” చంద్రబాబు, పెద్దిరెడ్డి రాజకీయంగానే ప్రత్యర్ధులు .. అవినీతిలో భాగస్వాములే “

• ఇద్దరి మధ్య చీకటి ఒప్పందాలు
• వైసీపీ, టీడీపీకి రాష్ట్రంలోని అవినీతి సొమ్ము
• ఇవీ సాక్ష్యాలు
• బీసీ తయువజన పార్టీ చీఫ్ రామచంద్ర యాదవ్ సంచలన వ్యాఖ్యలు .

రాష్ట్రంలో జరగబోయే అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికలకు సంబంధించి పూర్తి ఏర్పాట్లు ఎన్నికల సంఘం చేస్తుంది, ఈ క్రమంలో ఇప్పటికే ఎన్నికల షెడ్యూల్ ను ఈసీ ప్రకటించింది. మరో పక్క రాష్ట్రంలోని రాజకీయ పక్షాలు అన్నీ ఎన్నికలను ఎదుర్కొనేందుకు సన్నదం అవుతున్నారు. ఏపీలో అధికార వైసీపీ, ప్రధాన ప్రతిపక్షం తెలుగు దేశం ఈ ఎన్నికలను ప్రతిష్టాత్మకంగా తీసుకుని వివిధ రకాల పేర్లతో ప్రజల్లోకి వెళుతున్నాయి. బడుగు బలహీన వర్గాలకు రాజ్యాధికారం, అన్ని వర్గాల సంక్షేమం, రాష్ట్రాభివృద్ధి లక్ష్యంగా ప్రముఖ పారిశ్రామిక వేత్త రామచంద్ర యాదవ్ నేతృత్వంలో ఆవిర్భవించిన భారత చైతన్య యువజన (బీసీవై) పార్టీ తొలి సారిగా ఏపీ ఎన్నికల బరిలో నిలుస్తొంది.

అవినీతి అక్రమాలతో లూటీ

ఈ సందర్భంగా బీసీ యువజన పార్టీ అధినేత రామచంద్ర యాదవ్ మీడియా సమావేశంలో సంచలన విషయాలు వెల్లడించారు. 2019 లో అధికారంలోకి వచ్చిన వైఎస్ జగన్మోహనరెడ్డి సర్కార్ లో పెద్ద ఎత్తున అవినీతి అక్రమాలకు పాల్పడి రాష్ట్రాన్ని లూటీ చేశారని ఆరోపించారు. ఇప్పుడు మరొక్క సారి అవకాశం ఇవ్వాలని కోరుతున్నారన్నారు. రాష్ట్రంలో ఇంకా మిగిలిపోయి ఉన్న వాటిని పూర్తిగా దోపిడీ చేయడానికి నేను సిద్దం అంటూ ప్రజలను మభ్య పెట్టేందుకు బయలుదేరారని అన్నారు. ఉమ్మడి రాష్ట్రంగా ఉన్నప్పుడు గానీ రాష్ట్ర విభజన తర్వాత 2014 నుండి 2019 వరకూ అధికారంలో ఉన్న తెలుగుదేశం పార్టీ ఏ ఒక్క వర్గానికి మంచి చేయకపోగా, ప్రాజెక్టుల పేరు చెప్పి, అనేక రకాలుగా అవినీతి చేశారన్నారు. రాష్ట్రం విడిపోయిన తర్వాత ఈ రెండు పార్టీ ల ప్రభుత్వాలు రాజధాని నిర్మించడంలో గానీ, పోలవరం, వెలుగొండ ప్రాజెక్టు, హింద్రీనివా లాంటి ప్రాజెక్టులు పూర్తి చేయకపోగా, రాష్ట్రాన్ని పూర్తిగా దోపిడీ చేశారని మండిపడ్డారు.

బూటకపు హామీలతో మళ్లీ
రాష్ట్రానికి గానీ, రైతాంగానికి, యువతకు, మహిళలకు, బడుగు బలహీన వర్గాల అభివృద్ధికి అయితే చేయలేదు గానీ అధికారాన్ని చెరో అయిదేళ్లు పంచుకున్నారని అన్నారు. చెరో అయిదేళ్లు అధికారాన్ని అనుభవించారు కానీ రాష్ట్రానికి, ప్రజలకు ఏ మేలు చేయలేదని అన్నారు. మళ్లీ ఈ రెండు పార్టీలు ప్రజల్లోకి వస్తున్నాయని విమర్శించారు. సిద్దం అంటూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, భవిష్యత్తుకు భరోసా అంటూ తెలుగుదేశం ఇంకా రకరకాల పేర్లతో ప్రజల ముందుకు వస్తున్నాయని అన్నారు. వీళ్లు అధికారంలో ఉన్నప్పుడు రాష్ట్రంలో పారిశ్రామిక అభివృద్ధి జరగలేదనీ, యువతకు ఉద్యోగ అవకాశాలు రాలేదని, ఏ ఒక్క వర్గానికి మంచి జరగలేదని ప్రజలు గుర్తించారన్నారు. మళ్లీ ఇప్పుడు బూటకపు హామీలు, తప్పుడు మేనిఫెస్టోతో పొత్తులతో ముందుకు వస్తున్నారని విమర్శించారు. ఏ పార్టీ అధికారంలోకి వచ్చినా వీళ్లు చేస్తున్న అవినీతిపై రాజకీయంగా పోరాడుతున్నట్లు నటించి వీళ్ల వెనుక రహస్య ఒప్పందాలతో అవినీతిలో రెండు భాగస్యామ్యంగా ఉన్నారని రాష్ట్ర ప్రజలు గుర్తించారన్నారు.
చంద్రబాబు, పెద్దిరెడ్డి ల చీకటి ఒప్పందాలు
ముఖ్యంగా చిత్తూరు జిల్లా విషయానికి తీసుకుంటే మాజీ ముఖ్యమంత్రి, టీడీపీ అధినేత చంద్రబాబు, వైసీపీ సీనియర్ నాయకుడు, మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి మధ్య రాజకీయ వైరం ఉంది అనేది, రాజకీయంగా ప్రత్యర్ధులు అనేది ప్రతి ఒక్కరికీ తెలుసునని అన్నారు. వీళ్లు ప్రజల ముందు వచ్చి మాట్లాడే మాటలు, ఆరోపణలు అలానే ఉంటాయి కాబట్టి నిజంగా వీరు రాజకీయ ప్రత్యర్ధులే అని నమ్మే పరిస్థితి ఉంటుందని అన్నారు. కానీ, చంద్రబాబు నాయుడు మొదటి సారి 1995 ముఖ్యమంత్రి అయినప్పటి నుండి ఈ రోజు వరకూ రామచంద్రారెడ్డికి ఆర్ధికంగా, రాజకీయంగా లోపాయికారీగా చంద్రబాబు సహకరిస్తున్నారని ఆరోపించారు. 2014లో చంద్రబాబు అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ అయిదేళ్ల కాలంలో కూడా రాయలసీమలో నీటి ప్రాజెక్టులు, రోడ్డు పనులు చివరకు చంద్రబాబు ప్రాతినిధ్యం వహిస్తున్న కుప్పం నియోజకవర్గంలో రోడ్డు పనులు కూడా రామచంద్రారెడ్జికి సంబంధించిన పీఎల్ఆర్ కంపెనీ చేసిందని వివరించారు. చంద్రబాబు అధికారంలో ఉన్న అయిదేళ్లు రాయలసీమలో పనులను టీడీపీ వాళ్లు కాకుండా రామచంద్రారెడ్డి కంపెనీకి వేల కోట్ల రూపాయల పనులు అప్పగించారంటే వీళ్లద్దరి మధ్య ఉన్న చీకటి ఒప్పందాన్ని ప్రతి ఒక్కరూ తెలుసుకోవాలని అన్నారు.

షిరిది సాయి ఎలక్ట్రికల్స్ నుండి టీడీపీకి రూ.40కోట్లు
2019లో వైఎస్ జగన్ అధికారంలోకి రాగా, ప్రభుత్వంలో కీలకంగా ఉన్న రామచంద్రారెడ్డిపై టీడీపీ వాళ్లు అనేక అవినీతి ఆరోపణలు చేస్తున్నారని అన్నారు. ఇందులో ముఖ్యంగా కడప జిల్లాకు సంబంధించి ఎలక్ట్రికల్ కాంట్రాక్ కంపెనీ శ్రీ షిరిది సాయి ఎలక్ట్రికల్స్ అనే కంపెనీ పై టీడీపీ నేతలు అనేక ఆరోపణలు చేయడంతో పాటు ఈనాడు తదితర పత్రికల్లో పెద్ద ఎత్తున వార్తలు కూడా వచ్చాయన్నారు. వైఎస్ జగన్ ప్రభుత్వం శ్రీషిరిది సాయి ఎలక్ట్రికల్ కంపెనీకి వేల కోట్ల రూపాయలు అప్పగించారన్న ఆరోపణలు చేశారన్నారు. సదరు కంపెనీ కి చెందిన విశ్వేశ్వరరెడ్డి జగన్మోనరెడ్డి కుటుంబానికి బినామీ అని టీడీపీ చాలా సార్లు ఆరోపించిందన్నారు. 2012 పులివెందుల ఉప ఎన్నికల్లో విశ్వేశ్వరరెడ్డి జగన్మోహనరెడ్డికి డమ్మీగా నామినేషన్ వేసిన విషయం అందరికీ తెలుసునని అన్నారు. అలాంటి కంపెనీ ఎలక్టోరల్ బాండ్ ల రూపంలో టీడీపీకి రూ.40కోట్లు ఇచ్చింది అంటే ఈ రాష్ట్రంలో ఏమి జరుగుతుందో, కుమ్మక్కు రాజకీయాలు ఎలా ఉన్నాయో ప్రజలు తెలుసుకోవాలన్నారు. అవినీతికి పోరాటం చేస్తామంటారు. అవినీతి పై ఆరోపణలు చేస్తుంటారు కానీ అవినీతిలో వీళ్లందరికీ భాగస్వామ్యం ఉంటుందని రాష్ట్ర ప్రజలు గుర్తించాలన్నారు. షిరిది సాయి ఎలక్టికల్ కంపెనీ రాష్ట్ర విద్యుత్ శాఖ నుండి వేల కోట్ల రూపాయలు లబ్దిపొందిందన్నారు. విద్యుత్ శాఖ మంత్రిగా పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఉండగా, ఈ ఎలక్ట్రికల్ కంపెనీ ప్రత్యక్షంగా ఎలక్టోరల్ బాండ్ ల రూపంలో రూ.40 కోట్ల టీడీపీ అకౌంట్ లోకి అందాయి అంటే రాష్ట్రంలో అధికారంలో ఉన్న పార్టీకి అయినా ప్రతి పక్షంలో ఉన్న పార్టీకి అయినా భాగస్వామ్యం ఉంది అని అర్ధం అవుతుందన్నారు. దొంగలు దొంగలు ఊళ్లు పంచుకున్నట్లుగా రాష్ట్ర సంపదను, రాష్ట్రంలో జరుగుతున్న అవినీతి సొమ్ములో ఆ రెండు పార్టీలకు భాగస్వామ్యం ఉందని ప్రతి ఒక్కరూ తెలుసుకోవాలన్నారు. దీని వెనుక మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఉన్నారని ప్రతి ఒక్కరూ గుర్తిస్తున్నారన్నారు. అంతే కాకుండా షిరిది సాయి ఎలక్ట్రికల్ సంస్థ నుండి అనధికారికంగా రూ.500 కోట్లు తెలుగుదేశం పార్టీకి అందాయన్న మాట కూడా వినబడుతోందని అన్నారు. ఈ డీల్ లో భాగంగా కుప్పం, తంబళ్లపల్లి, పుంగనూరు తదితర నియోజకవర్గాల్లో అభ్యర్ధుల ఎంపిక విషయంలో చంద్రబాబు, పెద్దిరెడ్డికి చీకటి ఒప్పందం జరిగిందని ప్రతి ఒక్కరూ చర్చించుకుంటున్నారన్నారు.

రెండు పార్టీలు అవినీతిలో వాటాదారులే
అలానే రాష్ట్రంలో జరుగుతున్న ప్రతి అవినీతిలోనూ రెండు పార్టీలు భాగస్వామిగా ఉన్నారని ఆరోపించారు రామచంద్ర యాదవ్. గత టీడీపీ హయాంలో పోలవరం ప్రాజెక్టు పనులు నవయుగ, ట్రాన్స్ రాయ్ నిర్వహించగా, అక్కడ టీడీపీ షోలు చేసి పది వేల కోట్లు అవినీతి పాల్పడిందని ఆరోపించారు. వైఎస్ జగన్ అధికారంలోకి వచ్చిన తర్వాత మేఘా కంపెనీకి అప్పగించి దోపిడీ చేసే కార్యక్రమం చేపట్టారన్నారు. పోలవరం ప్రాజెక్టు అయితే పూర్తి కాలేదు కానీ ఆ ప్రాజెక్టు పేరుతో ఈ అయిదేళ్లలో 15వేల కోట్ల అవినీతి జరిగిందన్నారు. ఆ కంపెనీలు అన్నింటి నుండి కూడా అధికారికంగా ఈ రెండు పార్టీలకు భారీ ఎత్తున విరాళాలు అందాయని చెప్పారు. అంతే కాకుండా అనధికారికంగా వేల కోట్ల రూపాయలు రెండు పార్టీలకు ముడుపుల రూపంలో అందుతున్నాయని రాష్ట్ర ప్రజలు గుర్తించాలన్నారు. ఇదే మేఘా కంపెనీ నుండి రూ.39 కోట్లు అధికారికంగా వైసీపీకి నిధులు సమకూరిస్తే, తెలుగుదేశం పార్టీకి 25 కోట్లు అందాయన్నారు. అనధికారికంగా వందల కోట్లు పార్టీలు తీసుకుంటున్నాయన్నారు. అంతే కాకుండా ఈ రెండు పార్టీల నేతలు చిత్తూరు జిల్లాలో అభ్యర్ధుల ఎంపికలోనూ మాచ్ ఫిక్సింగ్ చేసుకుంటున్నాయని ప్రతి ఒక్కరూ గుర్తిస్తున్నారన్నారు. ఈ పార్టీల వికృత రాజకీయ క్రీడల్లో సామాన్య ప్రజలు నష్టపోతున్నారన్నారు. ఆయా పార్టీల్లోని అమాయక కార్యకర్తలు కేసులు పెట్టించుకుని జైళ్లకు వెళుతూ ఇబ్బందులు పడుతున్నారన్నారు. చిత్తూరు జిల్లాలో మాదిరిగా రాష్ట్ర వ్యాప్తంగానూ ఈ రెండు పార్టీలు పదేళ్లలో పది లక్షల కోట్లు అవినీతికి పాల్పడ్డాయని ఆరోపించారు. అందుకే ఈ రెండు పార్టీల అవినీతిని అరికట్డడానికి ప్రత్యామ్నాయ రాజకీయ వ్యవస్థ కోసం ఏర్పడి మీ ముందుకు వస్తున్న భారత చైతన్య యువజన పార్టీని ఆదరించాలని రామచంద్ర యాదవ్ విజ్ఞప్తి చేశారు.