ఏపీలో న్యూ పాలిటిక్స్‌: బీజేపీ టూ వైకాపా

బీజేపీ విజ‌య‌వాడ నేత‌, మాజీ ఎమ్మెల్యే వెల్లంపల్లి శ్రీనివాస్ క‌మ‌ల ద‌ళం నుంచి బ‌య‌ట‌కు జంప్ చేశారు. ఆయ‌న త‌న రాజీనామా ప‌త్రాన్ని బీజేపీ కార్యాల‌యానికి ఫ్యాక్స్ ద్వారా పంపించారు. ఈ ప‌రిణామం విజ‌య‌వాడ ప‌శ్చిమ నియోజ‌క‌వ‌ర్గంలో పూర్తిస్థాయిలో ప‌ట్టు సాధిస్తున్న క్ర‌మంలో బీజేపీకి పెద్ద ఎదురు దెబ్బ‌త‌గిలిన‌ట్టే చెప్పొచ్చు. వాస్త‌వానికి వెల్లంపల్లి ప్ర‌జారాజ్యం పార్టీతో పొలిటిక‌ల్ అరంగేట్రం చేశాడు. అప్ప‌టి ఎన్నిక‌ల్లో విజ‌య‌వాడ ప‌శ్చిమ నియోజ‌క‌వ‌ర్గం నుంచి గెలుపొందాడు.

అయితే, చిరు త‌న పార్టీని కాంగ్రెస్‌లో క‌లిపేయ‌డంతో వెల్లంప‌ల్లి కూడా కాంగ్రెస్‌లో కొన‌సాగాడు. ఇక‌, 2014 నాటి విభ‌జ‌న దెబ్బ‌కి ఏపీలో కాంగ్రెస్ అడ్ర‌స్ గ‌ల్లంత‌వ‌డంతో వెల్లంప‌ల్లి బీజేపీ పంచ‌న చేరిపోయారు. అయితే, గ‌త కొన్నాళ్లుగా ఆయ‌న‌కు ఆశించిన మైలేజీ క‌నిపించ‌క‌పోవ‌డంతో రాజీనామా చేసిన‌ట్టు తెలుస్తోంది. ఇక‌, ఆయ‌న త‌న రాజ‌కీయ ప్ర‌స్థానాన్ని వైకాపాలో కొన‌సాగిస్తార‌నే టాక్ వినిపిస్తోంది. ఇప్ప‌టికే దీనికి సంబంధించిన అన్ని కార్య‌క్ర‌మాలూ పూర్త‌య్యాయ‌య‌ని జ‌గ‌న్ పంచ‌న చేర‌డం ఖ‌రారైంద‌ని తెలుస్తోంది.

నిజానికి రాష్ట్రంలో టీడీపీ-బీజేపీ కూట‌మి కొన‌సాగుతోంది కాబ‌ట్టి త‌న‌కు ఏదో ఒక నామినేటెడ్ ప‌ద‌వి వ‌స్తుంద‌ని వెల్లంప‌ల్లి ఆశించిన‌ట్టు స‌మాచారం. అయితే, ఇప్పుడున్న ప‌రిస్థితిలో బీజేపీ హేమాహేమీల‌కు కూడా ప‌ద‌వులు ద‌క్కే ఛాన్స్ క‌నిపించ‌డం లేదు. మ‌రోప‌క్క‌, ప‌శ్చిమ నియోజ‌క‌వ‌ర్గం నుంచి వ‌చ్చే ద‌ఫా 2019 ఎన్నిక‌ల్లో అయినా టికెట్ ల‌భిస్తుందా? అంటే అదికూడా అనుమానంగానే ఉంది. దీంతో ముందుజాగ్ర‌త్త‌గానే వెల్లంప‌ల్లి బీజేపీకి రాం రాం చెప్పాడ‌నే టాక్ వినిపిస్తోంది. ఇక‌, త్వ‌ర‌లోనే జ‌గ‌న్ జెండా మోసేందుకు వెల్లంప‌ల్లి రెడీ అయిపోయాడ‌న్న‌మాట‌.

ఇక ఇక్క‌డ గ‌త ఎన్నిక‌ల్లో వైకాపా త‌ర‌పున పోటీ చేసిన జ‌లీల్‌ఖాన్ వెల్లంప‌ల్లి మీద గెలిచి ఎమ్మెల్యే అయ్యాడు. అయితే త‌ర్వాత జ‌లీల్‌ఖాన్ టీడీపీలో చేరిపోయాడు. దీంతో వెల్లంప‌ల్లి వ‌చ్చే ఎన్నిక‌ల్లో ఇక్క‌డి నుంచి వైకాపా త‌ర‌పున పోటీ చేసేందుకు రెడీ అవుతున్నాడ‌ని కూడా స‌మాచారం.