ప‌వ‌న్‌పై చంద్ర‌బాబు మైండ్ గేమ్ స్టార్ట్‌

ఏదైనా కుక్క‌ని చంపించాలంటే.. దానికి పిచ్చికుక్క అని ముద్ర‌వేస్తే స‌రిపోతుంది.. జ‌నాలే దానిని చంపేస్తారు! అని ఓ మాట ప్ర‌చారంలో ఉంది. ఇప్పుడు ఈ మాట ఎందుకంటే.. ఏపీ సీఎం చంద్ర‌బాబు.. జ‌న‌సేనాని విష‌యంలో డిటో ఈ ఫార్ములానే వాడుకుంటున్నారు. త‌న‌దైన స్టైల్లో దూసుకుపోతూ.. 2014లో పార్టీ పెట్టినా మౌనంగా ఉండి.. అధ్య‌య‌నం-ప్ర‌శ్నించ‌డం-పోరాటం స్టైల్‌ను ఎంచుకున్న జ‌న‌సేనాని ప‌వ‌న్‌కి ప్ర‌జ‌ల్లో ఆద‌ర‌ణ పెరుగుతోంది. దీనికి రాజ‌ధాని రైతులు, విద్యార్థులు, భీమ‌వ‌రం ఆక్వా బాధిత రైతు కుటుంబాలు, ఏపీ జ‌ర్న‌లిస్టులే ఉదాహ‌ర‌ణ‌. వీరంతా బాబు ప్ర‌భుత్వంతో వ‌స్తున్న త‌ల‌నొప్పుల‌ను ప‌వ‌న్‌కి ఏక‌రువు పెట్టుకున్నారు.

ఈ ప‌రిణామం రాజ‌కీయంగా ప‌వ‌న్‌కి ఉన్న ఇమేజ్‌ని బ‌య‌ట‌పెడుతోంది. అయితే, ఈ ఇమేజ్ రానున్న కాలంలో మ‌రింతగా పెరిగే అవ‌కాశం ఉంది. దీనిని గ‌మ‌నించిన టీడీపీ సార‌ధి, సీఎం చంద్ర‌బాబు.. ఎలాగైనా అడ్డుక‌ట్ట వేయాల‌ని, ప్ర‌జ‌ల్లో ప‌వ‌న్‌కి ఇమేజ్ లేద‌ని చెప్పాల‌ని ప‌క్కాప్లాన్ వేశారు. దీనిని ఆయ‌న అనుకూల ప‌త్రిక ఆంధ్ర‌జ్యోతి.. స‌ర్వే పేరుతో వండి వార్చేసింది. బాబు ప్ర‌భుత్వం  రెండున్న‌రేళ్ల కాలం పూర్తి చేసుకున్న నేప‌థ్యంలో ఏపీలో జ‌న‌నాడి ఎలా ఉందో?   తెలుసుకునేందుకు అని పేర్కొంటూ పెద్ద ఎత్తున స‌ర్వే చేసిన‌ట్టు తెలిసింది.

ఈ స‌ర్వే ఫ‌లితాలేను సీరియ‌ల్ క‌థ‌నాలుగా కూడా అందించేందుకు రెడీ అయింది. సోమ‌వారం వ‌చ్చిన క‌థ‌నం మేర‌కు సీఎం చంద్ర‌బాబుకే ప్ర‌జ‌లు మ‌రోసారి(2019) ప‌ట్టం క‌డ‌తార‌ని కుండ బ‌ద్ద‌లు కొట్టింది. అదేస‌మ‌యంలో ప‌వ‌న్‌పై ఈ స‌ర్వే నిప్పులు చెరిగింది. ప‌వ‌న్ ప‌క్షాల పురుగు కూడా లేద‌ని పేర్కొంది. ఆయ‌న ఒంట‌రిగా బ‌రిలో దిగితే.. ఒక్క‌సీటు కూడా తెచ్చుకోలేర‌ని వెల్ల‌డింది. అయితే, ప‌వ‌న్ .. బాబుతో జోడీ క‌డితే మాత్రం.. ఫ‌ర్వాలేద‌ని పేర్కొంది. ఎన్నిక‌ల్లో ఒంట‌రిగా దిగే ప‌వ‌న్ పార్టీకి కేవలం 3.86 శాతం ఓట్లు మాత్రమే వస్తాయని తెలిపింది.

అయితే, ఈ స‌ర్వేపై ప‌వ‌న్ అభిమానులు మండి ప‌డుతున్నారు. ప‌వ‌న్ ఎలాగైనా టీడీపీకి షాక్ ఇస్తాడ‌న్న టాక్ ఉందని, కాపులు, కాపు యువ‌త‌, వ‌ప‌న్ అభిమానులు జ‌న‌సేన వైపు మొగ్గు చూపుతార‌ని, కొంద‌రు టీడీపీ మంత్రులు, ఎమ్మెల్యేలు, కాపు ప్ర‌జా ప్ర‌తినిధులు జ‌న‌సేవైపు మొగ్గు చూపుతార‌ని వార్త‌లు వ‌స్తున్న క్ర‌మంలో కేవ‌లం ప‌వ‌న్‌ను తొక్కేందుకు, ప‌వ‌న్‌కు ప్ర‌జా బ‌లం లేద‌ని చెప్పేందుకు బాబు ఆడే గేమ్ అని వారు పెద్ద ఎత్తున విమ‌ర్శిస్తున్నారు.  ప‌వ‌న్‌పై బాబు మైండ్ గేమ్‌లో భాగంగా ఈస‌ర్వే చేయించార‌నే టాక్ వినిపిస్తోంది.  మ‌రి దీనిపై ప‌వ‌న్ రియాక్ష‌న్ ఎలా ఉంటుందో చూడాలి.