కార్పొరేష‌న్ పోరులో జ‌న‌సేన ఎఫెక్ట్ ఎవ‌రికి ఎంత‌..!

తెలుగునాట ఎన్టీఆర్, ఏఎన్నార్ ల తరువాత ఆ స్థాయిలో ద‌శాబ్దాల‌పాటు సినీ అభిమానుల‌ను ఉర్రూతలూగించి తిరుగులేని అభిమాన గ‌ణాన్ని సొంతం చేసుకున్న ఘ‌నత చిరంజీవిది. ఆ ధైర్యంతోనే ఎన్టీఆర్ బాట‌లోనే తానూ సొంతంగా రాజ‌కీయ‌ పార్టీ పెట్టి ముఖ్య‌మంత్రి కావాల‌ని ఆశించిన చిరంజీవికి రాజ‌కీయాల్లో మాత్రం గ‌ట్టి ఎదురుదెబ్బ‌నే రుచిచూడాల్సి వ‌చ్చింది. సినిమాల్లో నెంబ‌ర్ వ‌న్‌గా రాణించిన చిరంజీవి రాజ‌కీయాల్లో మాత్రం వెనుక‌బెంచీ విద్యార్థిగానే ఉండిపోయారు.

చిరంజీవి రాజ‌కీయాల్నిన‌మ్ముకుని సినీరంగాన్ని వీడ‌టంతో స‌హ‌జంగానే ఆయ‌న అభిమాన గ‌ణ‌మంతా  చిరంజీవి సోద‌రుడు ప‌వ‌న్ క‌ల్యాణ్  వైపు మ‌ళ్లింది. చిరంజీవి ప్ర‌జారాజ్యం పార్టీ పెట్టిన స‌మ‌యంలో ఆ పార్టీ యువ‌త అధ్య‌క్షుడిగా పార్టీ గెలుపు కోసం ప‌వ‌న్ క‌ల్యాణ్ కూడా శ‌క్తివంచ‌న లేకుండా కృషి చేసిన విష‌యం తెలిసిందే. అయితే 2009 ఎన్నిక‌ల్లో ఓట‌మి తరువాత  చిరంజీవి త‌న పార్టీని కాంగ్రెస్‌లో విలీనం చేశారు. ప్ర‌తిఫ‌లంగా కేంద్రంలో మంత్రి ప‌ద‌విని కూడా ద‌క్కించుకున్నారు.  అప్ప‌ట్లో కాంగ్రెస్‌లో ప్ర‌జారాజ్యం విలీనం అంశంలో చిరంజీవితో విభేదించిన ప‌వన్ కల్యాణ్ తాను మాత్రం కాంగ్రెస్‌కు దూరంగానే ఉంటూ వ‌చ్చారు. అనంత‌రం 2014 సార్వ‌త్రిక ఎన్నిక‌ల్లో..  టీడీపీ, బీజేపీ కూట‌మికి బేష‌ర‌తుగా మ‌ద్ధ‌తు ప్ర‌క‌టించి ప‌వ‌న్ తన విల‌క్ష‌ణ‌త‌ను చాటుకున్నారు.

అనంత‌ర కాలంలో జ‌న‌సేన పార్టీని స్థాపించి తాను రాజ‌కీయాల్లోకి వ‌స్తున్న‌ట్లు బ‌హిరంగంగా ప్ర‌క‌టించారు. ప్ర‌జారాజ్యం పార్టీ ప్ర‌యోగం విఫ‌లం కావ‌డానికి కార‌ణ‌మైన అంశాల‌ను జాగ్ర‌త్త‌గా విశ్లేషించుకున్న‌ప‌వ‌న్…  జ‌న‌సేన విష‌యంలో అది పున‌రావృతం కాకుండా ఆచితూచి అడుగులేస్తున్నారు. అప్ప‌ట్లో ప్ర‌జారాజ్యం ఓట‌మికి ప్ర‌ధాన కార‌ణం ఆ పార్టీపై ప‌డిన కుల ముద్రేన‌న్న‌ది రాజ‌కీయ విశ్లేష‌కుల అభిప్రాయం. అందుకే ప‌వ‌న్‌క‌ల్యాణ్ త‌న‌కు కులం అంట‌గ‌ట్ట‌వ‌ద్ద‌ని త‌న‌కు అంద‌రూ స‌మాన‌మేన‌ని మొద‌టినుంచి చెపుతూ వ‌స్తున్నారు. క్లీన్ ఇమేజ్‌తో పాటు క‌ష్టాల్లో ఉన్న‌వారికి త‌న‌కు చేత‌నైనంత సాయం చేసే గుణం ఉన్న ప‌వ‌న్‌కు స‌హ‌జంగానే అన్నివ‌ర్గాల్లోను అభిమానులు ఉన్నారు.  రాజ‌కీయాల్లో తళుక్కునమెరిసి మళ్ళీ మాయం అవుతున్న ప‌వ‌ర్‌ స్టార్.. పార్టీ నిర్మాణం జరుగుతోంద‌ని,  ప్రజల్లోకి వెళుతున్నామ‌ని చెబుతున్నారే కానీ, అది జరుగుతున్న దాఖలాలు కనిపించడం లేద‌ని విమ‌ర్శ‌లు కూడా వినిపిస్తూ వ‌చ్చాయి.

అయితే తాజాగా న‌గ‌ర‌పాల‌క సంస్థ‌ల ఎన్నిక‌ల్లో పోటీకి సిద్ధ‌ప‌డుతున్న‌ట్టు ప‌వ‌న్ సూచ‌న‌ప్రాయంగా వెల్ల‌డించ‌డంతో రాష్ట్ర రాజ‌కీయాల్లో జ‌న‌సేన ప్ర‌భావంపై రాజ‌కీయ వ‌ర్గాల్లో చ‌ర్చ జ‌రుగుతోంది.  జ‌న‌సేన ఇప్ప‌టిదాకా టీడీపీ, బీజేపీ కూట‌మికి మిత్ర‌ప‌క్షంగా వ్య‌వ‌హరిస్తూ వ‌చ్చింది. జ‌న‌సేన ప్ర‌త్య‌క్ష ఎన్నిక‌ల్లో దిగ‌డం ఖాయ‌మైతే ఒంట‌రి పోరుకు సిద్ధ‌ప‌డుతుందా..?  లేక టీడీపీ, బీజేపీ కూట‌మితో పొత్తును కొన‌సాగిస్తుందా అన్న‌ది ప్ర‌స్తుతం అత్యంత ఆస‌క్తిక‌రంగా క‌నిపిస్తోంది. ఎందుకంటే ప‌వ‌న్ క‌ల్యాణ్‌కు జ‌నంలో ఉన్నఫాలోయింగ్ దృష్ట్యా చూస్తే జ‌న‌సేన పార్టీ తీసుకునే నిర్ణ‌యం రాజ‌కీయ స‌మీక‌ర‌ణ‌ల‌ను పూర్తిగా మార్చేసే అవ‌కాశ‌ముంది.

జ‌న‌సేన అధికార కూట‌మితో క‌లిసి ప‌నిచేస్తే బ‌హుశా విజ‌యం ఏక‌ప‌క్షంగానే ఉండే అవ‌కాశం క‌నిపిస్తోంది. అలాకాకుండా ఒంట‌రిపోరుకు సిద్ధ‌ప‌డితే రాజ‌కీయం మ‌రింత ర‌స‌వ‌త్త‌రంగా మారే అవ‌కాశం క‌నిపిస్తోంది. ప్ర‌స్తుతం ఎన్నిక‌లు జ‌ర‌గ‌బోతున్న‌విశాఖ‌, కాకినాడ‌, గుంటూరు, తిరుప‌తి వంటి న‌గ‌రాల్లో స‌హ‌జంగానే  ప‌వ‌న్‌కు తిరుగులేని అండ‌గా నిలుస్తున్న ఆయ‌న సొంత సామాజిక వ‌ర్గం ఓట్లు అధికంగా ఉన్నాయి. ఇప్ప‌టిదాకా వీరిలో అధిక శాతం కాంగ్రెస్‌కు, అనంత‌ర కాలంలో వైసీపీకి అండ‌గా నిలుస్తూ వ‌చ్చారు.

2014 ఎన్నిక‌ల్లో ప‌వ‌న్ ప్ర‌భావంతో ఈ వ‌ర్గంలో చీలిక వ‌చ్చి టీడీపీ, బీజేపీ కూట‌మి లాభ‌ప‌డింది. ఇప్పుడు గ‌నుక ప‌వ‌న్ ప్ర‌త్య‌క్షంగా పోటీప‌డితే ఈ వ‌ర్గం మొత్తం ఆయ‌న పార్టీ కొమ్ముకాసే అవ‌కాశ‌మే ఎక్కువ‌. అలా జ‌రిగిన ప‌క్షంలో ఈ ఎన్నిక‌ల వ‌ర‌కూ ప్ర‌ధానంగా  పోటీ అధికార ప‌క్షం, ప‌వ‌న్ పార్టీల మ‌ధ్య‌నే జ‌రిగే అవ‌కాశ‌మే ఎక్కువ‌గా క‌నిపిస్తోంది. ఇక విప‌క్ష వైసీపీ ఈ ప్రాంతాల్లో మూడో స్థానంతోనే స‌రిపెట్టుకోవ‌ల‌సిరావ‌చ్చు. అయితే ఇవ‌న్నీ ముంద‌స్తు ఊహాగానాలే… పూర్తి చిత్రం బ‌య‌ట‌కు రావాలంటే మ‌రి కొన్ని రోజులు వేచి చూడాల్సిందే మ‌రి.