చంద్రబాబు అరెస్ట్‌… టీడీపీ అనుకూలించలేదా…?

తెలుగుదేశం పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు అరెస్టు క్రమంగా మరుగున పడుతున్నట్లుంది. స్కిల్‌ డెవలప్‌మెంట్‌ స్కీమ్‌లో భారీ స్కామ్‌ జరిగిందంటూ చంద్రబాబును సీఐడీ అధికారులు అదుపులోకి తీసుకున్నారు. ఏసీబీ కోర్టు చంద్రబాబుకు రిమాండ్‌ విధించడంతో… 24 రోజులుగా రాజమండ్రి సెంట్రల్‌ జైలులో రిమాండ్‌ ఖైదీగా ఉన్నారు. ఈ కేసులో చంద్రబాబు దాఖలు చేసిన క్వాష్‌ పిటీషన్‌ను ఏపీ హైకోర్టు కొట్టివేయడంతో… సుప్రీం కోర్టు గడప తొక్కారు చంద్రబాబు తరఫు న్యాయవాదులు. అదే సమయంలో చంద్రబాబుకు ఏసీబీ కోర్టు, హైకోర్టులలో ఎదురుదెబ్బ తగిలింది. దీంతో.. చంద్రబాబును సీఐడీ అధికారులు రెండు రోజుల పాటు కస్టడీలోకి తీసుకుని విచారించారు కూడా. రాజకీయంగా చంద్రబాబు అరెస్టు టీడీపీకి అనుకూలంగా ఉన్నాయని ఆ పార్టీ చెబుతున్నప్పటికీ… క్షేత్రస్థాయిలో మాత్రం పరిస్థితి వేరుగా ఉందంటున్నారు రాజకీయ విశ్లేషకులు.

చంద్రబాబు అరెస్ట్‌.. అనంతర పరిణామాలు టీడీపీకి అనుకూలంగా ఉన్నాయనేది ఆ పార్టీ నేతల మాట. చంద్రబాబు అరెస్టుతో ప్రజల్లో టీడీపీ పట్ల సానుభూతి వచ్చిందని… పైగా పవన్‌ కూడా పొత్తు పెట్టుకోవడంతో.. రాబోయే ఎన్నికల్లో గెలుపు వన్‌ సైడ్‌ అని ధీమా వ్యక్తం చేస్తున్నారు. జగన్ ప్రభుత్వంపైన ప్రజల్లో వ్యతిరేకత ఉందని… కాబట్టి ప్రజలు తమకే ఓట్లు వేస్తారని కూడా చెబుతున్నారు. వైసీపీ నేతల్లో కూడా ఓటమి భయం ఉందని.. త్వరలోనే కీలక నేతలు పార్టీ మారేందుకు సిద్ధంగా ఉన్నారంటూ ప్రచారం చేస్తున్నారు. కానీ పరిస్థితి మాత్రం వేరుగా ఉందనేది వాస్తవం. గతంలో చంద్రబాబు ప్రభుత్వంపై వ్యతిరేకత ఉన్నట్లు గుర్తించిన సొంత పార్టీ నేతలు… సైలెంట్‌గా పార్టీ మారిపోయారు. సిట్టింగ్‌ ఎంపీలు, ఎమ్మెల్యేలు కూడా టీడీపీకి గుడ్‌ బై చెప్పి వైసీపీలో చేరిపోయారు. దీనికి ప్రధాన కారణం… టీడీపీ ఓడిపోతుందని ముందుగానే గుర్తించారని… అందుకే ముందు జాగ్రత్తగా పార్టీ మారినట్లు ప్రచారం జరిగింది. ఆ తర్వాత జరిగిన ఎన్నికల్లో నేతల లెక్క తప్పలేదు. పార్టీ మారిన నేతలంతా టికెట్లు సాధించి… ఎన్నికల్లో విజయం సాధించారు కూడా. అయితే ప్రస్తుతం మాత్రం.. అధికార పార్టీలో ఆ భయం ఏ మాత్రం కనిపించడం లేదు. వ్యతిరేకత ఉందని ప్రతిపక్ష నేతలు చెబుతున్నప్పటికీ… క్షేత్రస్థాయిలో మాత్రం చంద్రబాబు అరెస్ట్ ప్రభావం పెద్దగా లేదంటున్నారు అధికార పార్టీ నేతలు. ఏదో చేసే ఉంటాడు కాబట్టే చంద్రబాబును అరెస్ట్‌ చేశారనే ప్రజలు మాట్లాడుకుంటున్నారని… ప్రస్తుతం ప్రజలకు ప్రతి విషయంపై వాస్తవాలు తెలుసంటున్నారు వైసీపీ నేతలు. దీంతో చంద్రబాబు అరెస్ట్‌ వ్యవహారం… టీడీపీకి పెద్దగా అనుకూలించినట్లు కనిపించటం లేదనేది వాస్తవం.