టీడీపీ మూడో విడ‌త ఆప‌రేష‌న్ ఆక‌ర్ష్‌ స్టార్ట్..వైసీపీలో 3 వికెట్లు డౌన్‌..!

ఏపీలో అధికార టీడీపీ చేప‌ట్టిన ఆప‌రేష‌న్ ఆక‌ర్ష్‌కు ఇటీవ‌లే కాస్త బ్రేక్ ప‌డింది. రెండు విడ‌త‌లుగా జ‌రిగిన ఈ ఆప‌రేష‌న్ ఆక‌ర్ష్ దెబ్బ‌కు 21 మంది విప‌క్ష వైసీపీ ఎమ్మెల్యేల‌తో పాటు కొంద‌రు ఎమ్మెల్సీలు, ఒక‌రిద్ద‌రు ఎంపీలు కూడా అధికార టీడీపీ గూటికి చేరిపోయారు. ఆప‌రేష‌న్ ఆక‌ర్ష్ రెండో పేజ్ త‌ర్వాత కాస్త గ్యాప్ వ‌చ్చింది. ఇప్పుడు టీడీపీ మూడో విడ‌త ఆప‌రేష‌న్ ఆక‌ర్ష్‌కు తెర‌లేపిన‌ట్టు తెలుస్తోంది.

మూడో విడ‌త స్టార్టింగ్‌లోనే విప‌క్ష వైసీపీకి చెందిన ఇద్ద‌రు ఎమ్మెల్యేల‌తో పాటు మ‌రో కీల‌క వ్య‌క్తిని టీడీపీ లాగేసుకునే ప్ర‌య‌త్నాలు చేస్తున్న‌ట్టు ఏపీ టీడీపీ ఇంట‌ర్న‌ల్ పాలిటిక్స్‌లో చ‌ర్చ‌లు జ‌రుగుతున్నాయి. మూడో విడ‌త జంపింగ్ కార్య‌క్ర‌మంలో కృష్ణా జిల్లా నుంచి ఇద్ద‌రు ఎమ్మెల్యేల‌తో పాటు నెల్లూరు జిల్లా నుంచి మ‌రో కీల‌క నేత కూడా జ‌గ‌న్‌కు షాక్ ఇచ్చి సైకిలెక్కేందుకు రెడీ అవుతున్నార‌ట‌.

కృష్ణా జిల్లా నూజివీడు ఎమ్మెల్యే మేకా ప్ర‌తాప్ అప్పారావు, తిరువూరు ఎమ్మెల్యే కొక్కిలిగ‌డ్డ ర‌క్ష‌ణ‌నిధితో పాటు నెల్లూరు జిల్లాలో గ‌తంలో టీడీపీ ఎమ్మెల్యేగా ప‌నిచేసిన న‌ల్ల‌పురెడ్డి ప్ర‌స‌న్న‌కుమార్‌రెడ్డి కూడా ఇప్పుడు తిరిగి సొంత గూటికే చేరుకోనున్నార‌ని టాక్‌. జంపింగ్ లిస్టులో ఉన్న ఎమ్మెల్యేల్లో ప్రతాప్ అప్పారావు, ర‌క్ష‌ణ‌నిధి పేర్లు ఎప్ప‌టి నుంచో వినిపిస్తున్నాయి.

ఇక ఇప్పుడు కొత్త‌గా ప్ర‌స‌న్న‌కుమార్‌రెడ్డి పేరు కూడా తెర‌మీద‌కు వ‌చ్చింది. రాజ‌కీయాల్లో ఓడిపోయిన వారికి ఎంత అనుభ‌వం ఉన్నా వేస్టే. గ‌త ఎన్నిక‌ల్లో ఓడిపోయిన ప్ర‌స‌న్న‌కుమార్‌రెడ్డిని వైసీపీ నాయ‌క‌త్వం పూర్తిగా ప‌క్క‌న పెట్టేసిన‌ట్టే క‌నిపిస్తోంది. 2014కు ముందు వ‌ర‌కు మీడియాలో బాగా ఫోక‌స్ అయిన ప్ర‌స‌న్న ఆ త‌ర్వాత తెర‌మ‌రుగ‌య్యారు.

న‌ల్ల‌పురెడ్డి ప్ర‌స‌న్న కుమార్ రెడ్డి కుటుంబానికి టీడీపీతో ద‌శాబ్దాల అనుభ‌వ‌ముంది. ప్ర‌స్తుతం మంత్రి ప‌ద‌వి రేసులో ఉన్న సోమిరెడ్డి చంద్ర‌మోహ‌న్‌రెడ్డి, ప్ర‌స‌న్న‌కుమార్ రెడ్డి బావ‌బావ‌మ‌రుదులు అవుతారు. 2009లో టీడీపీ నుంచి గెలిచిన ప్ర‌స‌న్న‌కుమార్‌రెడ్డి, 2012లో జ‌రిగిన ఉప ఎన్నిక‌ల్లో బావ సోమిరెడ్డినే ఓడించారు. 2014లో ఆయ‌న పోలంరెడ్డి శ్రీనివాసుల రెడ్డి చేతిలో ఓడిపోవ‌డంతో జ‌గ‌న్ ప‌క్క‌న పెట్టేశారు.

ఇటీవ‌ల ఎమ్మెల్సీ టిక్కెట్టు ఇస్తార‌ని ప్ర‌స‌న్న ఆశిస్తే… జ‌గ‌న్ త‌న‌కు ప్ర‌త్య‌ర్థి వ‌ర్గ‌మైన ఆనం ఫ్యామిలీకి ఎమ్మెల్సీ అభ్య‌ర్థిత్వం ఇచ్చింది. ఈ క్ర‌మంలోనే ఆయ‌న విసుగుచెంది సైకిలెక్కేందుకు రెడీ అవుతున్న‌ట్టు తెలుస్తోంది. ఎలాగూ సోమిరెడ్డి చంద్ర‌మోహ‌న్ రెడ్డి అండ ఉండ‌నే ఉంది. కాబ‌ట్టి ప్ర‌స‌న్న కుమార్ రెడ్డి సైకిల్ ఎక్క‌డం లాంఛ‌న‌మేన‌న్న గుస‌గుస‌లు వినిపిస్తున్నాయి. మ‌రి ఎమ్మెల్యేలు ప్ర‌తాప్ అప్పారావు, ర‌క్ష‌ణ‌నిధి, ప్ర‌స‌న్న కూడా పార్టీ వీడితే జ‌గ‌న్‌కు మ‌రిన్ని క‌ష్టాలు త‌ప్ప‌వు.