ఏపీలో బీజేపీకి బ‌లం లేద‌ని ఫ్రూవ్ అయ్యింది

ఏపీలో టీడీపీ-బీజేపీ కూట‌మి అధికారంలో ఉన్న విష‌యం తెలిసిందే. ఇక‌, కేంద్రంలో బీజేపీ చ‌క్రం తిప్పుతోంది. ఈ క్ర‌మంలో బీజేపీకి ఉన్న బ‌లంపై స‌ర్వ‌త్రా చ‌ర్చ జ‌ర‌గ‌డం సాధార‌ణం. ఇప్పుడు అదే చ‌ర్చ ఏపీలోనూ సాగుతోంది. దీనికి కార‌ణంగా నిన్నగాక మొన్న శ‌నివారం బీజేపీ జాతీయ సార‌ధి అమిత్ షా తాడేప‌ల్లి గూడెంలో పెద్ద ఎత్తున రైతు స‌భ నిర్వ‌హించారు. త‌మ ప్ర‌భుత్వం రైతులకు ఎంత అండ‌గా నిలుస్తోందో ఆయ‌న వివ‌రించారు. అయితే, ఈ స‌భ‌ను అమిత్ షా సహా బీజేపీ అధిష్టానం ప్ర‌తిష్టాత్మ‌కంగా తీసుకుంది.

ప్ర‌స్తుతం టీడీపీతో పొత్తు పెట్టుకున్న‌ప్ప‌టికీ.. రాబోయే రోజుల్లో అవ‌స‌ర‌మైతే.. ఒంట‌రిగా బ‌లం పుంజుకోవాల‌ని ఈ పార్టీ యోచిస్తోంది. ఈ క్ర‌మంలోనే ఈ స‌భ‌ను ప్ర‌తిష్టాత్మ‌కంగా భావించింది. స‌భ‌కు హాజ‌రైన అమిత్ షా కూడా అధికార టీడీపీపై ఎలాంటి విమ‌ర్శ‌లూ చేయ‌కుండా విప‌క్ష వైకాపా.. కాంగ్రెస్‌ల‌పై విరుచుకుప‌డ్డారు. ఇంత వ‌ర‌కు బాగానే ఉన్నా.. అస‌లీ స‌భ‌కు ఎంత మంది రైతులు హాజ‌ర‌య్యార‌నే విష‌యం ఇప్పుడు చ‌ర్చ‌నీయాంశంగా మారింది. నిజానికి రైతు స‌భ కాబ‌ట్టి భారీ సంఖ్య‌లో రైతులు హాజ‌రు అవుతార‌ని అంద‌రూ భావించారు.

కానీ, ఈ స‌భ‌కు కేవలం అంద‌రూ క‌లిపి  15 వేల మంది మాత్ర‌మే వ‌చ్చిన‌ట్టు సాక్షాత్తూ బీజేపీ నేత‌లు చెబుతున్నారు. నిజానికి కేంద్రంలో అధికారంలో ఉన్న పార్టీకి అధ్య‌క్షుడు అయిన అమిత్ షా నిర్వ‌హించిన స‌భ‌కి ఇంత త‌క్కువ సంఖ్య‌లో జ‌నాలు రావ‌డంపై ఇప్పుడు నేత‌లు చ‌ర్చించుకుంటున్నారు. దీనికి కార‌ణం పార్టీలోని అంత‌ర్గ‌త విభేదాలేన‌ని, ఎవ్వ‌రూ క‌లిసి రాలేద‌ని తెలుస్తోంది. నిజానికి రైతు స‌భ నిర్వ‌హించిన తాడేప‌ల్లి గూడెం నుంచి సాక్షాత్తూ మంత్రి మాణిక్యాల‌రావు ప్రాతినిధ్యం వ‌హిస్తున్నారు. ఇక‌, ప‌శ్చిమ‌గోదావ‌రి జిల్లాకి ఎంపీ గోక‌రాజు గంగ‌రాజు.. ఉన్నారు.

ఈ క్ర‌మంలో స‌భ హిట్ట‌వుతుంద‌ని అంద‌రూ అనుకున్నారు. కానీ, అట్ట‌ర్ ఫ్లాప్ అయింద‌ని బీజేపీ నేత‌లే వ్యాఖ్యానిస్తుండ‌డం గ‌మ‌నార్హం. ఈ ప‌రిణామానికి కేవ‌లం రాష్ట్ర పార్టీలో నెల‌కొన్న విభేదాలు, వ‌ర్గ‌పోరే కార‌ణ‌మ‌ని, దీనిపైనే ముందు అధిష్టానం దృష్టి పెట్టాల‌ని నేత‌లు అంటున్నారు. వాస్త‌వానికి 8 నెల‌ల కింద‌ట రాజ‌మండ్రి లో అమిత్ షా తో  నిర్వ‌హించిన బ‌హిరంగ స‌భ సూప‌ర్ హిట్ట‌యింది.

ఆ సభకు ఉభయ గోదావరి జిల్లాలలోని పార్టీ కార్యకర్తలు ఎంతో కష్టపడ్డారు. ఇప్పుడు మాత్రం తాడేప‌ల్లి గూడెం స‌భ‌కు వాళ్లు ఎవ‌రూ స‌హ‌క‌రించ‌లేద‌ని క్లారిటీ వ‌చ్చేసింది. సో..  ఏపీలో బీజేపీకి బ‌లం లేద‌నే వాద‌న‌కు ఈ ప‌రిణామం బ‌లాన్ని ఇచ్చిన‌ట్ట‌యింది అంటున్నారు విశ్లేష‌కులు! మ‌రి దీనికి విరుగుడుగా షా ఎలాంటి చ‌ర్య‌లు చేప‌ట్ట‌నున్నారో వేచి చూడాలి .