బ‌లిజ‌లు కొత్త ఉద్య‌మం.. ముద్ర‌గ‌డ‌కు రాం రాం!

బీసీ రిజ‌ర్వేష‌న్ డిమాండ్ చేస్తూ.. రాష్ట్రంలో ఉవ్వెత్తున సాగిన కాపు ఉద్య‌మంలో చీలిక‌లు మొద‌ల‌య్యాయా? ఆధిప‌త్య పోరుకు కాపు ఉద్య‌మం ప‌రాకాష్ట‌గా మారుతోందా? ముద్ర‌గ‌డ నాయ‌క‌త్వంపై తిరుగుబాటు వ‌స్తోందా? అంటే తాజా ప‌రిణామాలు ఔన‌నే అంటున్నాయి. రాష్ట్రంలోని వేర్వేరు ప్రాంతాల్లోని కాపుల‌ను వేర్వేరు పేర్ల‌తో పిలుస్తుండ‌డం తెలిసిందే. ఇలాంటిదే బ‌లిజ కూడా! ఇది కూడా కాపు వ‌ర్గ‌మే. అయితే, కోస్తాలో క‌న్నావీరి సంఖ్య సీమ జిల్లాల్లో అత్య‌ధికం. అయితే, ప్ర‌భుత్వంపై పోరు చేయ‌డంలో మాత్రం కాపుల‌తోనే క‌లిసి వీరు ముద్ర‌గ‌డ నేతృత్వంలో చంద్ర‌బాబుపై ఫైర‌వుతున్నారు.

కానీ, ఇప్పుడు ఈ బ‌లిజ‌లు తాము వేర‌ని కొత్త గ‌ళం విప్పుతున్నారు. కాపులు త‌మ‌ను తొక్కేస్తున్నార‌ని అంటున్నారు. వాస్త‌వానికి సంఖ్యాప‌రంగా భారీగా ఉన్న త‌మ‌ను అడ్డుప‌ట్టుకుని కాపులు ల‌బ్ధి పొందాల‌ని భావిస్తున్నార‌ని బ‌లిజ నేత‌లు స‌రికొత్త విమ‌ర్శ‌ల‌కు ప‌దును పెట్టారు. అంతేకాదు, ముద్ర‌గడ నాయ‌క‌త్వంలో తాము క‌లిసి ప‌నిచేసేది లేద‌ని కూడా కుండ‌బ‌ద్ద‌లు కొట్ట‌డం గ‌మ‌నార్హం. ఈ నేప‌థ్యంలో గ‌ళం విప్పిన బలిజ యునైటెడ్ ఫ్రంట్ కన్వీనర్, టీటీడీ బోర్డు మాజీ సభ్యుడు ఓవీ రమణ ప‌రోక్షంగా ముద్ర‌గ‌డ నాయ‌క‌త్వాన్ని ఒప్పుకునేది లేద‌ని చెప్పారు. అంతేకాదు, బ‌లిజ‌లను ముద్ర‌గ‌డ వాడుకుని వ‌దిలే టైపులో ఉన్నార‌ని ఆయ‌న ఆరోపించ‌డం సంచ‌ల‌నంగా మారింది.

‘మాకు కాపులతో కలిసి ఉద్యమించినందున వచ్చే లాభమేమీ లేదు. మేం బ్రిటీషుకాలం నుంచే బీసీల్లో ఉన్నాం. ఇంకా వారికే ఆ సౌకర్యం లేదు. మూడు జిల్లాల్లో ఉన్నవాళ్లే ఉద్యమిస్తుండగా లేనిది 6 జిల్లాల్లో బలంగా ఉన్న మేమెందుకు సొంతంగా ఉద్యమించకూడదు? అందుకే మేం దీనిపై జిల్లాల్లో పర్యటించి బలిజల్లో చైతన్యం తెస్తాం. బలిజలు చాలామంది ఇంకా కాపు నాయకత్వంపై భ్రమల్లో ఉన్నారు. మాకు 5 జిల్లాల్లో ఇప్పటికీ రాజకీయ ప్రాతినిధ్యం లేకపోయినా ఏ ఒక్క కాపు నేత కూడా మాట్లాడలేదు. ఇకపై కాపులు వేరు బలిజలు వేరు. ఎవరి ఉద్యమాలు వారివి’ అని వెల్లడించారు. దీంతో ఇప్పుడు కాపు ఉద్య‌మం కొత్త రూపు సంత‌రించుకుని ముద్ర‌గ‌డ వ‌ర్సెస్ బ‌లిజ‌గా మార‌నుందా? అనే సందేహాలు వెల్లువెత్తుతున్నాయి.