త‌బ్బిబ్బైపోతున్న కాపు నేతలు … కారణం అదే !

అంతెత్తున ఎగిసిన కాపు ఉద్య‌మం చ‌ప్ప‌గా చ‌ల్లారిపోయింది. అప్ప‌ట్లో వార్త‌ల్లో నిలిచిన కాపు ఉద్య‌మ‌నేత ముద్ర‌గ‌డ ప‌ద్మ‌నాభం పేరు.. ఇప్పుడు వినిపించ‌డ‌మే మానేసింది. ప్ర‌స్తుతం బ‌డ్జెట్‌లో కాపు కార్పొరేష‌న్‌కు రూ.1000కోట్లు కేటాయించి.. ఏపీసీఎం చంద్ర‌బాబు త‌న మార్క్ మ‌రోసారి చూపించారు. కాపుల‌కు అన్యాయం జ‌రుగుతోంద‌ని విమ‌ర్శిస్తున్న వారు కిక్కురుమ‌న‌కుండా చేసేందుకు.. కాపు ఉద్య‌మాన్ని మ‌రింత నీరుగార్చేందుకు ఇప్పుడు బాబు స‌రికొత్త వ్యూహంతో చంద్ర‌బాబు రంగంలోకి దిగుతున్నారు.

కాపుల త‌ర‌ఫున‌ ముద్ర‌గ‌డ ప‌ద్మ‌నాభంఉద్య‌మిస్తున్నా… అడుగ‌డుగునా ఆ ఉద్య‌మాన్ని అణిచివేయ‌డానికే తెలుగుదేశం స‌ర్కారు తెగ ప్ర‌య‌త్నిస్తోంది. అయితే కాపుల రిజ‌ర్వేష‌న్ల అంశం చాప‌కింద నీరులా ఆ సామాజిక వ‌ర్గంలో త‌న విస్తృతిని పెంచుకుంటూ పోతోంది. దీంతో రిజ‌ర్వేష‌న్ల ఉద్య‌మాన్ని నీరుగార్చే కొత్త ఎత్తు వేస్తోంది ఏపీ స‌ర్కారు! కాపుల‌కు చాలా చేసేశాం అనే ప్ర‌చారం మొద‌లుపెట్టింది. ఈ బాధ్య‌త‌ను ఆ సామాజిక వ‌ర్గానికి చెందిన వారితోనే ప్ర‌చారం చేయిస్తోంది.

ఏపీ బ‌డ్జెట్‌లో కాపు కార్పొరేష‌న్‌కు రూ. 1000 కోట్ల‌ను బ‌డ్జెట్‌లో ఆర్థిక మంత్రి య‌న‌మ‌ల కేటాయించారు. అయితే, ఇప్పుడు ఈ నిధులు చాలా ఎక్కువ అన్న‌ట్టుగా ఉబ్బి త‌బ్బిబ్బైపోతోంది కాపు కార్పొరేష‌న్‌! కాపు నేత‌లంతా వ‌రుస‌గా చంద్రబాబును క‌లుస్తున్నారు. ఈ కార్పొరేష‌న్ ఛైర్మ‌న్ నేతృత్వంలోని కొంత‌మంది పెద్ద‌లు ముఖ్య‌మంత్రికి ఘ‌న సన్మానం చేసేశారు. కాపుల ఉద్ధ‌ర‌ణ కోసం ఆశించిన దానికంటే అధిక‌మే చేశారంటూ చంద్ర‌బాబును ఓ రేంజిలో పొగ‌డ్త‌ల‌తో ముంచెత్తారు. అయితే, ఇవి కేవ‌లం కేటాయింపులు జ‌రిపింద‌న‌ని అంతా మ‌రిచిపోయేలా చేస్తున్నారు.

నిధులు స‌క్ర‌మంగా విడుద‌ల కావాలి, క్షేత్ర‌స్థాయిలో ప‌నులు జ‌ర‌గాలి, స‌త్ఫ‌లితాలు రావాలి… మ‌ధ్య‌లో ఇంత త‌తంగం ఉంది. అయితే ఈస‌త్కారాల వెనుక ఓ లెక్క క‌నిపిస్తోంది! ఎన్నిక‌ల ముందు కాపుల‌కు ఇచ్చిన హామీలేవీ ఇంత‌వ‌ర‌కూ అమ‌లు కాలేద‌ని ముద్ర‌గ‌డ ఉద్య‌మిస్తున్న సంగ‌తి తెలిసిందే. దాన్ని ఇంకాస్త నీరు గార్చాలంటే… ఇప్ప‌టికే కాపుల కోసం చాలాచాలా చేసేశాం అనే ప్రొజెక్ష‌న్ టీడీపీ స‌ర్కారుకు అవ‌స‌రం! అందుకే, బ‌డ్జెట్ కేటాయింపుల్ని ఈ ర‌కంగా వాడుకుంటోంద‌న్న అభిప్రాయాన్ని కొంత‌మంది వ్య‌క్తంచేస్తున్నారు. మొత్తానికి చంద్ర‌బాబు ఎత్తుగ‌డ మామూలుగా లేదుగా!!