బాబు మ‌ళ్లీ బొత్స గాడిలో ప‌డుతున్నారా?

అధికార పార్టీ నాయ‌కులు ఎంత‌మంది ఉన్నా విజ‌య‌న‌గ‌రం జిల్లాలో ప్ర‌తిప‌క్షానికి చెందిన బొత్స స‌త్య‌నారాయ‌ణ మాటే చెల్లుబాటు అవుతోంది. విజ‌య‌న‌గ‌రంలో అధికార యంత్రాంగాన్నంతా త‌న చెప్పుచేతల్లో పెట్టుకుని చెల‌రేగుతున్నార‌ట‌. ఈ విష‌యం అధికార పార్టీ నేత‌ల‌కు తెలిసినా.. ఉదాసీన వైఖ‌రితో వ్య‌వ‌హ‌రిస్తున్నార‌ట‌. ఇదే సరైన స‌మ‌యంగా భావించి.. అధికార యంత్రాంగాన్ని చెప్పుచేత‌ల్లో పెట్టుకుని చక్రం తిప్పుతున్నారు. అయితే తాను టీడీపీలో చేరిపోతానని సంకేతాలు ఇస్తూ ఇలా త‌న ప‌నుల‌న్నీ చ‌క్కబెట్టుకుంటున్నార‌ట‌. అయితే గ‌తంలోనూ ఇదే త‌ర‌హాలో బాబును నమ్మించి రివ‌ర్స్ అయిన బొత్స‌ను న‌మ్మాలా వద్దా అని బాబు సందేహ‌ప‌డుతున్నార‌ట‌.

విజయనగరం జిల్లాలో అధికార పార్టీలో వింత ప‌రిస్థితి నెల‌కొంది. అధికారంలోకి వ‌చ్చి మూడేళ్ల‌యినా ఇప్ప‌టికీ అధికారులు ప్ర‌తిప‌క్ష వైసీపీకి చెందిన బొత్స స‌త్య‌నారాయ‌ణ చెప్పుచేతుల్లోనే ఉంటోంద‌ట‌. ఈ జిల్లా నుంచి కేంద్రమంత్రిగా ఉన్న అశోక్‌గజపతిరాజు స్థానికంగా ఉండడం లేదు. శ్రీకాకుళం జిల్లాకు చెందిన మంత్రి మృణాళిని బొత్సపై విజయం సాధించి రాజకీయంగా ఎదిగినప్పటికీ ఆమె కుటుంబ సభ్యులు అవినీతి వల్ల ఆమె కిమ్మ‌న‌డం లేదు. వైసీపీ నుంచి టీడీపీలో చేరిన బొబ్బిలి రాజాలు.. వారి నియోజకవర్గ పరిధి దాటి ముందుకు పోవడం లేదు. ఏడుసార్లు విజయం సాధించిన నారాయణస్వామి నాయుడు వ‌యోభారంతో రాజ‌కీయాల‌కు దూరంగా ఉంటున్నారు.

ఈ పరిస్థితులను అనుకూలంగా మలచుకున్న బొత్స అధికార యంత్రాంగాన్నితన గుప్పెట్లో పెట్టుకుని పనులు చక్కపెట్టుకుంటున్నారు. మాట వినని వారిని బెదిరిస్తున్నారు…మాట విని పనులు చక్కపెట్టేవారికి కానుకలు ఇప్పిస్తున్నారు. మరో రెండేళ్ల తరువాత జగన్‌ ముఖ్యమంత్రి అవడం ఖాయమని, మళ్లీ తాను మంత్రిని అయి చక్రం తిప్పటడం ఖాయమని చెబుతూ అధికారులపై పట్టుసాధిస్తున్నార‌ట‌. బొత్సను ధీటుగా సమర్థంగా ఎదుర్కొనే నాయకులు టీడీపీలో లేకపోవడం ఆ పార్టీని ఇబ్బంది పెడుతోంద‌ట‌.

1999లో కాంగ్రెస్ ఎంపీగా విజయం సాధించినప్పటి నుంచి ఇప్పటి వరకూ బొత్స కోరుకున్నట్లే అన్నీ జ‌రుగుతున్నా య‌ట‌. అప్పట్లో టీడీపీలో చేరతానని నమ్మబలికి పనులు చక్కపెట్టుకున్నారు. త‌ర్వాత హ్యాండ్ ఇచ్చారు. ఇప్పుడు కూడా ఇదే ర‌క‌మైన సంకేతాలు ఇస్తూ.. ప‌నులు చ‌క్క‌బెట్టుకుంటున్నార‌ట‌. దీంతో టీడీపీ నేత‌లు కూడా పట్టించు కోవ‌డం లేద‌ట‌. ఈ విషయంపై ఆలస్యంగా కళ్లు తెరిచిన చంద్రబాబు తన బద్దశత్రువైన బొత్సను ఏ విధంగా అణగదొక్కాలనే దానిపై ఆలోచన చేస్తున్నారట. కానీ.. ఏం చేయాలో తెలియ‌క స‌త‌మ‌త‌మ‌వుతున్నార‌ట‌. మ‌రి ఒక‌సారి మోస‌పోయిన బాబు.. మ‌ళ్లీ బొత్స చేతిలో మోస‌పోతారో లేదా తెలివిగా వ్య‌వ‌హ‌రిస్తారో చూడాలి!!