క‌ర్నూలులో టీడీపీకి ఊహించ‌ని షాక్‌

క‌ర్నూలు జిల్లాలో రాజ‌కీయాలు ర‌స‌వత్త‌రంగా మారాయి! ముఖ్యంగా స్థానిక సంస్థ‌ల ఎన్నిక‌ల వేళ అధికార టీడీపీకి గ‌ట్టి ఎదురుదెబ్బ త‌గ‌ల‌బోతోంది. అలాగే ప్ర‌తిప‌క్ష వైసీపీలోకి చేర‌బోయే నాయ‌కుల జాబితా రోజురోజుకూ పెరుగుతోంది. ఆ ప్రాంతానికి చెందిన కేంద్ర మాజీ మంత్రి కోట్ల సూర్య‌ప్ర‌కాశ్ రెడ్డి.. ఇక రేపో మాపో వైసీపీలో చేరేందుకు ముహూర్తం ఖ‌రారు చేసుకున్నారు.

ప్ర‌భుత్వంపై తీవ్రంగా అసంతృప్తితో ఉన్న ఆయ‌న.. ఈ మేర‌కు ప్ర‌తిప‌క్ష నేత జ‌గ‌న్‌తో చ‌ర్చించార‌ని స‌మాచారం. ఆయ‌న‌కు ఎంపీ టికెట్ కూడా ఖాయ‌మైంద‌ని తెలుస్తోంది. దీంతో ప్ర‌స్తుతం జ‌ర‌గ‌బోయే స్థానిక సంస్థ‌ల ఎన్నిక‌ల్లో వైసీపీకి మ‌ద్ద‌తు ఇవ్వబోతున్నారు. అనంత‌రం వైసీపీలో చేర‌బోతున్నార‌ని తెలుస్తోంది!!

టీడీపీ నేత‌, కేంద్ర మాజీ మంత్రి కోట్ల సూర్యప్ర‌కాశ్‌రెడ్డి.. సీఎం చంద్ర‌బాబు తీరుపై తీవ్రంగా మండిప‌డ్డారు. రాయ‌ల‌సీమ‌కు తీవ్ర అన్యాయం చేస్తున్నార‌ని దుయ్య‌బ‌ట్టారు. రాయల‌సీమ‌కు నీరు ఇచ్చార‌ని చెబుతున్న చంద్ర‌బాబు.. ఆ పేరుతో రైతుల‌ను దగా చేస్తున్నార‌ని విమ‌ర్శించారు. టీడీపీ అరాచకాలకు చెక్‌ పెట్టేందుకే స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల్లో వైసీపీకి మద్దతు ఇస్తున్నట్లు మాజీ కేంద్ర మంత్రి కోట్ల సూర్యప్రకాశ్‌రెడ్డి తెలిపారు. వైసీపీ ఎమ్మెల్సీ అభ్య‌ర్థి గౌరువెంకటరెడ్డి, అనంతపురం మాజీ ఎంపీ అనంత వెంకటరామిరెడ్డి.. కోట్ల సూర్య‌ప్ర‌కాశ్‌ను క‌లిసి.. మ‌ద్ద‌తు ఇవ్వాల‌ని కోరగా, దీనికి ఆయ‌న అంగీక‌రించారు.

ఈ సంద‌ర్భంగా కోట్ల సూర్యప్రకాశ్‌రెడ్డి మాట్లాడుతూ ఎల్‌ఎల్‌సీ, జీడీపీ నీటిని అసమర్థ నాయకత్వంతో 9 టీఎంసీలు వృథా చేశారని, 9 టీఎంసీలకు 90 వేల ఎకరాలకు పంటలు పండించవచ్చని అయితే 20 వేల ఎకరాలకు కూడా నీళ్లు అందించలేదని తెలిపారు. కాగా క‌ర్నూలులో కోట్ల సూర్య‌ప్ర‌కాశ్ రెడ్డికి మంచి ప‌ట్టు ఉంది. అయినా ఆయ‌న కొంత‌కాలం నుంచీ పార్టీ కార్య‌క్ర‌మాల‌కు దూరంగా ఉంటున్నారు. ఈ నేప‌థ్యంలోనే ఆయ‌న వైసీపీ వైపు చూస్తున్న‌ట్లు తెలుస్తోంది.

అయితే క‌ర్నూలు నుంచి ఎంపీగా పోటీచేయాల‌ని ఆయ‌న అంత‌రంగాన్ని ఆవిష్క‌రించగా.. ఇందుకు అధినేత జ‌గ‌న్ కూడా సుముఖత వ్య‌క్తంచేశార‌ట‌. దీంతో ఆయ‌న ముందుగా ఎమ్మెల్సీ ఎన్నిక‌ల్లో వైసీపీకి మ‌ద్ద‌తు ఇవ్వాల‌ని నిర్ణ‌యించుకున్నారు. అన్నీ కుదిరిన త‌ర్వాత ఇక అధికారికంగా వైసీపీ కండువా క‌ప్పుకుంటార‌ని రాజ‌కీయ వ‌ర్గాల స‌మాచారం!!