కాకినాడ కార్పొరేష‌న్ ఫైన‌ల్ రిజ‌ల్ట్ ఇదే

తూర్పుగోదావరి జిల్లా కాకినాడలో జరిగిన కార్పొరేషన్ ఎన్నికల్లో టీడీపీ తిరుగులేని ఘ‌న‌విజ‌యం సాధించింది. నిన్న‌టి నంద్యాల ఉప ఎన్నిక‌ల్లో ఘ‌న‌విజ‌యాన్ని కంటిన్యూ చేస్తూ ఇక్క‌డ కూడా గెల‌వ‌డంతో టీడీపీ నేతలు, కార్యకర్తలు సంబరాలు చేసుకుంటున్నారు. ఇక ఉద‌యం 8 గంట‌ల‌కు ప్రారంభ‌మైన ఓట్ల లెక్కింపు 11.30 నిమిషాల‌కు ముగిసింది. మొత్తం మూడు రౌండ్ల‌లో ఓట్ల లెక్కింపు జ‌రిగింది.

48 డివిజ‌న్లలోను టీడీపీ 32 డివిజ‌న్లు, మిత్ర‌ప‌క్ష‌మైన బీజేపీ 3, వైసీపీ 10, టీడీపీ రెబ‌ల్ అభ్య‌ర్థులు 3 డివిజ‌న్ల‌లో విజ‌యం సాధించారు. 30 సంవ‌త్స‌రాల తర్వాత కాకినాడ కార్పొరేష‌న్‌పై టీడీపీ జెండా ఎగిరింది. దీంతో టీడీపీ ప్ర‌జాప్ర‌తినిధులు, కార్య‌కర్త‌లు, నాయ‌కుల ఆనందానికి అవ‌ధులే లేవు.

ఈ గెలుపుపై డిప్యూటీ సీఎం నిమ్మకాయల చినరాజప్ప మాట్లాడుతూ.. కాకినాడ కార్పొరేషన్‌లో టీడీపీ విజయం సీఎం చంద్రబాబుకే అంకితం ఇస్తున్న‌ట్టు చెప్పారు. అభివృద్ధి, సంక్షేమానికి ఓటర్లు పట్టం కట్టారని ఆయన స్పష్టం చేశారు. వైసీపీ త్వరలోనే కనుమరుగవడం ఖాయమని చినరాజప్ప జోస్యం చెప్పారు.