తెలంగాణ‌లో ప‌వ‌న్ బ‌లం ఎంత‌..?

2019 ఎన్నిక‌ల్లో రెండు రాష్ట్రాల్లోనూ పోటీ చేస్తాన‌ని జ‌న‌సేన అధినేత, ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌న్ క‌ల్యాణ్ ప్ర‌కటన‌పై భిన్నాభిప్రాయాలు వ్య‌క్త‌మ‌వుతున్నాయి! ప్రజాస‌మస్య‌ల‌పై పోరాటం, బ‌హిరంగ స‌మావేశాలు వంటివి నిర్వ‌హించి.. ఏపీ ప్ర‌జ‌ల్లోకి జ‌న‌సేన‌ను తీసుకెళ్లాడు. మ‌రి తెలంగాణ‌లో ఇప్ప‌టివ‌ర‌కూ ఏ స‌మ‌స్య‌పైనా స్పందించ‌లేదు! తెలంగాణ ప్ర‌జ‌ల స‌మ‌స్య‌ల‌ను ప్ర‌భుత్వ దృష్టికి తీసుకెళ్ల‌లేదు. అస‌లు జ‌న‌సేన ఉన‌కి తెలంగాణ‌లో అస‌లు లేనే లేదు. మ‌రి ఇలాంటి స‌మ‌యంలో.. ఏధైర్యంతో ప‌వ‌న్ తెలంగాణ‌లో పోటీకి దిగుతాన‌ని ప్ర‌క‌టించాడు? ఆయ‌న బ‌ల‌మేంటి? అనే ప్ర‌శ్న‌లు ఇప్పుడు అంద‌రిలోనూ వ్య‌క్త‌మవుతున్నాయి.

ఆంధ్రాతోపాటు తెలంగాణలో కూడా 2019 ఎన్నిక‌ల్లో జ‌న‌సేన పోటీ చేస్తుంద‌నీ, అన్ని స్థానాల‌కూ అభ్య‌ర్థుల్ని నిల‌బెడుతుంద‌ని ప‌వ‌న్‌ క్లారిటీ ఇచ్చేశారు. అయితే… తెలంగాణ‌లో జ‌న‌సేన‌కు నాయ‌కులు ఎవ‌రా అనేది ఇప్పుడు రాజ‌కీయ వ‌ర్గాల్లో చ‌ర్చ మొద‌లైంది. సినీ న‌టుడిగా ప‌వ‌న్ క‌ల్యాణ్‌కు తెలంగాణ‌లోనూ పెద్ద ఫ్యాన్ బ్యాంక్ ఉంది. కానీ, జ‌న‌సేన పార్టీని న‌మ్మి, ఎన్నిక‌ల‌ బ‌రిలోకి దిగేందుకు ఎంత‌మంది నాయ‌కులు ముందుకొస్తార‌నేది చ‌ర్చ‌. గ‌త ఎన్నిక‌ల్లో తెలంగాణకి వ్య‌తిరేకంగా ప‌వ‌న్ క‌ల్యాణ్ భారీ ఎత్తున ప్ర‌చారం చేశారు. దీంతో తెరాసతోపాటు ఇత‌ర పార్టీలు కూడా ప‌వ‌న్‌పై తీవ్ర విమ‌ర్శ‌లు చేశారు.

ఎన్నిక‌ల త‌రువాత ప‌వ‌న్ స‌భ‌ల‌న్నీ ఆంధ్రాకే ప‌రిమితం అయ్యాయి. తెలంగాణ‌లో ఒక‌రిద్ద‌ర్ని ప‌రామ‌ర్శించిన సంద‌ర్భాలున్నాయంతే. ఇలాంటి ప‌రిస్థితుల మ‌ధ్య తెలంగాణ‌లో జ‌న‌సేన ఉనికి ఎక్క‌డ అనే ప్ర‌శ్న అంద‌రిలోనూ మెదులుతోంది. అస‌లే తెలంగాణ‌లో ప్ర‌త్యామ్నాయ‌మే లేని ప‌రిస్థితిని సీఎం కేసీఆర్ సృష్టించారు. ఇంకోప‌క్క బీజేపీ కూడా తెలంగాణ‌లో పుంజుకునేందుకు తీవ్ర ప్ర‌య‌త్నాలు చేస్తూనే ఉంది. అమిత్ షా కూడా ఫోక‌స్ పెంచార‌నీ అంటున్నారు.దీంతో తెలంగాణ ప్ర‌జ‌లు ప్ర‌త్నామ్నాయ రాజ‌కీయ పార్టీల వైపు చూస్తారా. అనేది మిలియ‌న్ డాల‌ర్ల ప్ర‌శ్న‌!!

వ‌చ్చే ఎన్నిక‌ల్లో పోటీకి సిద్ధ‌మ‌ని ప్ర‌క‌టించినా… ఎవ‌రో జ‌గ్గారెడ్డి లాంటి నేత‌లు మాత్ర‌మే జ‌న‌సేన‌కు వ‌చ్చే ఆస్కారం క‌నిపిస్తోంది. ఎందుకంటే, గ‌తంలో ప‌వ‌న్ రిఫ‌రెన్స్‌తోనే ఆయ‌న భాజ‌పాలోకి వెళ్లారు క‌దా! ఈ మ‌ధ్య ప‌వ‌న్‌ను ఆయ‌న క‌లుసుకున్నారు కూడా! కాబ‌ట్టి, జ‌న‌సేన‌కు జ‌గ్గారెడ్డి వచ్చే అవ‌కాశాలు క‌నిపిస్తున్నాయి. మ‌రి తెలంగాణ‌లో ఇత‌ర పార్టీల నుంచి వ‌చ్చే వారికి జ‌న‌సేన త‌లుపులు తెరుస్తారో లేదో తెలీదు!! ముఖ్యంగా తెలంగాణ ప్ర‌జ‌ల‌ను ప‌వ‌న్ ఎలా మెప్పిస్తాడ‌నేది కూడా ఆసక్తిక‌ర అంశ‌మే! మ‌రికొన్ని రోజుల్లో వీట‌న్నింటికీ జ‌వాబులు దొరుకుతాయేమో వేచిచూద్దాం!!