కేసీఆర్‌పై మోదీ సంచలన వ్యాఖ్యలు..!

తెలంగాణ సీఎం కేసీఆర్‌ టార్గెట్‌గా ప్రధాని మోదీ సంచలన వ్యాఖ్యలు చేశారు. కేసీఆర్ బాగోతాన్ని మీకు చెబుతున్నానంటూ తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. తెలంగాణలో బీజేపీ అధికారంలోకి రాగానే.. బీఆర్ఎస్ పాపాలను ఒక్కొక్కటి బయటకు తీస్తామని వార్నింగ్‌ ఇచ్చారు. ప్రధాని మోదీ తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌పై ఘాటు విమర్శలు చేశారు. నిజామాబాద్‌ జిల్లా బీజేపీ జనగర్జన సభలో ప్రసంగించిన ప్రధాని.. ఇంతకు ముందెప్పుడూ చెప్పని ఓ రహస్యం మీకు చెబుతున్నానంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇప్పటివరకు బీఆర్ఎస్‌, బీజేపీ మధ్య రహస్య మిత్రబంధం ఉందని ప్రజల్లో బలంగా వెళ్లింది. ఈ నేపథ్యంలో ప్రధాని మోదీ కేసీఆర్‌ టార్గెట్‌గా చేసిన వ్యాఖ్యలు.. తెలంగాణ రాజకీయాల్లో హాట్‌టాపిక్‌గా మారాయి.

జీహెచ్‌ఎంసీ ఎన్నికల తర్వాత కేసీఆర్‌ వైఖరి పూర్తిగా మారిపోయిందని ప్రధాని మోదీ చెప్పుకొచ్చారు. కేసీఆర్‌ ఢిల్లీ వచ్చి తనను కలిశారని, ఎన్డీయేలో చేరతామని, తెలంగాణలో కేటీఆర్‌ను ఆశీర్వదించాలని కోరినట్లు చెప్పారు. అయితే, ఇది రాజరికం కాదని చెబుతూ, ప్రజలు ఆశీర్వదించిన వారే పాలకులని, బీజేపీతో పొత్తు పెట్టుకునే ప్రసక్తే లేదని ఆ రోజే తేల్చి చెప్పినట్లు మోదీ వెల్లడించారు. ఇక.. ఎంతోమంది బలిదానాలతోనే తెలంగాణ సాకారమైందని.. కానీ తెలంగాణ వచ్చాక ఒక కుటుంబమే బాగుపడిందన్నారు. కేసీఆర్‌ పాలనలో అవినీతి పెరిగిందన్నారు. కేసీఆర్‌, ఆయన కుమారుడు, ఆయన కుమార్తె, అల్లుడు మాత్రమే ధనికులయ్యారన్నారు. కేంద్రం ఇచ్చిన నిధులను కూడా బీఆర్ఎస్ దోచుకుంటోందని ప్రధాని మోదీ తీవ్ర స్థాయిలో ఆరోపణలు చేశారు.

కుటుంబ పాలనకు ప్రజలు మరో అవకాశం ఇవ్వొద్దని.. తనపై నమ్మకం ఉంచి తెలంగాణ బీజేపీకి అవకాశం ఇవ్వండని ప్రధాని కోరారు. ఐదేళ్లలో బీఆర్‌ఎస్‌ దోచుకున్నదంతా కక్కిస్తానని చెప్పారు. తెలంగాణలో బీజేపీ అధికారంలోకి రాగానే.. బీఆర్‌ఎస్‌ పాపాలను ఒక్కొక్కటి బయటకు తీస్తామన్నారు. అటు కాంగ్రెస్‌పై ప్రధాని మోదీ విరుచుకుపడ్డారు. దక్షిణ భారతదేశంలోనే హిందూ దేవాలయాలను దోచుకుంటుందని ఆరోపించారు. బీఆర్ఎస్‌ లాగే కాంగ్రెస్‌ది కూడా కుటుంబపాలనే అన్నారు. మొత్తంగా తెలంగాణ ఏర్పడిన ప్రతిఫలాన్ని ఒక కుటుంబమే అనుభవిస్తోందని.. రానున్న ఎన్నికల్లో తెలంగాణ తల్లులు, చెల్లెమ్మలు బీజేపీని ఆశీర్వదించాలని కోరారు.