రోజాను ఇంత తొక్కేస్తున్నారా.. జ‌గ‌న్ అపాయింట్‌మెంట్ కూడా లేదే..!

అదేం అదృష్ట‌మో కానీ.. వైసీపీ నాయ‌కురాలు.. ఫైర్ బ్రాండ్, న‌గ‌రి ఎమ్మెల్యే రోజాకు గ‌తంలో ప్ర‌త్య‌ర్థి పార్టీల నుంచి సెగ వ‌స్తే.. ఇప్పుడు పార్టీ అధికారంలోకి వ‌చ్చాక‌.. సొంత పార్టీ నేత‌ల నుంచే సెగ భారీ ఎత్తున త‌గులుతుండ‌డం గ‌మ‌నార్హం. నిజానికి రాష్ట్రంలో అధికార పార్టీ నేత‌ల మ‌ధ్య ఆధిప‌త్య పోరు ఉన్న మాట వాస్త‌వ‌మే. అయితే.. దీనికి మించి.. అన్న‌ట్టుగా రోజాకు సెగ త‌గులుతోంది. ఆమెను డ‌మ్మీ చేసేందుకు.. వ‌చ్చే ఎన్నిక‌ల్లో అస‌లు టికెట్ కూడా ద‌క్క‌కుండా చేసేందుకు వ్యూహాత్మ‌కంగా కీల‌క నేత‌లు పావులు క‌దుపుతుండ‌డంతో ఏకంగా ఆమె త‌న ప‌ద‌విని వ‌దులుకునేందుకు కూడా సిద్ధ‌ప‌డ్డార‌నే విష‌యం.. సోష‌ల్ మీడియాలో హ‌ల్చ‌ల్ చేస్తోంది.

2014, 2019 ఎన్నిక‌ల్లో న‌గిరి నియోజ‌క‌వ‌ర్గం నుంచి విజ‌యం ద‌క్కించుకున్న రోజా.. చంద్ర‌బాబు హ‌యాంలో ప్ర‌తిప‌క్షంలో ఉండి ఇబ్బందులు ప‌డ్డారు. ఫైర్ బ్రాండ్ ముద్రను కొన‌సాగిస్తూ.. ఎన్ని ఇబ్బందులు వ‌చ్చినా.. ఆమె ఎదిరించారు. ఒకానొక ద‌శ‌లో ఏడాది పాటు అసెంబ్లీ నుంచి స‌స్పెన్ష‌న్‌కు గుర‌య్యారు. అయినా.. కూడా మొక్క‌వోని దీక్ష‌తో వైసీపీ త‌ర‌ఫున వాయిస్ వినిపించారు. దీంతో త‌దుప‌రి ఎన్నిక‌ల‌లో జ‌గ‌న్ ఆమెకే టికెట్ ఇచ్చారు. దీంతో ఆమె గెలుపు స‌హా పార్టీ అధికారంలోకి వ‌చ్చింది. అయితే.. పార్టీ కోసం తను చేసిన కృషి ఫ‌లిస్తుంద‌ని.. గుర్తింపు ల‌భిస్తుంద‌ని రోజా ఆశ‌లు పెట్టుకున్నారు.

ఏదో కొన్నాళ్లు ఏపీఐఐసీ చైర్‌ప‌ర్స‌న్ ప‌ద‌వి ల‌భించింది. ఇంత‌లోనే ఆమెను ప‌క్క‌కు త‌ప్పించారు. ఇదిలావుంటే.. నియోజ‌క‌వ‌ర్గం లో కొన్నాళ్లుగా ఆమెకు వ్య‌తిరేకంగా చ‌క్రం తిప్పుతున్న వారు పెరుగుతున్నారు. అయినా ఆమె స‌ర్దుకు పోతున్నారు. కొంత కాలంగా వీరిని కూడా ఎదిరిస్తూ వ‌స్తున్నారు. అయితే, రాను రాను.. మ‌రింత‌గా వేడి పెరుగుతోంది. రోజాను వ్య‌తిరేకించే వ‌ర్గానికి ప‌ద‌వులు రావ‌డం.. రోజాకు సానుకూలంగా ఉన్న‌వారికి గుర్తింపు లేకుండా పోవ‌డం.. ఆమెకు ఇబ్బందిగా మారింది. పైగా.. రోజాతో తిరిగిన వారిని పార్టీలో వెలేసిన‌ట్టు చూస్తున్నారు. కేజే కుమార్ స‌తీమ‌ణికికార్పొరేష‌న్ ప‌ద‌వి ద‌క్కింది. కేజే కుమార్‌కు రోజాకు మ‌ధ్య ప‌చ్చ‌గ‌డ్డి వేస్తే భ‌గ్గుమ‌నే ప‌రిస్తితి ఉంది.

ఇక‌, ఇటీవ‌ల మ‌రో నేత‌, రోజా అంటే అస్స‌లు గిట్ట‌ని చెంగారెడ్డి చ‌క్ర‌పాణిరెడ్డికి శ్రీశైలం దేవ‌స్థానం బోర్డు చైర్మ‌న్ ప‌ద‌విని క‌ట్ట‌బెట్టారు. దీంతో ఆయ‌న రోజాతో ప‌నిలేదు.. అంతా మాదే హ‌వా అని బ‌హిరంగంగానే ప్ర‌క‌ట‌నలు చేస్తున్నారు. మ‌రోవైపు.. రోజా చేయాల‌ని సంక‌ల్పించిన ప‌నుల‌కు కూడా ప్ర‌భుత్వం నుంచి నిధ‌లు రావ‌డం లేదు. అదేస‌మ‌యంలో ఆమె ప్ర‌తిపాదించిన ప‌నుల‌కు సంబంధించిన బిల్లుల‌ను కూడా కీల‌క మంత్రి ఒక‌రు తొక్కి పెడుతున్నారు.

ఫ‌లితంగా ఏడాది గ‌డిచిపోయినా.. చిన్న‌పాటి రోడ్డు కూడా వేయ‌లేక పోతున్నార‌నే విమ‌ర్శ‌లు రోజాను చుట్టుముడుతున్నాయి. దీనికి కార‌ణాలు తెలిసి కూడా అధిష్టానం ప‌ట్టించుకోవ‌డం లేద‌ని.. రోజా వాపోతున్నారు. ఆయా విష‌యాల‌పై చ‌ర్చించేందుకు సీఎం అప్పాయింట్‌మెంట్ కూడా దొర‌క‌ని ప‌రిస్థితిని ఎదుర్కొంటున్నారు. దీంతో త‌న ప‌ద‌విని వ‌దులుకునైనా ఎగ‌స్పార్టీకి బుద్ధి చెప్పాల‌ని.. నిర్ణ‌యించుకున్న‌ట్టు వార్త‌లు వ‌స్తున్నాయి. మ‌రి ఏం జ‌రుగుతుందో చూడాలి.


Leave a Reply

*