ఎమ్మెల్యే కోటాలో టీడీపీ ఎమ్మెల్సీలు వీళ్లే… ట్విస్టులే ట్విస్టులు

ఇప్ప‌టికే స్థానిక సంస్థ‌ల ఎమ్మెల్సీల‌ను ఏక‌గ్రీవం చేసుకుని దూకుడు మీదున్న టీడీపీ.. ఇప్పుడు ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీల‌పై దృష్టిసారించింది. అనేక వ‌డ‌పోత‌లు, చ‌ర్చోప‌చ‌ర్చ‌ల అనంత‌రం కొంత‌మందిని ఎంపిక చేశారు పార్టీ అధినేత చంద్ర‌బాబు. ఇప్పుడు వీరి నుంచి ఫైన‌ల్ అభ్య‌ర్థుల‌ను ఖ‌రారు చేసిన‌ట్టు స‌మాచారం! అలాగే గ‌వ‌ర్న‌ర్ బెర్తు కోటాలో ఎవ‌రికి ఎమ్మెల్సీ కేటాయించాలో కూడా ఇప్ప‌టికే జాబితా సిద్ధం చేసేశార‌ట‌. అలాగే త‌న త‌న‌యుడు లోకేశ్ నామినేష‌న్ వేసేందుకు కూడా ముహూర్తం ఫిక్స్ చేశార‌ట‌.

స్థానిక సంస్థలు – గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలు లేని జిల్లాల నుంచి వీరిని ఎంపిక చేయాలన్నది ఆయన ఆలోచనగా చెబుతున్నారు. అయితే… ఫైనాన్షియల్ గా కులంపరంగా కూడా బలంగా ఉన్నవారికే అవకాశం ఇస్తారని తెలుస్తోంది. విశ్వసనీయ సమాచారం ప్రకారం చంద్రబాబు వద్ద ఉన్న ప్రాబబుల్స్ ఫైనల్ లిస్టులో ప్రతిభాభారతి – పుష్పరాజ్ – కరణం బలరాం – మసాల పద్మజ – ముళ్లపూడి రేణుక – చెంగల్రాయుడు – సతీశ్ రెడ్డి – తెంటు లక్ష్ముంనాయుడు – జ్యోత్స్నలత ఉన్నట్లు తెలుస్తోంది. వీరిలో ప్రతిభాభారతి సతీశ్ రెడ్డిలు సిట్టింగ్ ఎమ్మెల్సీలుగా ఉన్నారు. మ‌రి వీరిలో ఎవ‌రికి ఫైన‌ల్‌గా సీట్లు క‌న్‌ఫార్మ్ అవుతాయ‌న్న‌ది మాత్రం కాస్త స‌స్పెన్స్‌గానే ఉంది.

ఇక ఏపీ సీఎం చంద్రబాబు తనయుడు లోకేశ్ ఎమ్మెల్సీ కావడానికి మంచి ముహూర్తం చూసుకుని నామినేషన్ వేస్తున్నారు. మృగశిర నక్షత్రంలో ఈ నెల 6న ఆయన నామినేషన్ వేయనున్నట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి. ఇప్పటికే టీడీపీ పాలిట్ బ్యూరో లోకేశ్ సీటును కన్ఫర్మ్ చేసింది. దీంతో ఏమాత్రం అలుపూసొలుపూ లేకుండా తమ ఎమ్మెల్యేలు వేసే ఓట్లతో చిన్నవయసులోనే పెద్దల సభలో అడుగుపెట్టబోతున్నాడు లోకేశ్. అక్కడి కొద్దిరోజుల్లోనే రానున్న ఉగాది పర్వదినాన ఆయన మంత్రి పదవి కూడా చేపట్టబోతున్నారని టీడీపీ వర్గాలు చెబుతున్నాయి.