బంగారు తెలంగాణ‌.. కాదు అప్పుల తెలంగాణ‌

అప్పు చేసి ప‌ప్పు కూడు మాత్రం తినొద్దంటారు పెద్ద‌లు!! కానీ తెలంగాణ పెద్ద‌లు మాత్రం `మాకు అప్పే ముద్దు` అంటున్నారు. విభ‌జ‌న త‌ర్వాత తీవ్ర ఆర్థిక లోటు ఉన్న రాష్ట్రంగా న‌వ్యాంధ్ర ఆవిర్భ‌విస్తే.. మిగులు రాష్ట్రంగా తెలంగాణ ఏర్ప‌డింది. మూడేళ్లు గిర్రున గడిచాయి! ఇప్పుడు తెలంగాణ కూడా మిగులు నుంచి అప్పుల ఊబిలోకి కూరుకుపోతోంది, ఎంతలా అంటే.. అప్పుల్లో ఏపీని కూడా మించిపోయేంతగా!! ప్ర‌స్తుతం తెలంగాణ అప్పులు ఎంతో తెలుసా 77వేల కోట్లు!! ఇప్పుడే పరిస్థితి ఇలా ఉంటే భ‌విష్య‌త్తులో ఇంకెలా ఉంటుందో ఊహించుకోవ‌డానికే భ‌యం గొలుపుతోంది క‌దూ!!

బంగారు తెలంగాణ కాస్తా అప్పుల తెలంగాణగా మారిపోతోంది. చేతికి ఎముక లేనట్లుగా వరాలు ప్రకటించే సీఎం కేసీఆర్ తీరుతో ధనిక రాష్ట్రం కాస్తా అప్పుల రాష్ట్రంగా మారుతుందన్న విషయం.. ఆర్థిక మంత్రి ఈటెల రాజేంద‌ర్ ప్ర‌వేశ‌పెట్టిన బ‌డ్జెట్‌తో స్పష్టమైంది. అభివృద్ధి పేరిట తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ చెప్పేవన్నీ తియ్యటి మాటలేనని తేలిపోయింది. రోజులు గడుస్తున్న కొద్దీ అప్పుల భారం రాష్ట్రం మీద అంతకంతకూ పెరుగుతుందన్న విషయం స్ప‌ష్ట మవుతోంది.

కొద్ది నెలల్లో తెలంగాణ ఏర్పడి మూడేళ్లు నిండుతుంది. అదే సమయంలో ప్రభుత్వం ఏర్పడి మూడేళ్ల అవుతుంది. ఈ మూడేళ్ల వ్యవధిలో కేసీఆర్ సర్కారు సాధించిందేమిటి? అన్న ప్రశ్న వేస్తే.. కళ్లు బైర్లు కమ్మే అప్పుల లెక్క కనిపిస్తుంది. తమ ప్రభుత్వం వచ్చిన తర్వాత.. ఊహించనంత అభివృద్ధి చేసినట్లుగా తెలంగాణ సర్కారు అదే పనిగా చెప్పుకుంటోంది. టీఆర్ ఎస్ సర్కారు కొలువు తీరిన మూడేళ్ల వ్యవధిలో పెరిగిన అప్పు రూ.77వేల కోట్లకు పెరగటం మ‌రి దేనికి నిదర్శనం? అన్నది ఇప్పుడు పెద్ద ప్రశ్నగా మారింది. ఉమ్మ‌డి రాష్ట్రంలో తెలంగాణ వెనుక‌బాటుకు గురైంద‌ని చెప్పే కేసీఆర్‌.. ఇప్పుడు ఎందుకు ఇంత అప్పు చేయాల్సి వ‌చ్చిందో!!

అభివృద్ధి పథంలోకి దూసుకెళుతున్నట్లు చెప్పుకునే తెలంగాణ సర్కారు తాను చేస్తున్న భారీ అప్పుల గురించి.. ప్రజలకు వివరణ ఇవ్వాల్సిన అవసరం ఎంతైనా ఉందనేది కొంద‌రి అభిప్రాయం. ధనిక రాష్ట్రం అంటే ఆదాయ మిగులును చూపిస్తేనే సరిపోదు. చేసిన అప్పు నుంచి మిగులుగా చెబుతున్న మొత్తాన్ని తీసేసిన తర్వాత కూడా మిగిలి ఉంటే ధనిక రాష్ట్రమని గొప్పలు చెప్పుకోవచ్చు. మొత్తానికి రాష్ట్రాన్ని పూర్తిగా అప్పుల ఊబిలోకి నెట్టేస్తారో లేక‌.. ఇక నైనా బ‌య‌ట‌ప‌డేందుకు ప్ర‌య‌త్నాలు చేస్తారో లేదో వేచిచూడాల్సిందే!!