ఇప్పటికే ఇద్దరు ఎంపీలు అవుట్… ఎలా గురూ…!

ఎన్నికల్లో గెలుపే టీడీపీ ప్రధాన లక్ష్యం. అందుకోసం దాదాపు ఏడాది ముందు నుంచే తీవ్రంగా శ్రమిస్తున్నారు టీడీపీ అధినేత. నిద్రావస్థలో ఉన్న నేతలందరనీ ముల్లుగర్ర తీసుకుని తట్టి లేపి మరీ యాక్టివ్ మోడ్ లోకి తీసుకువచ్చారు. 2019 ఓటమి తర్వాత… అసలు టీడీపీ నేతలున్నారా అనే అనుమానం కూడా తలెత్తింది. దీంతో ప్రతి నేతను మళ్లీ ప్రజల్లోకి తీసుకువచ్చేందుకు బాబు బాగానే కష్టపడ్డారనే చెప్పాలి. వైసీపీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఇప్పటికే పలు ప్రత్యేక కార్యక్రమాలు చేపట్టారు. ప్రజా వ్యతిరేక నిర్ణయాలు అంటూ ప్రజలకు నిర్ణయించే ప్రయత్నం చేశారు. గతానికి భిన్నంగా ఏకంగా ఏడాది ముందే ఎన్నికల మ్యానిఫెస్టో విడుదల చేశారు. అభ్యర్థులను కూడా ప్రకటించేస్తూ రేసులో తామే ముందున్నామని సంకేతాలు పంపుతున్నారు.

ఓ వైపు అధినేత ఇంతగా కష్టపడుతుంటే… క్షేత్రస్థాయిలో మాత్రం పరిస్థితి వేరుగా ఉంది. కొందరు కీలక నేతలు అధినేతను ఏ మాత్రం లెక్క చేయడం లేదు. మరి కొందరైతే సరైన అవకాశం కోసం ఎదురు చూస్తున్నారు. మరోసారి వైసీపీ గెలుపు ఖాయమంటూ సర్వేలు లీక్ అవుతున్నాయి. దీంతో కొన్ని నియోజకవర్గాల్లో ఇప్పటికీ అభ్యర్థులు ఖరారు కాలేదు. ఇదే సమయంలో పార్టీలో గెలిచిన ముగ్గురు ఎంపీల్లో ఇద్దరు సైలెంట్ అయిపోయారు. వారు రాబోయే ఎన్నికల్లో పోటీ చేస్తారో లేదో కూడా తెలియని అయోమయ పరిస్థితి. 2019 ఎన్నికల్లో శ్రీకాకుళం, విజయవాడ, గుంటూరు పార్లమెంట్ స్థానాలను మాత్రమే టీడీపీ గెలిచింది. వీటిల్లో ఇప్పుడు గుంటూరు, విజయవాడ ఎంపీలు వచ్చే ఎన్నిక్లల్లో పోటీ చేసేందుకు సిద్ధంగా ఉన్నట్లు లేదు. తాను ఎన్నికలకు దూరంగా ఉంటున్నట్లు గుంటూరు ఎంపీ గల్లా జయదేవ్ ఇప్పటికే అధినేతకు సమాచారం ఇచ్చినట్లు తెలుస్తోంది. ఇక విజయవాడ ఎంపీ కేశినేని నాని కూడా పోటీకి విముఖంగానే ఉన్నారు. అందుకే ఆయన స్థానంలో సోదరుడు కేశినేని చిన్నీని టీడీపీ నేతలు ప్రొత్సహిస్తున్నారు. వీరిద్దరు పోటీ చేయాలని అనుకోవడం లేదని… అందుకే లోకేశ్ చేపట్టిన యువగళం పాదయాత్రకు ఈ ఇద్దరు నేతలు దూరంగా ఉన్నారని రాజకీయ విశ్లేషకులు వ్యాఖ్యానిస్తున్నారు. సిట్టింగ్ ఎంపీలే పోటీకి దూరంగా ఉంటే…. ఇక కొత్త వారి సంగతి ఏమిటనే మాట ఇప్పుడు బలంగా వినిపిస్తోంది.