పీకే గాలి తీసేసిన వాసిరెడ్డి ప‌ద్మ‌

రాజ‌కీయాల‌న్నాక చాలా జాగ్ర‌త్త‌గా ఉండాలి. ఒక్క మెట్టు పొర‌పాటున దిగామా? వ‌ంద మెట్ల కింద‌కి తోసేసేందుకు అంతా కాచుకుని కూర్చుంటారు. ఇప్పుడు వైసీపీ ఎన్నిక‌ల వ్యూహ‌క‌ర్త‌, ఉత్త‌రాదిలో మంచి ఫాలోయింగ్ ఉన్న ఐఐటీయెన్ ప్ర‌శాంత్ కిశోర్ ఉర‌ఫ్ పీకే ప‌రిస్థితి ఇలానే ఉంది!! ఎన్నో ఆశ‌ల‌తో ఢిల్లీ నుంచి పీకేని దిగుమ‌తి చేసుకున్నాడు జ‌గ‌న్‌. 2019 ఎన్నిక‌ల్లో ఎలాగైనా స‌రే ఏపీలో పాగా వేయాల‌ని దృఢంగా నిర్ణ‌యించుకున్న జ‌గ‌న్‌.. ఆదిశ‌గా త‌న‌ను, త‌న పార్టీని, నేత‌ల‌ను న‌డిపించేందుకు కోట్లు ధార పోసి పీకేని తెచ్చుకున్నాడు.

అయితే, 2019 సార్వ‌త్రిక ఎన్నిక‌ల క‌న్నా ముందే నంద్యాల ఉప ఎన్నిక రావ‌డంతో పీకే వ్యూహం ఇక్క‌డి నుంచి అమ‌లైంది. ఈ ఉప ఎన్నిక‌లో విజ‌యం సాధించ‌డం ద్వారా పీకే తానేమిటో రుజువు చేసుకోవాల‌ని భావించాడు. అందుకే నిత్యం ప్ర‌జ‌ల్లో జ‌గ‌న్ పేరు నానేలాగా ఉండాల‌ని స‌ల‌హా ఇవ్వ‌డంతో జ‌గ‌న్ రెచ్చిపోయి సీఎంను కాల్చి చంపాలి. చొక్కా విప్పాలి. వంటి వ్యాఖ్య‌లు చేశాడు. ఫ‌లితంగా.. ఆశించిన ఫ‌లితం రివ‌ర్స్ అయింది. దీంతో జ‌గ‌న్ ఆశ‌లు నెర‌వేర‌క‌పోగా పీకే వ్యూహం బెడిసి కొట్టింది. అయినా కూడా వైసీపీలో పీకేపై సానుభూతి త‌గ్గ‌లేదు. భూమ‌న, అంబ‌టి వంటి నేత‌లు పీకేని వెనుకేసుకు వ‌స్తూనే ఉన్నారు.

అయితే, అనూహ్యంగా ఇదే పార్టీకి చెందిన మీడియా వ్య‌వ‌హారాల ప్ర‌తినిధి వాసిరెడ్డి ప‌ద్మ‌.. తాజాగా పీకేని ఏకిపారేసింది. శుక్ర‌వారం సాక్షి టీవీలో జ‌రిగిన చ‌ర్చా కార్య‌క్ర‌మంలో పాల్గొన్న వాసిరెడ్డి.. “నంద్యాల ఫలితాలు, ప్రశాంత్ కిషోర్ కి చెంపపెట్టు లాంటివి” అని సంచలన వ్యాఖ్యలు చేశారు. దీంతో ఒక్క‌సారిగా లైవ్ షో.. ఉలిక్కి ప‌డింది. అదేంటి అని కామెంటేట‌ర్ కేఎస్ ఆర్ ప్ర‌శించినా ఆమె తీరు మార‌లేదు.

అయితే, చివ‌ర‌లో మాత్రం… “మరి ప్రశాంత్ కిషోర్ ఢిల్లీ కి వెళ్ళిపోతున్నాడనీ, వైసిపికి ఇకమీదట పనిచేయబోవడం లేదనీ వస్తున్న రూమర్ల పై ఏమంటారు” అన్న ప్రశ్నకి మాత్రం కొంత పాజిటివ్ గా స్పందించారు. అలాంటిదేమీ లేదని, ఆయన 2019 కి వైసిపికి వ్యూహకర్త గా ఉంటారనీ అంటూ, ఆయన వ్యూహలు మత్రం సరిచేసుకోవాలని హితవు చెప్పారు.