రంగంలోకి దిగిన వైవీ… ఆశలు వదిలేసుకున్న టీడీపీ….!

వైవీ సుబ్బారెడ్డి…. ప్రస్తుతం వైసీపీలో కీలక నేతల్లో ఆయన ఒకరు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి దగ్గర బంధువుగా గుర్తింపు తెచ్చుకున్న వైవీ సుబ్బారెడ్డి… పార్టీలో కూడా కీ రోల్ పోషిస్తున్నారు. పార్టీలో నేతల మధ్య విబేధాలు తలెత్తినప్పుడు స్వయంగా రంగంలోకి దిగిన వైవీ… వాటిని సరిదిద్దడంలో సిద్ధహస్తునిగా పేరు తెచ్చుకున్నారు. కీలకమైన ఉత్తరాంధ్ర రీజినల్ కో ఆర్డినేటర్ బాధ్యతలను సీఎం జగన్… వైవీకి అప్పగించారంటే తెలుస్తుంది.. ఆయన ఎంత కీలకమనే మాట. వైసీపీలో ట్రబుల్ షూటర్‌గా ఆయనకు పేరు. 2014లో ఒంగోలు ఎంపీగా పోటీ చేసి గెలిచిన వైవీ…. 2019లో మాత్రం ఎన్నికలకు దూరంగానే ఉన్నారు. ఆయనకు బదులుగా ప్రస్తుత ఎంపీ మాగుంట శ్రీనివాసులు రెడ్డిని రంగంలోకి దింపారు జగన్. మాగుంట గెలుపుతో పాటు పార్లమెంట్ పరిధిలో అభ్యర్థుల గెలుపు బాధ్యతలను వైవీకి అప్పగించారు కూడా.

ఒంగోలు పార్లమెంట్ పరిధిలోని కొండేపి మినహా మిగిలిన ఆరు నియోజకవర్గాల్లో కూడా వైసీపీ అభ్యర్థులు భారీ మెజారిటీతోనే గెలిచారు. రాష్ట్రంలోనే అత్యధిక మెజారిటీ వచ్చిన నియోజకవర్గాల్లో రెండో స్థానంలో ఉన్న గిద్దలూరు అసెంబ్లీ స్థానం ఒంగోలు పరిధిలోనే ఉంది. అలాంటి కీలకమైన నేతకు వైసీపీ ప్రభుత్వం ఏర్పడిన వెంటనే… తిరుమల తిరుపతి దేవస్థానం బోర్డు ఛైర్మన్ పదవి ఇచ్చారు జగన్. వరుసగా రెండు దఫాలు టీటీడీ ఛైర్మన్‌గా వ్యవహరించిన వైవీ… మరోసారి ప్రత్యక్ష రాజకీయాల్లో దిగేందుకు రంగం సిద్ధం చేసుకుంటున్నారు. ప్రస్తుత ఒంగోలు ఎంపీ మాగుంట శ్రీనివాసులరెడ్డి కుమారుడు రాఘవరెడ్డి ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో అరెస్ట్ అయ్యారు. దీంతో ఆయనకు వచ్చే ఎన్నికల్లో సీటు కష్టమనే మాట వినిపిస్తోంది. దీంతో స్వయంగా రంగంలోకి దిగిన వైవీ.. రాబోయే ఎన్నికల్లో తానే ఒంగోలు నుంచి పోటీ చేసేందుకు రెడీ అవుతున్నారు. ఇప్పటికే నియోజకవర్గం పరిధిలోని నేతలతో వరుస భేటీలు నిర్వహిస్తున్నారు కూడా.

వైవీ రాకతో ఒంగోలు పార్లమెంట్ స్థానంపై టీడీపీ ఆశలు వదిలేసుకున్నట్లుగా ఉంది. వాస్తవానికి ఒంగోలు పార్లమెంట్ స్థానంలో కేవలం ఒక్కసారి మాత్రమే టీడీపీ గెలిచింది. అది కూడా కరణం బలరాం అభ్యర్థి కావడం వల్లే. ప్రస్తుతం ప్రకాశం టీడీపీని నడిపించే నేత లేడనే చెప్పాలి. ఒంగోలు పార్లమెంట్ నుంచి బరిలోకి దిగేందుకు అభ్యర్థులు లేకపోవడంతో గత ఎన్నికల్లో చివరి నిమిషంలో మాజీ మంత్రి శిద్ధా రాఘవరావును అభ్యర్థిగా నిలిపారు చంద్రబాబు. అయిష్టంగానే పోటీ చేసిన శిద్ధా… ఏకంగా లక్షన్నర ఓట్ల తేడాతో ఓడారు. తర్వాత ఆయన వైసీపీలో చేరారు. నాటి నుంచి టీడీపీలో సరైన అభ్యర్థి లేడనే చెప్పాలి. దీంతో ఆ స్థానంలో పోటీ చేసి చేతులు కాల్చుకోవడం కంటే… పొత్తుల్లో భాగంగా దానిని బీజేపీకి కేటాయిస్తే తాము సేఫ్ సైడ్ లో ఉంటామనేది టీడీపీ నేతల భావన. ఓడితే నెపం కమలం నేతలపైన… గెలిస్తే.. తమ వల్లే అని క్రెడిట్ కొట్టెయ్యాలనేది తెలుగు తమ్ముళ్ల ఆలోచన. దీంతో రాబోయే ఎన్నికల్లో వైవీ సుబ్బారెడ్డి గెలుపు నల్లేరు మీద నడక అంటున్నారు రాజకీయ విశ్లేషకులు.