టీడీపీలో శ్రీభ‌ర‌త్ ఒంట‌రైపోయాడే… నారా – నంద‌మూరి స‌పోర్ట్ ఏది ?

నంద‌మూరి బాల‌య్య చిన్న‌ల్లుడు, టీడీపీ యువ నాయ‌కుడు.. మెతుకుమెల్లి శ్రీభ‌ర‌త్‌… రాజ‌కీయంగా ఒంట‌ర‌య్యారా? ఆయ‌న‌కు టీడీపీ టికెట్ ఇచ్చినా.. ఆయ‌న త‌ర‌ఫున ప్ర‌చారం చేయ‌డంలో పార్టీ వెనుక బ‌డిందా? అనే చ‌ర్చ ఆస‌క్తిగా మారింది. గ‌త ఎన్నిక‌ల్లోనూ శ్రీభ‌ర‌త్ పోటీ చేశారు. అయితే.. అప్పట్లో చంద్రబాబు నుంచి నంద‌మూరి బాల‌కృష్ణ వ‌ర‌కు అంద‌రూ ప్ర‌చారం చేశారు. పెద్ద ఎత్తున బూమ్ తీసుకువ‌చ్చారు. అయిన‌ప్ప‌టికీ.. భ‌ర‌త్ ఓట‌మి పాల‌య్యారు.

క‌ట్ చేస్తే.. విశాఖ సీటును ప‌ట్టుబ‌ట్టిన బీజేపీని కాద‌ని.. అనేక త్యాగాల త‌ర్వాత‌.. మ‌రోసారి ఈ టికెట్‌ను చంద్ర‌బాబు శ్రీభ‌ర‌త్‌కు కేటాయించారు. ఇప్పుడైనా ఆయన గెలుస్తార‌నే అంచ‌నాలు వేసుకున్నారు. కానీ, ఎక్క‌డో తేడా కొట్టింది. రాష్ట్రంలోని పలు నియోజ‌క‌వ‌ర్గాల్లో ప‌ర్య‌టిస్తున్న నారా, నంద‌మూరి కుటుంబాలు.. శ్రీభ‌ర‌త్ వైపు క‌న్నెత్తి కూడా చూడ‌డం లేదు. మ‌రి ఆయ‌నను కావాల‌నే ప‌క్క‌న పెట్టారా? లేక‌.. స‌మ‌యం లేద‌ని అనుకున్నారో తెలియాల్సి ఉంది.

ఇప్పుడు కేవ‌లం శ్రీభ‌ర‌త్ మాత్ర‌మే ప్ర‌చారం చేసుకుంటున్నారు ఇక‌, చంద్ర‌బాబును చూసుకున్నా.. ఆయ‌న కూడా పెద్ద‌గా విశాఖ పార్ల‌మెంటుపై దృష్టి పెట్టిందిలేదు. వ‌రుస‌కు కుమారుడు అయ్యే శ్రీభ‌ర‌త్ కోసం ప్ర‌త్యేకంగా చంద్ర‌బాబు ఇక్క‌డ ప‌ర్య‌టించి.. స‌భ‌లు, స‌మావేశాలు నిర్వ‌హించ‌లేదు. కూట‌మిలో భాగంగా ప‌వ‌న్ కొంత వ‌రకు ప్ర‌చారం చేసినా.. ఆ ఊపు ఏమేర‌కు క‌లిసి వ‌స్తుంద‌నేది చూడాలి. ఇక‌, వ్య‌క్తిగ‌తంగా చూసుకుంటే.. భ‌ర‌త్ దూకుడు స్వ‌భావం లేని నాయ‌కుడు.. కావ‌డంతో ప్ర‌చారంలో వెనుక బ‌డ్డారు.

పైగా అనుచ‌రుల‌ను పెంచుకోవ‌డంలోనూ.. కేడ‌ర్‌ను త‌న‌వైపు తిప్పుకోవ‌డంలోనూ.. శ్రీభ‌ర‌త్ పూర్తిగా విఫ లమ‌య్యార‌ని టీడీపీలోనే చ‌ర్చ సాగుతోంది. త‌న‌పై సానుభూతి ఉంద‌నిఆయ‌న భావిస్తున్నా.. అది ఇప్పుడు ఏమేర‌కు ట‌ర్న్ అవుతుంది? అనేది ప్ర‌శ్న‌. పైగా విశాఖ‌ను రాజ‌ధానిగా చేస్తామ‌ని వైసీపీ చెబుతున్న వ్య‌వ‌హారం ప్ర‌జల్లోకి బ‌లంగా వెళ్లింది. ఇది కూడా వ‌ర్క‌వుట్ అయితే.. శ్రీభ‌ర‌త్‌కు మరింత మైన‌స్ అవుతుంద‌ని అంటున్నారు. మొత్తంగా చూస్తే.. ఈ సారి నారా, నంద‌మూరి కుటుంబాల నుంచి శ్రీభ‌ర‌త్‌కు పెద్ద‌గా ద‌న్ను లేద‌నేది స్ప‌ష్ట‌మ‌ని అంటున్నారు ప‌రిశీల‌కులు.