వైఎస్‌.వివేకా ఓట‌మికి చంద్ర‌బాబు షాకింగ్ స్కెచ్‌

అవును! వ‌చ్చే ఏడాది జ‌న‌వ‌రి-ఫిబ్ర‌వ‌రి మ‌ధ్య జ‌ర‌గ‌నున్న ఎమ్మెల్సీ ఎన్నిక‌ల్లో క‌డ‌ప స్థానిక సంస్థ‌ల అభ్య‌ర్థిగా వైకాపా త‌ర‌ఫున జ‌గ‌న్ బాబాయి వైఎస్ వివేకానంద రెడ్డి పోటీ చేస్తున్నారు. ఈయ‌న‌కు స్థానికంగా మంచి పేరుంది. దీంతో ఈయ‌న‌ను ఎదుర్కోవాలంటే ఇంతే స్థాయి నేత అవ‌స‌రం. జ‌గ‌న్ ఇలాకా క‌డ‌ప‌లో టీడీపీ పాగా వేసి జ‌గ‌న్ గుండెల్లో రైళ్లు ప‌రిగెట్టించాల‌ని టీడీపీ అధినేత చంద్ర‌బాబు ఎప్ప‌టి నుంచో భావిస్తున్నారు. ముఖ్యంగా 2019 జ‌గ‌న్‌ను త‌న సొంత జిల్లాలోనే మట్టి క‌రిపించాల‌ని నిర్ణ‌యించారు.

ఈ క్ర‌మంలో బాబు త‌న‌కు అందివ‌చ్చిన ప్ర‌తి అవ‌కాశాన్నీ స‌ద్వినియోగం చేసుకుంటున్నారు. ఇప్ప‌టికే త‌న ఆప‌రేష‌న్ ఆక‌ర్ష్ ద్వారా వైకాపా ఎమ్మెల్యేల‌ను సైకిల్ ఎక్కించుకున్నారు. ఇప్పుడు ఎమ్మెల్సీ ఎన్నిక‌ల్లో బ‌రిలో దిగుతున్న వైకాపా అభ్య‌ర్థి వివేక‌కు కూడా చెక్ పెట్టాల‌ని బాబు ప‌క్కా స్కెచ్ వేశారు. దీనిని త‌న విశ్వ‌స‌నీయ అనుచ‌రుడు, ఎంపీ సీఎం ర‌మేష్‌తో ఈ ప్లాన్‌ను అమ‌ల్లో కూడా పెట్టేశారు. క‌డ‌ప‌లో మంచి పేరున్న కాంగ్రెస్‌, వైకాపాల మాజీ నేత ఎంవీ మైసూరా రెడ్డిని మ‌చ్చిక చేసుకుంటున్నారు.

వాస్త‌వానికి మైసూరా.. వైకాపాకి రిజైన్ చేసిన త‌ర్వాత టీడీపీ తీర్థం పుచ్చుకుని బాబు చెంత‌కు చేరిపోతార‌ని అంద‌రూ అనుకున్నారు. కానీ, అలా జ‌ర‌గ‌లేదు. అయితే ఇప్పుడు బాబు మాత్రం వివేక‌ను ఓడించేందుకు మైసూరాను త‌మ పార్టీలో చేర్చుకునేందుకు రెడీ అయిన‌ట్టు తెలుస్తోంది. ఇందుకోసం ఆయ‌న‌కు త‌గిన ప్రాధాన్యం ఇస్తామ‌ని కూడా హామీ ఇచ్చిన‌ట్టు తెలుస్తోంది. ఆదివారం క‌డ‌ప‌లో సీఎం ర‌మేష్‌.. మైసూరాతో ప్ర‌త్యేకంగా భేటీ అయ్యారు. ఈ సంద‌ర్భంగా ఆయ‌న సీఎం చంద్ర‌బాబు ప్లాన్‌ను మైసూరాకు తెలిపార‌ని స‌మాచారం.

అనుకున్న‌ది అనుకున్న‌ట్టు జ‌రిగితే.. వివేకా ఓడిపోవ‌డం, జ‌గన్‌కి కుడి భుజం వంటి క‌డ‌ప‌లో టీడీపీ సైకిల్ రివ్వున దూసుకోవ‌డం అన్నీ జ‌రుగుతాయ‌ని సీఎం ర‌మేష్.. మైసూరాకి వివ‌రించిన‌ట్టు తెలిసింది. మ‌రి దీనిపై మైసూరా ఏం చెప్పార‌నేది తెలియాల్సి ఉంది. మొత్తానికి ఇప్ప‌టికిప్పుడు మాత్రం వివేకాకి చెక్ పెట్టేందుకు మైసూరాని రంగంలోకి దింపుతున్నార‌ని ప‌క్కాగా అర్ధ‌మ‌వుతోంది. మ‌రి వైకాపా ఎలా రియాక్ట్ అవుతుందో చూడాలి.