2019…ప‌వ‌న్ కింగ్ మేక‌ర్ క‌న్‌ఫార్మా..!

2019 ఎన్నిక‌ల్లో ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో ముక్కోణ‌పు పోటీ త‌ప్పేలా క‌నిపించ‌డం లేదు. ముఖ్యంగా టీడీపీ-వైసీపీ మ‌ధ్య పోటీ తప్ప‌దనేది అంద‌రికీ తెలిసిన విష‌య‌మే! కానీ ఇప్ప‌డు జ‌న‌సేన అధినేత ప‌వ‌న్ క‌ల్యాణ్ నిర్ణ‌యాత్మ‌క శ‌క్తిగా ఎదుగుతు న్నాడు. అయితే ఇప్పుడో ఆస‌క్తిక‌ర అంశ‌మేంటంటే..2019 ఎన్నిక‌ల్లో ప‌వ‌న్ కింగ్ మేక‌ర్‌లా మార‌బోతున్నాడట‌.అయితే 2009 ఎన్నిక‌ల్లో పీఆర్పీ పోటీ చేసిన స‌మ‌యంలో చిరు కూడా కింగ్ మేక‌ర్‌లా మార‌తాడ‌ని అంతా అనుకున్నా.. సాధ్యం కాలేదు. ఇప్పుడు ప‌వ‌న్ కూడా కింగ్ మేక‌ర్‌లా మ‌రే అవ‌కాశాలుండ‌టంతో.. అప్పుడు అన్న‌కి సాధ్యం కానిది ఇప్పుడు త‌మ్ముడు నెర‌వేరుస్తాడా అన్న‌ది విశ్లేష‌కుల అభిప్రాయం!!

జ‌న‌సేన ఇప్పుడు వేగం పెంచింది. జ‌న‌సేనాని ప్ర‌జల్లోకి దూసుకెళుతూ.. స‌మ‌స్య‌ల‌పై ప్ర‌భుత్వానికి ప్ర‌శ్న‌లు సంధిస్తున్నాడు. అంతా వ్యూహాత్మ‌కంగా పావులు క‌దుపుతూ.. ప్ర‌జ‌ల్లోకి చొచ్చుకెళుతూ.. అంశాల వారీగా పోరాటం చేస్తూ ప్ర‌జ‌ల‌ను ఆక‌ట్టుకునే ప్ర‌య‌త్నం చేస్తున్నారు. ఇది జ‌న‌సేన‌కు బాగా క‌లిసివ‌చ్చింది. దీంతో ఆ పార్టీకి రోజురోజుకు జ‌నాక‌ర్ష‌ణ పెరుగుతోంది. దీంతో వైసీపీ క‌న్నా జ‌న‌సేన పేరు బ‌లంగా వినిపిస్తోంది. 2019 ఎన్నిక‌ల బ‌రిలో జ‌న‌సేన దిగ‌డం ఖాయ‌మైపోయింది. గ‌తంలోలా టీడీపీ-బీజేపీ కూట‌మికి మ‌ద్ద‌తిచ్చేలా క‌నిపించ‌డం లేదు.

ఎన్నిక‌లు స‌మీపిస్తున్న కొద్దీ ప‌వ‌న్ క‌ల్యాణ్ ఇప్ప‌ట్నుంచే జ‌న‌సేన బ‌లాబ‌లాల‌పై అంచనాలు వేసుకుంటున్నారు. ఇటీవ‌లే ఆ పార్టీ ఒక్క స‌ర్వే చేయించింద‌ని స‌మాచారం. ఆ పార్టీ అధికార ప్ర‌తినిధి సుంక‌ర క‌ల్యాణ్ మాట‌ల్లో చెప్పాలంటే.. జ‌న‌సేనకు 57 నుంచి 62 స్థానాల వ‌ర‌కు ద‌క్కే ఛాన్స్ ఉంద‌ని తేలింద‌ట‌. అయితే ఈ స‌ర్వే ఇప్ప‌టి అంచ‌నాల ప్ర‌కార‌మేన‌ట‌. కొంచెం క‌ష్ట‌ప‌డితే మ‌రిన్ని ఎక్కువ సీట్లు సాధిస్తామ‌ని ఆ పార్టీ ఘంటాప‌థంగా చెబుతోంది.

ఎలాగూ 2019 ఎన్నిక‌ల్లో టీడీపీ- వైసీపీల మ‌ధ్య మ‌రోసారి ట‌ఫ్ ఫైట్ ఉంటుంది. ఈ రెండింటి మ‌ధ్య పోరులో అస‌లు లాభం త‌మ‌కే జ‌రుగుతుంద‌ని జ‌న‌సేన ఆశ‌.

2014 ఎన్నిక‌ల్లో వైసీపీని అధికారంలోకి రాకుండా నిల‌వ‌రించింది జ‌న‌సేన అని అంతా న‌మ్ముతున్నారు. 2019 ఎన్నిక‌ల్లోనూ వైసీపీకి పెద్ద లాస్ త‌ప్ప‌దనే వాద‌న వినిపిస్తోంది. ఒక‌వేళ‌ ప‌వ‌న్ క‌ల్యాణ్ .. కింగ్ మేక‌ర్ అయితే వైసీపీ కంటే టీడీపీ వైపే మొగ్గు చూపే అవ‌కాశాలు ఎక్కువ‌. ఆ దిశ‌గా ఇప్పుడొచ్చిన స‌ర్వే ఫ‌లితాల ప్ర‌కారం చూసుకున్నా జ‌న‌సేన‌కు పెద్ద మొత్తంలోనే ఓట్లు ప‌డే అవ‌కాశ‌ముంద‌ని రాజ‌కీయ విశ్లేష‌కుల అంచ‌నా. మ‌రి అప్ప‌ట్లో అన్న‌కు సాధ్యంకానిది ఇప్పుడు త‌మ్ముడికైనా సాధ్య‌మ‌వుతుందో లేదో!!