ఆ టీఆర్ఎస్ ఎమ్మెల్యే రాజీనామా చేస్తారా..!

రాజ‌ధాని హైద‌రాబాద్‌లో చెరువులు, న‌ల్లాల‌ను ఆక్ర‌మించి నిర్మాణాలు చేసిన వారి తాట తీస్తామ‌ని ఇటీవ‌ల కురిసిన కుంభ వృష్టితో హైద‌రాబాద్ మునిగిపోయిన సంద‌ర్భంగా సీఎం కేసీఆర్ ప్ర‌క‌టించారు. ఈ విష‌యంలో సొంత పార్టీ నేత‌లు అయినా స‌రే..ఊరుకునేది లేద‌ని స్ప‌ష్టం చేశారు. అయితే, ఇప్పుడు ఇలాంటి కేసు విష‌యంలోనే అధికార టీఆర్ ఎస్‌కి చెందిన ఖ‌మ్మం ఎమ్మెల్యే పువ్వాడ అజ‌య్‌కుమార్‌కి హైకోర్టు నుంచి పెద్ద ఎదురు దెబ్బ త‌గిలింది. అయితే, ఆయ‌న‌కు హైద‌రాబాద్‌లో కాకుండా త‌న సొంత నియోజ‌క‌వ‌ర్గంలోనే భూ వివాదం చుట్టుముట్టింది.

2014 ఎన్నిక‌ల్లో కాంగ్రెస్ త‌ర‌ఫున ఎమ్మెల్యేగా గెలిచిన పువ్వాడ త‌ర్వాత కేసీఆర్ ఆక‌ర్ష్ దెబ్బ‌కి కారెక్కేశారు. అయితే, ఆయ‌న ఖ‌మ్మం ప‌ట్ట‌ణంలో ఓ స‌ర‌స్సును ఆక్ర‌మించి ఆస్ప‌త్రి నిర్మాణం చేస్తున్నార‌ని, దీనిపై చ‌ర్య‌లు తీసుకోవాల‌ని అభ్య‌ర్థిస్తూ  సుధాకరరావు అనే వ్యక్తి హైకోర్టులో పిటిషన్ వేశారు. దీనిపై విచారణ చేసిన హైకోర్టు అక్కడ ఎలాంటి నిర్మాణాలు చేయరాదని ఆదేశిస్తూ.. మూడు వారాల పాటు స్టే విధించింది. అయితే, దీనిపై స్పందించిన పువ్వాడ త‌న‌పై కొంద‌రు క‌క్ష క‌ట్టి ఇలా చేస్తున్నార‌ని ఆరోపించారు.

పేద‌ల కోసం, పేద‌ల ఆరోగ్యం కోసం తాను ఆస్ప‌త్రి నిర్మిస్తున్నాన‌ని, ఎక్క‌డా నిబంధ‌న‌ల‌ను ఉల్లంఘించ‌లేద‌ని ఆయ‌న అంటున్నారు. ఆస్ప‌త్రి నిర్మాణంలో స‌ర‌స్సు ఎక్క‌డ ఉంద‌ని ఆయ‌న ఎదురు ప్ర‌శ్నిస్తున్నారు. అయితే, ఒక కాల్వ ఉండేద‌ని, అయితే, అది కూడా పాడైపోయింద‌ని, దీంతో అధికారులు త‌మ‌కు క్ర‌మ‌బ‌ద్ధీక‌రించార‌ని చెప్పారు. కొందరు బ్లాక్ మెయిలర్లు  కావాల‌నే త‌న‌ను కోర్టుకు ఈడ్చార‌ని ఆయ‌న చెప్పారు. న్యాయ వ్య‌వ‌స్థ‌పై త‌న‌కు న‌మ్మ‌కం ఉంద‌ని, హైకోర్టులో తాను కేసును ఎదుర్కుంటానని అంద‌రిలాగే పువ్వాడ కూడా చెప్పుకొచ్చారు. కానీ, టీఆర్ ఎస్ ఎమ్మెల్యేకి హైకోర్టు షాకివ్వ‌డంపై స‌ర్వ‌త్రా చ‌ర్చ‌నీయాంశ‌మైంది.