయింట్ దొరికింది!

జగన్ మోహన్ రెడ్డితో మోహన్ బాబుకు ఉన్న బంధుత్వం ఏంటో అందరికీ తెలిసిందే…అలాగే చంద్రబాబు తనకు బంధువు అని మోహన్ బాబు పదే పదే చెబుతూ ఉంటారు…అయితే రాజకీయంగా వచ్చేసరికి మోహన్ బాబు..దశాబ్ద కాలం నుంచి చంద్రబాబుకు దూరంగా ఉంటున్నారు…అప్పుడప్పుడు ఆయనపై విమర్శలు కూడా చేస్తూ వస్తున్నారు. ఏమైందో ఏమో గాని…గతంలో టీడీపీలో మోహన్ బాబు రాజ్యసభ సభ్యుడుగా పనిచేశారు. ఆ తర్వాత నుంచి ఆయన టీడీపీకి దూరం జరిగారు.

మళ్ళీ ఎప్పుడు టీడీపీకి దగ్గరయ్యే కార్యక్రమాలు చేయలేదు. ఇక గత ఎన్నికల ముందు తన విద్యాసంస్థలకు సంబంధించిన ఫీజు రీఎంబర్స్మెంట్ విషయంలో మోహన్ బాబు ఫ్యామిలీ..తిరుపతిలో రోడ్లు ఎక్కి మరీ ధర్నా చేశారు. చంద్రబాబు ప్రభుత్వంపై విమర్శలు చేశారు. ఇక ఎన్నికల సమయంలో వైసీపీ కండువా కప్పుకుని జగన్ గెలుపు కోసం తిరిగారు.

కానీ జగన్ అధికారంలోకి వచ్చాక మోహన్ బాబు రాజకీయాల్లో కనిపించడం మానేశారు…అలాగే ఇప్పుడు జగన్ ప్రభుత్వంలో ఫీజుల చెల్లింపు సక్రమంగా జరుగుతుందో లేదో చెప్పలేని పరిస్తితి. ఇక తాను రాజకీయాల్లో ఉండనని మోహన్ బాబు చెప్పుకొచ్చారు. ఇలాంటి తరుణంలో సడన్ గా మోహన్ బాబు…చంద్రబాబుతో భేటీ కావడంతో ఏపీ రాజకీయాలు ఆసక్తికరంగా మారాయి. ఇన్నేళ్లుగా లేనిది ఇప్పుడు మోహన్ బాబు…చంద్రబాబుని ఎందుకు కలిశారో తెలియడం లేదు.

అయితే మోహన్ బాబు…తిరుపతిలోని తన విద్యాసంస్థ శ్రీ విద్యానికేతన్ ఆవరణలో సాయిబాబా ఆలయం నిర్మించారు. ఈ ఆలయ నిర్మాణం పూర్తికావడంతో చంద్రబాబును మోహన్ బాబు ఆహ్వానించినట్లు తెలుస్తోంది…కానీ దాదాపు రెండు గంటల పాటు సమావేశం జరిగిందని సమాచారం…అలాంటప్పుడు ఆలయం గురించే కాదు..రాజకీయం గురించి కూడా చర్చకు వచ్చి ఉంటుందని అంతా అనుకుంటున్నారు.

ఇదే సమయంలో వీరి భేటీకి సంబంధించి కొత్త అంశం తెరపైకి వచ్చింది. ఇటీవలే విద్యానికేతన్ విద్యాసంస్థ…మోహన్ బాబు యూనివర్సిటీగా మారింది. అయితే నెక్స్ట్ గాని అధికారం మారితే…తన సంస్థకు ఎలాంటి ఇబ్బందులు రాకూడదనే…ఇప్పటినుంచే మోహన్ బాబు..చంద్రబాబుకు దగ్గరయ్యే కార్యక్రమాలు చేస్తున్నారని విశ్లేషణలు వస్తున్నాయి. మొత్తానికైతే బాబుతో మోహన్ బాబు భేటీ ఏపీ రాజకీయాల్లో హాట్ టాపిక్ అయింది.