రోజాకు ఏమైనా ప్రత్యేక రూల్స్.. చట్టాలు ఉన్నాయా?

కొత్త అసెంబ్లీలోనూ అధికార‌, విప‌క్ష స‌భ్యుల మ‌ధ్య మాట‌ల యుద్ధం కొన‌సాగుతోంది. ముఖ్యంగా వైసీపీ ఎమ్మెల్యే రోజా, టీడీపీ ఎమ్మెల్యేలు అనిత‌, బోండా ఉమామ‌హేశ్వ‌రావు.. మ‌ధ్య గ‌త అసెంబ్లీ సమావేశాల్లో జ‌రిగిన గొడ‌వ‌పై విచార‌ణ కొలిక్కి వ‌చ్చింది. రోజాను `ఆంటీ` అని సంబోధించ‌డం, త‌ర్వాత మంత్రులు అచ్చెన్నాయుడు, ఎమ్మెల్యే బోండాపై అనుచిత వ్యాఖ్య‌లు చేయ‌డం.. ఇవ‌న్నీ పెద్ద దుమార‌మే రేపాయి. ఇప్పుడు కొత్త అసెంబ్లీనీ ఈ అంశం కుదిపేస్తోంది. అయితే రోజాను `ఆంటీ` అన‌డంపై బోండా ఉమామ‌హేశ్వ‌ర‌రావు క్లారిటీ ఇచ్చారు.

ప్రజల సమస్యలపై చర్చించాల్సిన సభా సమయాన్ని వృథా చేసుకోవడం మంచిదికాదని.. రోజా విషయానికి ఇంతటితో ఫుల్‌స్టాప్ పెట్టాలని ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజ్ పరోక్షంగా స‌భ్యుల‌కు సూచించారు. విష్ణుకుమార్ వ్యాఖ్యలపై బోండా ఉమామహేశ్వరరావు స్పందించారు. `సభలో 175 మంది సభ్యులు ఉన్నారు. ఏ ఒక్కరికీ ప్రత్యేక రూల్స్ అంటూ ఉండవు. అలాగే రోజా కూడా ఒక సభ్యురాలు. రోజాకు ఏమైనా ప్రత్యేక చట్టాలున్నాయా? లేవు. మంత్రి సుజాత, ఎమ్మెల్యే అనితల పట్ల రోజా ఎలా ప్రవర్తించిందో సమాజం మొత్తం చూసింది.` అని అన్నారు.

బోండా ఉమా తనను ఆంటీ అన్నాడని, అచ్చెన్నాయుడు అసభ్యంగా దూషించాడని, దానిపై కూడా విచారణ జరపాలి కదా అని రోజా అన్న వ్యాఖ్యలపై స్పందించారు. `ఆంటీ అనడానికి, బూతులు తిట్టడానికి చాలా తేడా ఉంది. ఆంటీ అనేది రోజాకు సరిపోయే గౌరవప్రదమైన పదం. అంతేకానీ, మేం బూతులు మాట్లాడలేదు. కాబట్టి ఆంటీ అనడానికి దానికి సంబంధం లేదు(నవ్వుతూ). నేను ఆంటీ అంటే నన్ను ఏమన్నా అనమనడండి. కానీ మధ్యలో అనిత ఏం చేసింది?. సభలో ఒకరిపై ఒకరు కామెంట్లు చేసుకోవడం కామన్. కానీ అవి అసభ్యంగా ఉండకూడదు. ఒకవేళ అలాంటి పదాలు మాట్లాడితే అవతలివాళ్లకు మనం క్షమాపణ చెప్పాలి. ` అని వివ‌ర‌ణ ఇచ్చారు.

ఎమోషన్‌లో మాట జారినప్పుడు అనంతరం దాన్ని ఉపసంహరించుకోవాల‌ని సూచించారు అంతేకానీ రోజాకు ఏమైనా ప్రత్యేక చట్టాలు ఉన్నాయా? అని ప్ర‌శ్నించారు. ప్రివిలేజ్ కమిటీ ఎవరో చెప్పిన మాటలను బట్టి యాక్షన్ తీసుకోద‌ని, పూర్తి ఆధారాల‌తోనే నిర్ణ‌యం తీసుకుంటుంద‌ని బోండా తెలిపారు. దళిత మంత్రికి చెప్పు చూపించడం.. ముఖ్యమంత్రిని నానా దుర్భాషలాడడం.. దళిత ఎమ్మెల్యేను నోటికొచ్చినట్టు మాట్లాడడం.. ఇవన్నీ రోజా చేసిన తప్పులు. ఎవరికీ ప్రత్యేక చట్టాలు లేవు కాబట్టి తప్పు చేసినప్పుడు ఎవరైనా క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు.