2019లో మోడీకి యాంటీగా థ‌ర్డ్ ఫ్రంట్‌

ఐదు రాష్ట్రాల ఎన్నిక‌ల ఫ‌లితాలు, యూపీలో బీజేపీ ఘ‌న‌విజ‌యం చూశాక ఇప్పుడు దేశ‌వ్యాప్తంగా అంద‌రి దృష్టి 2019 మీదే ఉంది. 2019 ఎన్నిక‌ల్లో మ‌రోసారి కేంద్రంలో ఎన్డీయే గెలుస్తుందని… ప్ర‌ధాన‌మంత్రి న‌రేంద్ర‌మోడీ వ‌రుస‌గా రెండోసారి అధికారంలోకి వ‌స్తార‌న్న అంచ‌నాలు వ‌చ్చేశాయి. ఫ్యూచ‌ర్‌లో అస్స‌లు ప్రాంతీయ పార్టీల మీద ఆధార‌ప‌డ‌కుండా నార్త్ టు సౌత్ వ‌ర‌కు తిరుగులేని శ‌క్తిగా ఎద‌గాల‌నుకుంటోన్న మోడీ అందుకు త‌గ్గ‌ట్టుగానే ప్రాంతీయ పార్టీల‌ను చాలా వ్యూహాత్మ‌కంగా అణ‌గ‌దొక్కేస్తున్నారు.

ఓ ప‌క్క కాంగ్రెస్ దానంత‌ట అదే వీక్ అవుతోంది. ఇదే క్ర‌మంలో మోడీ త‌మ‌కు మిత్ర‌ప‌క్షాల‌కుగా ఉన్న పార్టీల‌ను సైతం తొక్కేస్తున్నారు. ఏపీలో టీడీపీయే ఇందుకు పెద్ద ఉదాహ‌ర‌ణ‌. మ‌హారాష్ట్ర‌లో శివ‌సేన లాంటి వాళ్లు బీజేపీనీ ఎప్పుడూ లెక్క చేయ‌రు. ఈ క్ర‌మంలోనే ఇప్పుడు 2019లో మోడీని ఎదుర్కోవాలంటే కాంగ్రెస్ వ‌ల్ల సాధ్యం కాద‌ని రాజ‌కీయ విశ్లేష‌కులు సైతం లెక్క తేల్చేశారు.

తాజాగా జ‌మ్ము క‌శ్మీర్ మాజీ సీఎం చేసిన వ్యాఖ్య‌లు ఇప్పుడు దేశ‌వ్యాప్తంగా మోడీకి యాంటీగా థ‌ర్డ్ ఫ్రంట్ ఆవ‌శ‌క్య‌త‌ను గుర్తు చేస్తున్నాయి. 2019 ఎన్నికలను మరిచి 2024లో గెలవడంపై దృష్టిసారించాల‌ని జమ్ము కశ్మీర్ మాజీ ముఖ్యమంత్రి, నేషనల్ కాన్ఫరెన్స్ నేత ఒమర్ అబ్దుల్లా చెప్పారు. ఆయ‌న వ్యాఖ్య‌ల ప్ర‌కారం చూస్తే 2019 ఎన్నిక‌ల్లో మోడీని ఎదుర్కోవాలంటే బిహార్ అసెంబ్లీ ఎన్నిక‌ల్లో బ‌రిలోకి దిగిన‌ట్టు మ‌హాకూట‌మి ఏర్ప‌డి అందులో విప‌క్షాల‌న్ని ఏకం కావాల్సి ఉంది.

బిహార్‌లో బీజేపీని అధికారంలోకి రాకుండా చూసేందుకు అక్క‌డ లాలూ ప్ర‌సాద్ యాద‌వ్‌, నితీష్‌కుమార్ యాద‌వ్‌, కాంగ్రెస్ ఒక్క‌టై పోటీ చేశాయి. ఈ దెబ్బ‌కు బీజేపీ చిత్తు చిత్త‌య్యింది. ఇదే క్ర‌మంలో 2019లో యూపీలో ఎస్పీ, బీఎస్పీ, కాంగ్రెస్ పొత్తు పెట్టుకుని పోటీ చేస్తేనే మోడీని అక్క‌డ ఎదుర్కోవ‌డం సాధ్య‌మ‌వుతుంద‌ని రాజ‌కీయ‌వ‌ర్గాలు సైతం భావిస్తున్నాయి.

ఇక కాంగ్రెస్ సీనియ‌ర్ నేత‌, మాజీ మంత్రి మ‌ణిశంక‌ర్ అయ్య‌ర్ కూడా ఇదే అభిప్రాయాన్ని వ్య‌క్తం చేశారు. చాలా రాష్ట్రాల్లో త‌మ పార్టీ బ‌ల‌హీనంగా ఉంద‌ని… 2019 ఎన్నికలకు తప్పనిసరిగా మహా కూటమిని ఏర్పటు చేయాలని అన్నారు. యూపీలో మహాకూటమి లేనందువల్లే బీజేపీ గెలిచిందని…అదే అక్క‌డ ఎస్సీ, బీఎస్సీ, కాంగ్రెస్ క‌లిస్తే బీజేపీ ఓడిపోయేద‌ని అంచ‌నాలు కూడా ఉన్నాయి. ఇందుకు వారు బిహార్ ఫ‌లితాన్ని ఉదాహ‌రిస్తున్నారు.

ఇక మోడీకి పోటీగా మహాకూటమి తరఫున బిహార్ ముఖ్యమంత్రి నితీష్‌ కుమార్‌ను ప్రధాని అభ్యర్థిగా బరిలో దింపే అంశం కూడా ఫ్యూచ‌ర్‌లో చ‌ర్చ‌కు రానుంది. అయితే ఇదే టైంలో ఎస్పీ అధినేత ములాయం సింగ్ యాద‌వ్ కూడా ఈ మ‌హాకూట‌మి త‌ర‌పున పీఎం రేసులో ఉండొచ్చు.