టీడీపీ నేత‌ల ఫైటింగ్‌కు కారణం

ఏపీ అధికార పార్టీ నేత‌ల్లో అవినీతి ఏ రేంజ్‌కి చేరుకుందో చెప్ప‌డానికి గుంటూరు ఘ‌ట‌న ఉదాహ‌ర‌ణగా మారింది. గుంటూరుకు మంత్రి రావెల కిశోర్‌బాబు, జెడ్‌పీ చైర్‌ప‌ర్స‌న్‌ జానీమూన్‌ల మ‌ధ్య వివాదం మీడియా సాక్షిగా ర‌చ్చ‌కెక్కిన విష‌యం తెలిసిందే. వీరిద్ద‌రి క‌థ‌నంపై రోజుకో వార్త హ‌ల్ చ‌ల్ చేస్తోంది. జెడ్‌పీ చైర్‌ప‌ర్స‌న్ ప‌ద‌విని ఒప్పందంలో భాగంగా పృథ్వీల‌త‌కు అప్ప‌గించాల్సిన స‌మ‌యం వ‌చ్చింది. అయితే, అలా అప్ప‌గించ‌బోన‌ని జానీ మూన్ భీష్మించ‌డంతో వివాదం ర‌చ్చ‌కెక్కింది. ఈ క్ర‌మంలో పృథ్వీల‌త త‌ర‌ఫున మంత్రి రావెల జోక్యం చేసుకోవ‌డంతో నేరుగా రంగంలోకి దిగిన జానీమూన్ మంత్రి అని కూడా చూడ‌కుండా రెచ్చిపోయిన సంగ‌తి తెలిసిందే.

ఇక‌, ఇప్పుడు ఇదే గొడ‌వ‌కు సంబంధించి మ‌రో కోణం వెలుగు చూసింది. జెడ్‌పీ చైర్‌ప‌ర్స‌న్‌ ఆమెకు, మంత్రిగా ఆయ‌న‌కు మ‌ధ్య క‌మీష‌న్లు, కాంట్రాక్టుల పంప‌కాల్లో వ‌చ్చిన తేడాల వ‌ల్లే ఘ‌ర్ష‌ణకు దారితీసింద‌ని తెలుస్తోంది. ఈ ఇద్ద‌రు నేత‌ల మ‌ధ్య ఘ‌ర్ష‌ణ నేప‌థ్యంలో సీఎం చంద్ర‌బాబు డిప్యూటీ సీఎం రాజ‌ప్ప నేతృత్వంలో సీనియర్ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి, జిల్లా టీడీపీ అధ్యక్షుడు జివి ఆంజనేయులుతో ఓ త్రిస‌భ్య క‌మిటీ వేశారు. ఈ క‌మిటీ ఇరు ప‌క్షాల వాద‌న‌లు వినేందుకు సిద్ధ‌మైంది.

ఈ క్ర‌మంలో క‌మిటీ ముందుకొచ్చిన జానీమూన్‌.. రావెల దందాల‌ను ఒక్కొక్క‌టిగా బ‌య‌ట పెట్టింద‌ని తెలిసింది. తాను జెడ్‌పీ చైర్‌ప‌ర్స‌న్‌గా ఉన్న‌ప్ప‌టికీ.. ఎంత మాత్ర‌మూ విలువ ఇవ్వ‌డం లేద‌ని, అధికారిక కార్య‌క్ర‌మాల్లో ప్రోటోకాల్ సైతం పాటించ‌డం లేద‌ని ఆమె త‌న ఆవేద‌న‌ను క‌మిటీ ముందు వ్య‌క్తం చేసింది. అంతేకాదు, కొన్ని సీసీ రోడ్ల నిర్మాణంలో అడ్డగోలుగా కాంట్రాక్టులు అప్పగించి కమీషన్లు దండుకుంటున్నారని కూడా జానీమూన్ ఈ కమిటీకి ఫిర్యాదు చేసినట్లు స‌మ‌చారం.

అంటే, రావెల ఒక్క‌డే ఏక‌ప‌క్షంగా క‌మీష‌న్లు దండుకుంటున్నార‌ని ఆమె ఆరోపిస్తోన్న దృష్ట్యా…. జెడ్‌పీ చైర్‌ప‌ర్స‌న్‌గా త‌న వాటా ద‌క్క‌డం లేద‌నే ఆమె ఇలా మీడియా ముందుకు వ‌చ్చిందా ? అని పార్టీలో కొంద‌రు ఆమెపై విమ‌ర్శ‌లు చేస్తున్నారు. ఈ క్ర‌మంలోనే ఇరువురి మ‌ధ్యా వివాదం రేగింద‌ని అంటున్నారు. మొత్తానికి ఈ నేత‌ల మ‌ధ్య వివాదం ఇప్పుడు ఇలా మ‌రో ట‌ర్నింగ్ తీసుకునే స‌రికి.. అంద‌రూ ఆశ్చ‌ర్య పోతున్నారు. మ‌రి రాజ‌ప్ప‌ క‌మిటీ దీనిని ఎలా ప‌రిష్క‌రిస్తుందో చూడాలి.