ఏపీలో ఆ 3 ఎమ్మెల్సీలు టీడీపీకా …వైసీపీకా..!

ఏపీలో తీవ్ర ఉత్కంఠ పరిస్థితులు నెలకొన్నాయి. ఎమ్మెల్సీ ఎన్నికల్లో భాగంగా స్థానిక సంస్థల కోటాకు సంబంధించిన మూడు జిల్లాల్లో శుక్ర‌వారం పోలింగ్ జ‌రుగుతోంది. స్థానిక సంస్థ‌ల కోటాలో మొత్తం 9 స్థానాల‌కు ఎన్నిక‌లు జ‌ర‌గాల్సి ఉండ‌గా అందులో 6 స్థానాలు ఏక‌గ్రీవం అయ్యాయి. ఇక వైసీపీకి మంచి బ‌లం ఉన్న జ‌గ‌న్ సొంత జిల్లా క‌డ‌ప‌తో పాటు కర్నూలు, నెల్లూరు జిల్లాల్లో ఎమ్మెల్సీ ఎన్నిక‌లు తీవ్ర ఉత్కంఠ‌ను రేకెత్తిస్తున్నాయి.

క‌డ‌ప జిల్లాలో జ‌గ‌న్ త‌న సొంత బాబాయ్ వైఎస్‌.వివేకానంద‌రెడ్డిని బ‌రిలోకి దింపారు. ఇక్క‌డ టీడీపీ అభ్య‌ర్థిగా బీటెక్ ర‌వి బ‌రిలో ఉన్నారు. ఈ ఎన్నిక కోసం జ‌గ‌న్ శుక్ర‌వారం అంతా జిల్లాలోనే ఉండ‌నున్నారు. ప్ర‌త్యేకించి పార్టీ మారిన ఆదినారాయ‌ణ‌రెడ్డి నియోజ‌క‌వ‌ర్గం జ‌మ్మ‌ల‌మ‌డుగులోనే జ‌గ‌న్ మ‌కాం వేశారు. అటు చంద్ర‌బాబు కూడా ఈ ఎన్నిక‌ను ప్ర‌తిష్టాత్మ‌కంగా తీసుకోవ‌డంతో క‌డ‌ప ఎమ్మెల్సీ వార్ వ‌న్డే క్రికెట్ మ్యాచ్‌లా మారింది.

ఇక క‌ర్నూలు ఎమ్మెల్సీ గెలుచుకునేందుకు చంద్ర‌బాబు చాలా ప్లానే వేశారు. అక్క‌డ వైరి వ‌ర్గాలుగా ఉన్న భూమా, శిల్పాను ఒకే గూటి కింద‌కు తెచ్చారు. ఈ ఎన్నిక‌ల వేళ తీవ్ర ఒత్తిడికి గురైన భూమా హ‌ఠాన్మ‌ర‌ణం చెందారు. ఇక్క‌డ‌ టీడీపీ అభ్యర్థిగా ఆ పార్టీ జిల్లా అధ్యక్షుడు మాజీ ఎమ్మెల్సీ శిల్పా చక్రపాణిరెడ్డి వైసీపీ అభ్యర్థిగా ఆ పార్టీ జిల్లా అధ్యక్షుడు గౌరు వెంకటరెడ్డి బరిలో నిలిచారు. రెండు పార్టీల నుంచి జిల్లా పార్టీ అధ్య‌క్షులే రంగంలో ఉండ‌డంతో ఇక్క‌డ కూడా గెలుపు నువ్వా ? నేనా ? అన్న‌ట్టుగా ఉన్నా టీడీపీకి మొగ్గు క‌నిపిస్తోంది.

ఇక నెల్లూరు జిల్లా విషయానికి వస్తే… కాంగ్రెస్ నుంచి ఇటీవలే టీడీపీలోకి చేరిన సీనియర్ రాజకీయవేత్తలు ఆనం బ్ర‌ద‌ర్స్‌ సోదరుడు ఆనం విజయకుమార్ రెడ్డి వైసీపీ అభ్యర్థిగా బరిలోకి దిగడంతో పోటీ రసవత్తరంగా మారింది. అదే సమయంలో ఆ జిల్లా టీడీపీ అభ్యర్థిగా మాజీ ఎమ్మెల్సీ వాకాటి నారాయణరెడ్డిని చంద్రబాబు బరిలోకి దింపారు.

ఆనం సోద‌రుల‌కు ఎమ్మెల్సీ ఇస్తాన‌న్న చంద్ర‌బాబు చివ‌రి నిమిషంలో హ్యాండ్ ఇవ్వ‌డంతో వారు కూడా ఇంట‌ర్న‌ల్‌గా త‌మ సోద‌రుడు, వైసీపీ అభ్య‌ర్థి విజ‌య్‌కుమార్‌రెడ్డికే స‌పోర్ట్ చేస్తున్నార‌న్న గుస‌గుస‌లు వినిపిస్తున్నాయి. ఏదేమైనా ఈ మూడు ఎమ్మెల్సీ ఎన్నిక‌లు టీడీపీ వ‌ర్సెస్ వైసీపీ మ‌ధ్య మినీ సంగ్రామాన్ని త‌ల‌పిస్తున్నాయి. మ‌రి ఫైన‌ల్ రిజ‌ల్ట్ ఎలా ఉంటుందో చూడాలి.