గుడివాడ టీడీపీలో తారాస్థాయికి వర్గ పోరు…!

గుడివాడ అసెంబ్లీ నియోజకవర్గం ప్రస్తుతం హాట్ టాపిక్ అనేది బహిరంగ రహస్యం, అందుకు ప్రధాన కారణం మాజీ మంత్రి కొడాలి నాని. వరుసగా నాలుగు సార్లు గుడివాడ నుంచి గెలిచిన నాని…. వైసీపీ ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత టార్గెట్ చంద్రబాబు, లోకేశ్ అన్నట్లుగానే వ్యాఖ్యలు చేశారు. ఒకదశలో ఈ వ్యాఖ్యలు శృతి మించాయనే విమర్శలు కూడా వచ్చాయి. దీంతో ఆయనకు టీడీపీ నేతలు బూతుల మంత్రి అనే పేరు కూడా పెట్టేశారు. అయినా సరే… నాని మాత్రం ఎక్కడా వెనుకడుగు వేయలేదు. పైగా టీడీపీ నేతలకు ఘాటుగానే బదులిచ్చారు. తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం నుంచి 1989 మినహా గుడివాడలో టీడీపీ ఓడింది లేదు. పార్టీ వ్యవస్థాపక అధ్యక్షులు నందమూరి తారక రామారావు వరుసగా రెండు సార్లు 1983, 1985 ఎన్నికల్లో గుడివాడ నుంచి పోటీ చేసి విజయం సాధించారు. ఆ తర్వాత నుంచి అక్కడ రావి కుటుంబానిదే పెత్తనం.

ప్రస్తుతం గుడివాడ అసెంబ్లీ నియోజకవర్గం టీడీపీ ఇంఛార్జ్ గా మాజీ ఎమ్మెల్యే రావి వెంకటేశ్వర్రావు వ్యవహరిస్తున్నారు. ఈయనకు టికెట్ ఇస్తే… మరోసారి గుడివాడ సీటు మీద ఆశలు వదులుకోవాల్సిందే అనేది టీడీపీ నేతలే చెబుతున్న మాట. 2004, 2009 ఎన్నికల్లో టీడీపీ తరఫున గెలిచిన నాని… 2014, 2019లో వైసీపీ తరఫన విజయం సాధించారు. జగన్ ప్రభుత్వంలో ఫస్ట్ టర్మ్ లోనే మంత్రిపదవి దక్కించుకున్నారు కూడా. ఇక గుడివాడలో కొడాలి నానికి మాస్ లీడర్ అనే పేరు కూడా ఉంది. అలాంటి వ్యక్తిని ఢీ కొట్టాలంటే… తప్పనిసరిగా అన్ని విధాలుగా సరైన వ్యక్తి కావాలని టీడీపీ అధినేత భావించారు.

అందులో భాగంగానే గుడివాడకే చెందిన ఎన్ఆర్ఐ వెనిగళ్ల రామును తీసుకువచ్చారు. కాపు సామాజిక వర్గానికి చెందిన రాము…. భార్య మాత్రం ఎస్సీ కావడంతో… అటు రెండు వర్గాల ఓట్లు తమకే వస్తాయని టీడీపీ ఆశలు పెట్టుకుంది. పైగా దాదాపు ఏడాది నుంచి నియోజకవర్గంలో విస్తృతంగా పర్యటిస్తున్న రాము… అన్న క్యాంటిన్, మెగా మెడికల్ క్యాంప్ నిర్వహిస్తున్నారు. అలాగే ప్రతి గ్రామంలో కూడా తన టీమ్ ద్వారా అవసరమైనా ఆర్థిక సాయం చేస్తా అంటూ హామీ ఇస్తున్నారు. దీంతో రాము వైపు టీడీపీ నేతలు ఎక్కువగా మొగ్గు చూపుతున్నారు. దీంతో ఇంఛార్జ్ రావి వెంకటేశ్వర్రావుతో వన్ టూ వన్ నిర్వహించిన చంద్రబాబు… ఈ సారి టికెట్ వెనిగళ్ల రాముకే అని ఖరారు చేసినట్లు తెలుస్తోంది. ప్రస్తుతానికి రాముకు సహకరించాలని… పార్టీ అధికారంలోకి వచ్చిన వెంటనే… తొలి విడతలోనే ఎమ్మెల్సీగా అవకాశం ఇస్తానని చంద్రబాబు హామీ ఇచ్చినట్లుగా సమాచారం. అయితే రావి మాత్రం…. అందుకు ససేమిరా అంటున్నట్లు తెలుస్తోంది. గతంలో కూడా 2019లో తానే అభ్యర్ఖిని అని చెప్పి… చివరి నిమిషంలో దేవినేని అవినాష్‌కు టికెట్ ఇచ్చారని… ఇప్పుడు కూడా అలాగే చేస్తే… నియోజకవర్గంపైన తన పట్టు పోతుందని రావి ఆగ్రహం వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది. రావికి టికెట్ ఇవ్వకపోతే… పార్టీ కోసం పని చేసేది లేదని ఆయన వర్గం నేతలు ఇప్పటికే అధిష్ఠానానికి సమాచారం ఇచ్చినట్లుగా తెలుస్తోంది. దీంతో గుడివాడ నియోజకవర్గం ఇప్పుడు టీడీపీలో హాట్ టాపిక్ గా మారింది.