కేసీఆర్ నుంచి మ‌రో పేప‌ర్‌..!

తెలంగాణ సీఎం కేసీఆర్ తెలంగాణ‌లో పాల‌నా ప‌రంగాను, పార్టీ ప‌రంగాను దూసుకుపోతున్నారు. కేసీఆర్ స్పీడ్‌కు ఎప్పుడు బ్రేకులు ప‌డ‌తాయో కూడా ఎవ్వ‌రికి అర్థం కావ‌డం లేదు. తెలంగాణ కేసీఆర్ హవా ఆ రేంజ్‌లో ఉంది మ‌రి. ఇక మీడియా ప‌రంగాను కేసీఆర్ వ్యూహాలు ఎవ్వ‌రికి అంతుప‌ట్ట‌డం లేదు. తెలంగాణ ఉద్య‌మంలో మీడియా పోషించిన పాత్ర అంతా ఇంతా కాదు. ఆ విష‌యం కేసీఆర్‌కు కూడా తెలుసు. ఈ క్ర‌మంలోనే ఇప్పుడు ప్ర‌భుత్వ సంక్షేమ కార్య‌క్ర‌మాలు ప్ర‌జ‌ల్లోకి మ‌రింత చొచ్చుకుపోయేలా కేసీఆర్ మీడియాకు ప్ర‌యారిటీ ఇస్తున్నారు.

ఇందుకోసం బ‌య‌ట మీడియాను న‌మ్ముకోవ‌డం కంటే సొంత మీడియానే న‌మ్ముకుంటే బెట‌ర్ అని కేసీఆర్ గ‌ట్టిగా డిసైడ్ అయిన‌ట్టు తాజా ప‌రిణామాలు స్ప‌ష్టం చేస్తున్నాయి. కేసీఆర్‌, టీఆర్ఎస్‌కు ఇప్ప‌టికే న‌మ‌స్తే తెలంగాణ పేప‌ర్‌తో పాటు టీ న్యూస్ ఛానెల్ కూడా ఉంది. న‌మ‌స్తే తెలంగాణ ద్వారా అటు ప్రింట్ మీడియాలోను, టీ న్యూస్ ఛానెల్ ద్వారా ఇటు ఎల‌క్ట్రానిక్ మీడియాలోను కేసీఆర్‌, టీఆర్ఎస్ కార్య‌క్ర‌మాల‌కు విస్తృత క‌వ‌రేజ్ ల‌భిస్తోంది.

ఇక హైద‌రాబాద్‌తో పాటు తెలంగాణ‌లో ఉన్న నార్త్ ఇండియ‌న్ ప్ర‌జ‌ల‌తో పాటు ఇంగ్లీష్ పాఠ‌కుల‌ను టార్గెట్ చేసిన కేసీఆర్ అందుకోసం ఓ ఆంగ్ల దిన‌ప‌త్రిక‌ను కూడా స్టార్ట్ చేయ‌గా..ఇది ప‌ని కూడా ప్రారంభించింది. ఇక ఇప్పుడు ఊర్దూ పాఠ‌కుల‌పై కూడా కేసీఆర్ దృష్టి సారించిన‌ట్టు తెలుస్తోంది. తెలంగాణ‌లో ముస్లింల ఓటు బ్యాంక్ చాలా ఎక్కువుగా ఉంది. హైద‌రాబాద్ న‌గ‌రంతో పాటు ప్ర‌ధాన న‌గ‌రాల్లో వీరి ప్రాబ‌ల్యం ఎక్కువ‌.

చాలా నియోజ‌క‌వ‌ర్గాల్లో వీరు గెలుపు ఓట‌ముల‌ను ప్రభావితం చేసే స్థాయిలో ఉన్నారు. వీరిని ఎట్రాక్ట్ చేసే క్ర‌మంలోనే కేసీఆర్ ఓ ఊర్దు పేప‌ర్‌ను ప్రారంభిస్తున్న‌ట్టు తెలుస్తోంది. అజాద్‌ తెలంగాణ పేరుతో ఈ పేప‌ర్ స్టార్ట్ కానుంద‌ట‌. ఇందుకోసం గ‌తంలో సియాస‌త్ – ఇత్తేమాద్ ప‌త్రిక‌ల‌లో ప‌నిచేసిన ఓ సీనియ‌ర్ జ‌ర్న‌లిస్టును ఎడిట‌ర్‌గా అపాయింట్ చేసిన‌ట్టు కూడా టాక్ వ‌స్తోంది. ఏదేమైనా తెలంగాణ‌లో అన్ని భాషల పాఠ‌కుల‌ను కేసీఆర్ టార్గెట్‌గా చేసుకుని ప‌త్రిక‌లు స్థాపిస్తుండ‌డం ఇప్పుడు అక్క‌డ రాజ‌కీయంగా పెద్ద చ‌ర్చ‌కు దారితీస్తోంది.