ఇండియ‌న్ ఓట‌ర్ల‌కు ట్రంప్ అలా బిస్కెట్ వేశారు!

అమెరికా అధ్య‌క్ష ఎన్నిక‌ల వేడి రాజుకుంది. డెమొక్రాట్ల త‌ర‌ఫున విదేశాంగ శాఖ మాజీ మంత్రి హిల్ల‌రీ, రిప‌బ్లిక‌న్ అభ్య‌ర్థిగా డొనాల్డ్ ట్రంప్‌ త‌ల‌ప‌డుతున్నారు. అయితే, అధ్య‌క్ష ఎన్నిక‌ల్లో భార‌త ఓట‌ర్లు కీల‌క పాత్ర పోషించ‌నున్నారు. ఓ రకంగా చెప్పాలంటే భార‌త ఓట‌ర్లు అధ్య‌క్షుడి ఎన్నిక‌ను ప్ర‌భావితం చేయ‌నున్నారని అమెరికా మీడియా చెబుతోంది. ఈ క్ర‌మంలో అటు హిల్ల‌రీ, ఇటు ట్రంప్ వీరిలో ఎవ‌రి వైపు ఇండియ‌న్ ఓట‌ర్లు మొగ్గుతారు అనేది స‌ర్వ‌త్రా ఆస‌క్తిగా మారింది. నిజానికి హిల్ల‌రీకి భార‌తీయ ఓట‌ర్లు దాదాపు అండ‌గానే నిలిచిన‌ట్టు క‌నిపిస్తోంది. వీసా, గ్రీన్ కార్డ్ త‌దిత‌ర విష‌యాల్లో భారతీయుల‌కు అనుకూలంగా నిర్ణ‌యాలు తీసుకున్న ఆమె వారి మ‌న‌సులు గెలుచుకుంది.

అయితే, అదే స‌మ‌యంలో ట్రంప్ చేసిన వివాదాస్ప‌ద వ్యాఖ్య‌లు భార‌తీయుల మ‌న‌సుల‌ను గాయ‌ప‌రిచాయి. కానీ, ఇటీవ‌ల కాలంలో మ‌ళ్లీ ట్రంప్ త‌న మాట మార్చారు. ఇండియ‌న్ ఓట‌ర్ల‌ను ఆక‌ట్టుకునే ప‌నిలో ప‌డ్డారు. ఈ క్ర‌మంలో రెండు రోజుల కింద‌ట  న్యూజెర్సీలో నిర్వహించిన భారీ ర్యాలీలో ట్రంప్ మాట్లాడుతూ.. భార‌తీయ ఓట‌ర్ల‌ను ఆక‌ర్షించే ప‌నిలో ప‌డ్డారు. ‘హిందువులకు నేను పెద్ద అభిమాని’నంటూ చెల‌రేగిపోయారు. అంతేకాదు, భార‌త్ మాకెంతో మిత్ర దేశ‌మ‌ని ఆయ‌న ప్ర‌క‌టించారు. అదేస‌మ‌యంలో భార‌త్‌, పాక్‌ల మ‌ధ్య వివాదానికి కార‌ణ‌మైన కాశ్మీర్ విష‌యంలో తాను మ‌ధ్య‌వ‌ర్తిగా ప‌నిచేస్తాన‌ని కూడా ఆయ‌న చెప్పారు.

దీంతో భార‌త ఓట‌ర్లు త‌మ‌వైపు తిరుగుతార‌ని రిప‌బ్లిక‌న్లు భావిస్తున్నారు. డెమోక్రటిక్ పార్టీకున్న బలమైన సంప్రదాయ భారత సంతతి ఓటు బ్యాంకును దెబ్బ కొట్టినట్టు లెక్క‌లు కూడా వేస్తున్నారు. అయితే, రాబోయే ఎన్నికల్లో దీని ప్రభావం ఉండకపోయినా… భవిష్యత్తులో మాత్రం భారత సంతతి వారు తమ ఓటు బ్యాంకుగా మారతారన్న అంచనాకు వ‌స్తున్నారు రిప‌బ్లిక‌న్ నేత‌లు. దీనిని బ‌ట్టి భార‌తీయ ఓట‌ర్ల‌ను మ‌చ్చిక చేసుకునేందుకు చేసిన ట్రంప్ ప్లాన్ ఫ‌లిస్తున్న‌ట్టే అనిపిస్తోంది.