బాపట్ల వైసీపీ ఎంపీ అభ్యర్థిగా మంత్రి గారు ఫిక్స్ అయ్యారా….?

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మార్చి లేదా ఏప్రిల్ నెలల్లో ఎన్నికలుంటాయని స్వయంగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్రకటించారు. దీంతో ఎన్నికలకు ఇంక కేవలం 5 నెలలు మాత్రమే సమయం ఉందనేది నేతల మాట. ఈ నేపథ్యంలో నేతలంతా ఇప్పటి నుంచి ఎన్నికలకు సిద్ధమవుతున్నారు. కొన్ని నియోజకవర్గాల్లో అయితే నేతలు ఇప్పటి నుంచే ఓటర్లు ఆకట్టుకునేందుకు తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. రాబోయే ఎన్నికల్లో సుమారు 50 మందికి పైగా సిట్టింగ్‌లకు టికెట్ లేదని ఇప్పటికే వైసీపీ అధినేత, సీఎం జగన్ క్లారిటీ ఇచ్చేశారు. దీంతో నేతలంతా తమ తమ రాజకీయ భవిష్యత్తుపై దృష్టి పెట్టారు. ఇక టికెట్ రాదని భావిస్తున్న నేతలంతా ఇప్పుడు ప్రత్యామ్నాయ మార్గాలపై దృష్టి పెడుతున్నట్లు తెలుస్తోంంది.

ప్రకాశం జిల్లాకు చెందిన మంత్రి ఆదిమూలపు సురేష్ పరిస్థితి కూడా సేమ్ ఇలాగే ఉందంటున్నారు రాజకీయ విశ్లేషకులు. వరుసగా రెండు సార్లు జగన్ మంత్రివర్గంలో పదవి దక్కించుకున్న ఆదిమూలపు సురేష్ పై ఆయన ప్రాతినిధ్యం వహిస్తున్న యర్రగొండపాలెం నియోజకవర్గంలో వ్యతిరేకత ఉందనేది బహిరంగ రహస్యం. వరుసగా మూడుసార్లు ఎన్నికైన ఆదిమూలపు సురేష్… తొలిసారి యర్రగొండపాలెం నుంచి రెండోసారి సంతనూతల పాడు నుంచి… డోసారి మళ్లీ యర్రగొండపాలెం నుంచి పోటీ చేసి గెలిచారు. జగన్ మంత్రివర్గంలో కొలువు పొందిన సురేష్ స్థానికంగా కీలకమైన నేతలను దూరం పెట్టారనేది అతి పెద్ద అపవాదు. కేవలం కొద్ది మంది నేతలను మాత్రమే ఆయన దగ్గరకు తీసుకున్నారని… కీలకమైన నేతలను దూరం పెట్టారనేది ప్రధానమైన ఆరోపణ. అదే సమయంలో యర్రగొండపాలెంలో రియల్ ఎస్టేట్ వ్యాపారి హత్య కేవలం ఒక సామాజిక వర్గంపైన దాడిలా మారిపోయింది. ఇక చంద్రబాబు నాయుడు పర్యటన సమయంలో రాళ్ల దాడి కూడా సురేష్‌కు మైనస్ మార్కులకు కారణం. కేవలం పొలిటికల్ మైలేజ్ కోసమే నియోజకవర్గంలో కులాల మధ్య చిచ్చుపెట్టేలా సురేష్ వ్యవహరించారని… అందుకు చంద్రబాబు పర్యటనను లక్ష్యంగా చేసుకుని రాళ్ల దాడి చేశారనేది ప్రధాన ఆరోపణ.

ఇక మరోవైపు యర్రగొండపాలెం నియోజకవర్గంలో ఆశించిన మేర అభివృద్ధి జరగలేదనేది స్థానికుల మాట. మరోవైపు జిల్లాకు చెందిన సీనియర్ నేత, మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డితో ఆదిమూలపు సురేష్‌కు ఏ మాత్రం సఖ్యత లేకుండా పోయింది. ఆదిమూలపుపై ఇప్పటికే బాలినేని కూడా పరోక్షంగా వ్యాఖ్యలు చేశారు. ఈ నేపథ్యంలో… రాబోయే ఎన్నికల్లో మరోసారి ఇక్కడి నుంచే ఎమ్మెల్యేగా పోటీ చేస్తే తనకు ఓటమి తప్పదని ఆదిమూలపు సురేష్ భావిస్తున్నట్లు తెలుస్తోంది. దీంతో ఎమ్మెల్యే టికెట్ కంటే కూడా… ఎంపీగా పోటీ చేస్తే… హస్తిన స్థాయిలో చక్రం తిప్పవచ్చు అనేది సురేష్ ఆలోచన. అందుకే రాబోయే ఎన్నికల్లో బాపట్ల నియోజకవర్గం నుంచి ఎంపీగా పోటీ చేసేందుకు ఆదిమూలపు సురేష్ రెడీ ఆవుతున్నట్లు తెలుస్తోంది. ఈ విషయంపై ఇప్పటికే వైఎస్ జగన్‌కు కూడా సమాచారం ఇచ్చినట్లు తెలుస్తోంది. రాబోయే ఎన్నికల్లో ఎంపీగా వెళ్లేందుకు ఇప్పటి నుంచే ఆదిమూలపు సురేష్ బాటలు వేసుకుంటున్నారనేది యర్రగొండపాలెం నియోజకవర్గంలో వినిపిస్తున్న మాట కూడా.