ఏపీ జ‌ల‌య‌జ్ఞంలో ఆ ఇద్ద‌రికి వాటాలు..!

ఉమ్మ‌డి ఏపీలో జ‌ల‌య‌జ్ఞం పేరిట వైఎస్ సాగించిన ప్రాజెక్టుల నిర్మాణాల‌ను ధ‌న‌య‌జ్ఞంగా పేర్కొన్న అప్ప‌టి విప‌క్ష టీడీపీ నేత‌, ఇప్పుడు ఏపీ సీఎం చంద్ర‌బాబు.. ఆయ‌న మంత్రి వ‌ర్గ స‌హ‌చ‌రుడు, జ‌ల‌వ‌న‌రుల మంత్రి దేవినేని ఉమాలు కూడా ఆ ధ‌న‌య‌జ్ఞం బాట‌నే ప‌డుతున్నారా? ప‌్ర‌స్తుతం రాష్ట్రంలో విస్తృతంగా సాగుతున్న జ‌ల ప్రాజెక్టుల నుంచి వారు కూడా ముడుపులు అందుకుంటున్నారా? అప్ప‌ట్లో వైఎస్‌పై నిప్పులు చెరిగిన నేత‌లు.. ఇప్పుడు అవే త‌ప్పులు చేస్తున్నారా? అంటే ఔన‌నే స‌మాధాన‌మే వ‌స్తోంద‌ని అంటున్నారు విశ్లేషకులు! మ‌ర‌ది ఎంత‌వ‌ర‌కు నిజ‌మో తెలీదుకానీ.. విష‌యంలోకి వెళ్లిపోదాం..

ఏ ప్ర‌భుత్వానికైనా పేరు తెచ్చేది.. త‌దుప‌రి ఎన్నిక‌ల్లో ఓట్లు రాల్చేదీ నీరే!! అందుకే ప్ర‌తి ప్ర‌భుత్వమూ రాష్ట్రంలో సాగునీటి ప్రాజెక్టుల‌పై దృష్టి పెడుతుంది. ఆయా ప్రాజెక్టుల‌పై నిజంగా ఎంత ప్రేమ ఉంద‌నేది ప‌క్క‌న‌పెడితే.. ప్రాజెక్టుల శంకుస్థాప‌న వంటివి భారీగానే చేప‌ట్ట‌డం, ఒప్పందాలు చేసుకోవ‌డం వంటివి స‌హ‌జం. ఇక వైఎస్ హ‌యాంలో ప్రాజెక్టుల పేరుతో కాల్వ‌లు త‌వ్వి పెద్ద ఎత్తున ధ‌న‌య‌జ్ఞం చేశార‌ని బాబు, దేవినేని ప‌లుమార్లు ఆరోపించారు. తాము అధికారంలోకి వ‌స్తే.. అంద‌రి తాటా తీస్తామ‌ని కూడా అన్నారు.

ఇప్పుడు అధికారంలోనే ఉన్నారు. అయినా.. ఏ ఒక్క‌రి తాటా తీయ‌క‌పోవ‌డ‌మే వారిపై ప‌లు అనుమానాల‌కు ఆస్కారం ఇస్తోంది. అంతేకాదు, ప‌ట్టిసీమ‌, గాలేరు-న‌గ‌రి, హంద్రీ-నీవా, పోల‌వ‌రం వంటి వాటిని చంద్ర‌బాబు ప్ర‌తిష్టాత్మ‌కంగా తీసుకున్నారు. ప‌ట్టిసీమ‌ను విప‌క్షాలు వ్య‌తిరేకించినా నిర్మించారు. వాస్త‌వానికి అది తాత్కాలిక ప్రాజెక్టు దానికే భారీ ఎత్తున ఖ‌ర్చు చేశారు. దీంతో ఇప్పుడు ఈ ఇద్ద‌రు నేత‌ల‌పై అనుమానాలు వ్య‌క్తమ‌వుతున్నాయి. అప్పుడు వైఎస్ చేశారు..ఇఫ్పుడు తాము చేస్తున్నాం కాబట్టి చెల్లుకు చెల్లు అన్న రీతిలో వైఎస్ హయాంలో జరిగిన పాత స్కాంలు అన్నింటిని టీడీపీ వదిలేసిందా?.

మరి ఇంత వరకూ ఒక్కదానిపై కూడా చర్య తీసుకోలేదు అంటే ఇదే అనుమానం వ్యక్తం అవుతోంది. ప్రతిపక్షంలో ఉండగా నానా యాగీ చేసి…అవినీతి జరిగిందని కాగ్ లాంటి సంస్థ నిగ్గుతేల్చిన తర్వాత కూడా ప్రభుత్వం ప్రకటించిన శ్వేతపత్రంలో ఎక్కడా అవినీతి విమర్శలు చేయకుండా మౌనం దాల్చారు.  సో.. ఇప్పుడు జ‌రుగుతున్నది కూడా ధ‌న‌య‌జ్ఞ‌మేన‌నే విమ‌ర్శ‌లు వ‌స్తున్నాయి. మ‌రి ఇది ఎంత వ‌ర‌కు నిజ‌మో.. కాగ్ నివేదిక వ‌చ్చేదాకా.. ర‌హ‌స్య‌మే!!