2019 ఎన్నిక‌ల‌పై బాబు-జ‌గ‌న్‌ల ప‌గ‌టిక‌ల‌లు!

ఏపీలో ఎల‌క్ష‌న్స్‌కి క‌నీసం ఎంత‌లేద‌న్నా మ‌రో రెండేళ్ల స‌మ‌యం ఉంది. అయినా కూడా అటు అధికార, ఇటు ఏకైక విప‌క్ష పార్టీలు మాత్రం అప్పుడే ఎన్నిక‌లు వ‌చ్చేసిన‌ట్టు.. తామే అధికారంలోకి వ‌చ్చేసే ఛాన్స్ ఉన్న‌ట్టు పెద్ద ఎత్తున క‌ల‌రింగ్ ఇస్తున్నాయి. దీంతో మామూలు జ‌నానికి పిచ్చి ప‌డుతోంది. విష‌యం ఏంటంటే.. 2014 ఎన్నిక‌లు పూర్త‌యి ఖ‌చ్చితంగా రెండున్న‌రేళ్లు. మ‌రో ఐదేళ్ల‌కు అంటే 2019 ఎన్నిక‌లకు రెండున్న‌రేళ్ల స‌మ‌యం ఉంది. అయితే, ఇటీవ‌ల కాలంలో టీడీపీ అధినేత చంద్ర‌బాబు, వైకాపా అధినేత జ‌గ‌న్‌లు స‌ర్వేల‌తో జ‌నాల మెద‌ళ్లు తింటున్నారు.

వాస్త‌వానికి దాదాపు ప‌దేళ్ల నిరీక్ష‌ణ అనంత‌రం ల‌క్కీగా చంద్ర‌బాబుకి ఏపీలో అధికార పీఠం ద‌క్కింది. దీంతో ఆయ‌న త‌న స్టైల్లో పాల‌న సాగించేస్తున్నారు. అయితే, రాష్ట్ర విభ‌జ‌న‌తో ఏపీలో అధికారం త‌న‌దేన‌ని, తాను సీఎం అయిపోవ‌డం ఖాయ‌మ‌ని భావించిన విప‌క్ష వైకాపా అధినేత‌ అదే రేంజ్‌లో అప్ప‌ట్లో ఎన్నిక‌ల హామీలు కూడా గుప్పించారు. ఫ‌స్ట్ సంత‌కం, రెండో సంత‌కం, మూడో సంత‌కం అంటూ పెద్ద ఎత్తున సొంత ప‌త్రిక సాక్షిలో ప్ర‌చారం చేసుకున్నారు. అయితే, అనూహ్యంగా ఆ ఎన్నిక‌ల్లో వైకాపాకి ఎదురు దెబ్బ‌త‌గిలింది. ఈ షాక్ నుంచి జ‌గ‌న్ ఇంకా కోలుకోలేదు.

ఈ నేప‌థ్యంలో ద‌క్క‌క ద‌క్కిన అధికారాన్ని మ‌రో రెండు ట‌ర్మ్‌లు కంటిన్యూ చేసుకోవాల‌ని… అంటే.. 2019, 2024లోనూ తానే ఏపీ సీఎంగా ఉండాల‌ని భావిస్తున్నారు సీఎం చంద్ర‌బాబు. ఇదే విష‌యాన్ని మొన్నామ‌ధ్య ఢిల్లీలో జ‌రిగిన ఓ కార్య‌క్ర‌మంలోనూ ఆయ‌న వెల్ల‌డించారు. ఏపీలో జ‌రుగుతున్న అభివృద్ధి ఆగిపోకూడ‌దంటే.. తానే మ‌ళ్లీమ‌ళ్లీ సీఎంగా ఎన్నిక కావాల్సిన అవ‌స‌రాన్ని ప్ర‌జ‌లు గుర్తించార‌ని కూడా చెప్పారు. ఇక‌, కొద్దిపాటి తేడాతో అధికారం కోల్పోయిన జ‌గ‌న్‌.. మాత్రం 2019లో ఎట్టి ప‌రిస్థితిలోనూ అధికారంలోకి వచ్చి తీరాల‌ని గ‌ట్టిగా నిర్ణ‌యించారు. ఈ నేప‌థ్యంలో ఇద్ద‌రు నేత‌లూ ఏ నెల‌కానెల స‌ర్వేలు చేయించుకుని ఇప్ప‌టికిప్పుడు ఎన్నిక‌లొస్తే.. అంటూ.. స‌ర్వే ఫ‌లితాల‌తో రెచ్చిపోతున్నారు.

తాజాగా పైకి చంద్ర‌బాబు కోడ‌లు బ్రాహ్మ‌ణి చేయించింద‌ని చెబుతున్న స‌ర్వే ఒక‌టి.. జ‌గ‌న్‌కు అనుకూలంగా ఫ‌లితాలు విడుద‌ల చేసింది. బీజేపీ+టీడీపీ+జ‌న‌సేన‌లు విరుచుకుప‌డినా కూడా ఇప్పుడున్న ప‌రిస్థితిలో జ‌గ‌న్‌కి 97 సీట్లు ఖాయ‌మ‌ని ఆ స‌ర్వే వెల్ల‌డించింది. ఇది పైకి టీడీపీకి నెగిటివ్‌గా క‌నిపిస్తున్నా త‌మ క్యాడ‌ర్‌ను ఎలెర్ట్ చేయ‌డంతో పాటు, వైకాపాను న‌మ్మించి దెబ్బేసేందుకే ఈ రిజ‌ల్ట్ ఇచ్చారా అన్న సందేహాలు కూడా వ్య‌క్త‌మ‌వుతున్నాయి. ఇక‌, మొన్నామ‌ధ్య బాబు అనుకూల ప‌త్రిక ఒక‌టి నిర్వ‌హించిన స‌ర్వేలో టీడీపీకి ఏకంగా 130 సీట్లు వ‌స్తాయ‌ని తేలింది. ఇక చంద్ర‌బాబు అయితే 175 సీట్లకు 175 సీట్లు త‌మ‌వే అంటున్నారు. ఇక వైకాపా అధినేత జ‌గ‌న్ చేయించుకుంటున్న స‌ర్వేల్లో ఆ పార్టీకి 100 సీట్లు వ‌స్తాయ‌ని తేలింద‌ట‌.

కానీ, ఇదంతా చూస్తున్న సాధార‌ణ జ‌నాలు మాత్రం ఇరుప‌క్షాల మీదా ఆగ్ర‌హం వ్య‌క్తం చేస్తున్నారు. ఏమిటీ స‌ర్వేలు? అని తీవ్రంగా ఫైర‌వుతున్నారు. నిజానికి ఇరు ప‌క్షాలూ ఆశించిన మేర‌కు ప‌నిచేయ‌డం లేద‌ని అంటున్నారు. సంక్షేమ ప‌థ‌కాల‌ను అమలు చేయ‌డంలో చూపిస్తున్న శ్ర‌ద్ధ‌.. రాష్ట్ర అభివృద్ది విష‌యంలో బాబు మాట‌ల‌కే ప‌రిమితం అవుతున్నార‌ని జ‌నాలు అంటున్నారు. ఇక‌, విప‌క్షంగా అంద‌రినీ క‌లుపుకొని పోవాల్సిన జ‌గ‌న్‌.. అలా కాకుండా కేవ‌లం ఎన్నిక‌లను దృష్టిలో ఉంచుకునే కార్యాచ‌ర‌ణ‌కు పిలుపునివ్వ‌డం కూడా స‌హేతుకం కాద‌ని అంటున్నారు. దీనిని బ‌ట్టి ఇద్ద‌రు నేత‌లూ త‌మ పంథాలు మార్చుకుంటే మంచి ద‌ని విశ్లేష‌కులు సూచిస్తున్నారు.