బీజేపీతో పవన్ తెగదెంపులు… ఫుల్ క్లారిటీ ఇచ్చేసిన జనసేనాని….!

రాబోయే ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీతో కలిసి పోటీ చేస్తామని జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ ప్రకటించేశారు. స్కిల్ డెవలెప్‌మెంట్ స్కీమ్‌లో స్కామ్ జరిగిందంటూ చంద్రబాబును సీఐడీ అధికారులు అరెస్ట్ చేశారు. దీంతో రాజమండ్రి సెంట్రల్ జైలులో చంద్రబాబు రిమాండ్ ఖైదీగా ఉన్నారు. ఆయనను పరామర్శించిన పవన్ కల్యాణ్… బయటకు వచ్చిన వెంటనే పొత్తు కుదిరినట్లు ప్రకటించారు. అదే సమయంలో బీజేపీ కూడా తమతో కలిసి వస్తే బాగుంటుందన్నారు. బీజేపీ నేతలతో తాను మాట్లాడుతా అని కూడా ప్రకటించారు. అయితే ఈ విషయంలో అంగుళం కూడా ముందుకు పడలేదు. తాము ఎన్‌డీఏ కూటమిలోనే ఉన్నామని జనసేన నేతలు చెబుతున్నప్పటికీ టీడీపీ నేతలు మాత్రం మోదీ సర్కార్‌పై సోషల్ మీడియాలో వ్యతిరేక పోస్టులు పెడుతూనే ఉన్నారు. చంద్రబాబు అరెస్టు వెనుక మోదీ హస్తం కూడా ఉందని ఒకరిద్దరు టీడీపీ నేతలు బహిరంగంగా వ్యాఖ్యానించారు కూడా. దీంతో జనసేన భవితవ్యం కూడా ప్రస్తుతం డైలామాలో పడింది.

అయితే తాజాగా నాలుగో విడత వారాహి యాత్ర పూర్తి చేసిన పవన్ కల్యాణ్… బీజేపీతో పొత్తు తెగినట్లే అన్నట్లుగా వ్యాఖ్యలు చేశారు. బీజేపీకి జనసేన గుడ్ బై చెప్పినట్లే అనేది తాజా పరిణామాలు చూస్తే అర్థమవుతోంది. నాలుగో విడత వారాహి యాత్రలో టీడీపీతో పొత్తు గురించే పవన్ ప్రస్తావించారు తప్ప… ఎక్కడా బీజేపీ గురించి వ్యాఖ్యానించడం లేదు. అలాగే రాబోయే ఎన్నికల్లో టీడీపీ – జనసేన సంకీర్ణ ప్రభుత్వమే అధికారంలోకి వస్తుందని పవన్ పదే పదే చెబుతున్నారు. అలాగే తెలంగాణ ఎన్నికల్లో జనసేన ఒంటరిగానే పోటీ చేస్తుందని కూడా ఇప్పటికే పవన్ ప్రకటించారు. ఏపీ దోస్తీ చేస్తున్న బీజేపీతో తెలంగాణలో ఎందుకు విడిపోయారనేది ఇప్పుడు మిలియన్ డాలర్ల ప్రశ్న. తెలంగాణలో 32 అసెంబ్లీ స్థానాల్లో ఒంటరిగా పోటీ చేస్తామని ప్రకటించడం ద్వారా బీజేపీతో ముందుకు సాగేది లేదని పవన్ ప్రకటించినట్లైంది.

చంద్రబాబుతో ములాఖత్ తర్వాత పొత్తుల గురించి ప్రకటించిన పవన్… బీజేపీ నేతలకు తొలి షాక్ ఇచ్చారు. అయితే ఆ తర్వాత మంగళగిరిలో జరిగిన కార్యకర్తల సమావేశంలో బీజేపీతో పొత్తులో ఉన్నామన్నారు పవన్. పొత్తులపై బీజేపీ అగ్రనాయకత్వంతో మాట్లాడి ఒప్పిస్తా అని చెప్పిన పవన్… నాలుగో విడత వారాహి యాత్రలో మాత్రం… టీడీపీ – జనసేన సంకీర్ణ ప్రభుత్వం ఏర్పడుతుందని మాత్రమే ప్రకటించారు. చంద్రబాబు అరెస్ట్ వ్యవహారంపై ఢిల్లీ పెద్దలతో స్వయంగా మాట్లాడుతా అని స్వయంగా ప్రకటించిన పవన్… నెల రోజులవుతున్నా… ఇప్పటి వరకు ఆ దిశగా ఎలాంటి ప్రయత్నాలు చేయలేదు. చంద్రబాబు అరెస్టు వెనుక కమలనాథుల హస్తం ఉందని పవన్ నమ్ముతున్నట్లు తెలుస్తోంది. ఇవన్నీ సమీక్షించుకున్న తర్వాతే బీజేపీకి గుడ్ బై చెప్పాలని పవన్ అనుకున్నట్లు తెలుస్తోంది. అటు బీజేపీ కూడా పవన్ వ్యవహారంపై చర్చించినట్లు తెలుస్తోంది.